ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

విద్యుత్ బిల్లులను రద్దు చేయండి..!

విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయి ఆదాయాలు లేక ప్రజలు అల్లాడుతుంటే దొడ్డి దారిన విద్యుత్ బిల్లులు పెంచి దొంగదెబ్బ తీశారంటూ టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు మూడు నెలల విద్యుత్ బిల్లును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు విజయవాడలో కేశినేని భవన్ లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కరోనా వల్ల రెండు నెలలుగా ప్రజలు లాక్ డౌన్ లో ఉంటే విద్యుత్ చార్జీల పెంచడం దారుణమని తెలిపారు. మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకూ అన్ని చోట్ల ఆందోళనలకు పార్టీ పిలుపునివ్వడంతో రాష్ట్రంలోని 160 నియోజకవర్గాల్లో, 620మండలాల్లో టిడిపి నిరసన దీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు 180 మంది, రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు 400 మంది పాల్గొన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే నిరసన దీక్షలు నిర్వహించారు.

ఈ సందర్భంగా లాక్ డౌన్ 3నెలలు కరెంటు ఛార్జీలు పూర్తిగా మాఫీ చేయాలని, పాత శ్లాబు విధానమే కొనసాగించాలనే డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కాంతులు – జగన్ పాలనలో రాష్ట్రంలో చీకట్లు. అప్పుడు కరెంటు తీగ పట్టుకుంటే షాక్. ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్. మేనిఫెస్టోలో కరెంటు ఛార్జీలు పెంచేది లేదని హామీ..ప్రమాణ స్వీకార వేదికపై కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని హామీ. మాట తప్పడం – మడమ తిప్పడం జగన్ నైజం..షేమ్ షేమ్ అంటూ టిడిపి నిరసన దీక్షల సందర్భంగా ప్లకార్డులు ప్రదర్శించారు.