ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

రాయలసీమకు నీళ్లు ఇవ్వడం న్యాయమేనా?

Is it fair to give water to Rayalaseema?

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తయితే కరువుతో నెర్రలు బారిన సీమ ప్రాంతం పచ్చబడుతుంది. అక్కడి కరువు తీరి పంటలు పండి రైతులు బాగుపడుతారు. వలసలు దూరమై వ్యవసాయం చేసుకొని ప్రజలు బతుకుతారు. కన్నీళ్లు ఆవిరయ్యే చోట కనకపు పంటలు పండుతాయి. ప్రజలు ఆనందపడుతారు. 1000 టీఎంసీలు ఇటీవల వర్షాలకు కృష్ణా నది ద్వారా వృథాగా సముద్రంలో కలిశాయి. కనీసం ఆ వరదనీటిని అయినా తరలిస్తే సీమ పచ్చబడుతుంది. విద్వేశాలు మాని సీమ గురించి వివేకంతో ఆలోచిస్తే సీమ కరువు తీరుతుంది. దక్షిణ తెలంగాణకు మేలు జరుగుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు.

కృష్ణా నది తెలంగాణ- రాయలసీమ మధ్య ప్రవహిస్తోంది. దక్షిణ తెలంగాణ , రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతాలు. రెండు ప్రాంతాలు పరస్పర సహకారంతో ప్రాజెక్టులను ఇచ్చిపుచ్చుకునే పద్ధ‌తిలో నిర్మించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం రెండు వెనుకబడిన ప్రాంతాల మధ్య విభజన వాదాలు తెస్తే పార్టీలకు లాభం జరగవచ్చు గానీ, రాయలసీమ , దక్షిణ తెలంగాణ ఇప్పటికే నష్టపోయిన నిజాలను నేతలు గుర్తించాలి.

రెండు ప్రాంతాల ప్రజలు వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. తరతరాలుగా నీళ్లు ఉన్నా వాడుకోకుండా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతం రాయలసీమ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం కోసం అడుగు ముందుకు వేశారు. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రజలు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా నిలవాలి. తెలంగాణ ప్రభుత్వం, నేతలు రాయలసీమ నీటి ప్రాజెక్టుల నిర్మాణంపై అసత్య ప్రచారాలను తిప్పి కొట్టి సీమ సమాజానికి వాస్తవాలను తెలిపి చైతన్య పరచాల్సిన బాధ్యత రాయలసీమ మేధావులపై ఉంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు లేవు అంటున్న తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అర్థం లేని ఆరోపణలు అని చెప్పవచ్చు. రాయలసీమలో నీటి దోపిడీ జరుగుతోంద‌ని. ఇలాంటి ఆరోపణలు తెలంగాణ ప్రభుత్వం , నేతలు తరచూ చేస్తున్నారు. రాయలసీమకు 131 టీఎంసీల నీటి హక్కు ఉన్నప్పటికి తీసుకుంటున్న నీరు సగం మాత్రమే. ఇక నీటి దోపిడీకి అవకాశం ఎక్కడ? అనుమతుల గురించి మాట్లాడుతున్న తెలంగాణ నేతలు పాలమూరు , దిండికి అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తున్నారు? ఏ అపెక్స్ కమిటీ తీర్మానం మేరకు కాళేశ్వరం నిర్మించారో సమాధానం లేదు. నేడు ఏపీకి 512 టీఎంసీల నీటి హక్కు కృష్ణలో ఉంది. పోతిరెడ్డిపాడు , సాగర్ వద్ద నీటి కొలతకు సంబంధించిన టెలిమీటర్స్ ఏర్పాటు చేయడం వల్ల ఎపి తెలంగాణ వాడుకుంటున్న ప్రతి నీటి చుక్క లెక్కిస్తారు. అలాంటి సమయంలో నీటి దోపిడీకి ఆస్కారం ఎక్కడ? అని సీమ వాసులు ప్రశ్నిస్తున్నారు.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి కాల్వల సామర్థ్యం పెంచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాస్తవానికి రాయలసీమకు అన్నీ కలిపి 131 టీఎంసీల నీటి హక్కు ఉంది. పోతిరెడ్డిపాడు వెడల్పు చేసి కాల్వల సామర్థ్యం పెంచినా కూడా వరదల సమయంలో పూర్తి హక్కును వాడుకోలేం. ప్రత్యేకించి సముద్రం పాలు అవుతున్న నీటిని వాడుకునే అవకాశం లేదు. అలాంటి సమయంలో సిద్దేశ్వరం సమీపంలో శ్రీశైలంలో 800 – 854 అడుగుల మధ్య రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడుకు డైవర్షన్ స్కీమ్‌తో బనకచర్ల కు వెళ్లే దారిలో 6వ కిలోమీటరు వద్ద కలుపుతారు.

శ్రీశైలంలో 800 – 854 అడుగులు మధ్య ఉండే నీటి విలువ 60 – 80 టీఎంసీలు మాత్రమే. ఈ మొత్తం కూడా నూతనంగా తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తరలింపు సాధ్యమేనా ? అని ప్ర‌శ్నించుకుంటే.. కాదు అనే స‌మాధానం వ‌స్తుంది. ఎందుకంటే ఎత్తిపోతల ఉద్దేశం 3 టీఎంసీలు. కానీ ఇది 854 అడుగులు ఉన్నపుడు లిఫ్ట్ చేసినట్లుగా అంతకన్నా దిగువ ఉన్నపుడు సాధ్యం కాదు. మరీ ముఖ్యంగా శ్రీశైలం నుంచి కుడి , ఎడమ కాల్వల ద్వారా నీటి విడుదల చేస్తూనే ఉన్నారు. మొత్తం నీరు రాయలసీమకు తరలిస్తారన్న విమర్శ సరికాదు. వరదలు ఉండి సముద్రంలోకి విడుదల చేసే సమయంలో ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు తరలించడానికి అవకాశం ఉంది. ఈ చర్య వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు. రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. వృథాగా సముద్రంలో కలిసే నీటికే సీమకు మళ్లిస్తే ఆ ప్రాంతం కరువు తీర్చిన వారు అవుతారు. సో సీమకు నీళ్లు ఇవ్వడం న్యాయమేనన్న వాదన వ్యక్తమవుతోంది.

Back to top button