అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలు

విజయవాడ కనకదుర్గను దర్శించుకోండిలా.. ఏర్పాట్లు ఇవీ!

దేశవ్యాప్తంగా అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి. అటు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనా శరన్నవరాత్రుల సందడి మొదలైంది. నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొత్తం పది అలంకరణల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఏటా దసరా నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈసారి కరోనా దృష్ట్యా ఎంతమంది భక్తులను అనుమతించాలన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా భక్తుల సంఖ్య కుదించేందుకు ఆంక్షలను కఠినతరం చేయనున్నారు.

Also Read: వరద బాధితులకు జగన్ సర్కార్ సాయం.. ఉత్తర్వులు విడుదల..?

నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు. ‘నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. దర్శనానికి వచ్చే వారు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలి. మాస్క్ తప్పనిసరి. ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం కూడా పూర్తయింది. శనివారం శివాలయంలో దర్శనాలకు అనుమతి కల్పిస్తున్నాం. దసరాకి 74 వేల టికెట్స్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో బుక్ అయ్యాయి. ఇంకా కేవలం 1,500 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా భక్తులు వినియోగించుకోవాలి.’ అని స్వామినాయుడు సూచించారు.

ఈవో సురేష్ బాబు నవరాత్రుల ఏర్పాట్లపై మాట్లాడారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్లకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారు. ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్లకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ సారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్డులో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని చెప్పారు. వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు.

Also Read: దొంగ డాక్టర్ల పై సామాన్యుడి దండయాత్ర !

మరోవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈనెల 17వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

  • విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. విశాఖపట్నం– హైదరాబాద్ మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్ నూజివీడు–మైలవరం-–జీ కొండూరు–ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు.
  • విశాఖపట్నం–-చెన్నై మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్–-అవనిగడ్డ–-రేపల్లె–-బాపట్ల–-చీరాల మీదుగా మళ్లిస్తారు.
  • గుంటూరు –-విశాఖపట్నం మధ్య వాహనాలు బుడంపాడు నుంచి పొన్నూరు–-రేపల్లె–-అవనిగడ్డ–-హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.
  • విజయవాడ –- హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సులు రాకపోకలను పండిట్ నెహ్రూ బస్టాండ్–-చల్లపల్లి బంగ్లా–-బుడమేరు వంతెన -పైపుల రోడ్-సితార- గొల్లపూడి వై జంక్షన్ ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లించనున్నట్టు సీపీ ప్రకటించారు.
  • అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు 20వ తేదీ రాత్రి నుంచి ఉదయం వరకు ప్రకాశం బ్యారేజ్ మీదకు వాహనాలకు అనుమతి ఉండదని సీపీ తెలిపారు. .

Back to top button