జాతీయంరాజకీయాలుసంపాదకీయం

ఓటెత్తుతున్న బెంగాల్.. బీజేపీ వైపేనా?

Bengal polling
పశ్చిమ బెంగాల్ లో ఓటింగ్ పోటెత్తుతోంది. ఓటర్లు స్వచ్ఛందంగా తమ హక్కును వినియోగించుకుంటున్నారు. బెంగాల్ లో పట్టుకోసం బీజేపీ ప్రయత్నిస్తుండగా.. మమతా బెనర్జీ దానికి అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో పోలింగ్ శాతం నమోదు అవ్వడం రాజకీయ పార్టీల్లో ఒకింత ఆసక్తి.. మరోవైపు భయాన్ని రేపుతోంది. తొలిదశ పోలింగ్ లో 84.13శాతం, రెండోదశ పోలింగ్ లో 86.11శాతం, మూడోదశ పోలింగ్ లో 84.61శాతం ఓట్లు నమోదు అయ్యాయి. అదే విధంగా మిగితా దశల పోలింగ్ కు ప్రస్తుతం ప్రచారం జోరుగా కొనసాగుతోంది.

బెంగాల్ ఎన్నికలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానంగా టీఎంసీ.. బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.బెంగాల్ లో అధికారం సాధించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు ముందుకు వేస్తుంటే.. వారికి అడ్డుకట్ట వేయడానికి మమతా బెనర్జీ వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో అధికంగా నమోదు అవుతున్న పోలింగ్ శాతం ఫలితాలపై ఉత్కంఠను రేపుతోంది. అయితే అత్యధిక పోలింగ్ శాతం నమోదు అవ్వడం అది ప్రభుత్వ వ్యతిరేకత అంటూ సూచనలు ఇస్తుంది. ఓటర్లు భారీగా వచ్చి ఓటు వేస్తున్నారంటే అది అధికార పార్టీపై వ్యతిరేకతంతోనే ఇలా జరుగుతుందని విశ్లేషకులు చెబుతుంటారు. పోయిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ చంద్రబాబు కొంప ముంచి జగన్ కు అత్యధిక సీట్లు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో ఎక్కడైనా భారీ పోలింగ్ అంటే అది అధికారంలో ఉన్న పార్టీకి ఓటమి తప్పదనే విశ్లేషణలు సాగుతున్నట్టే లెక్క. ఇలా చూసుకుంటే.. ఇప్పటివరకు సగటును 82శాతానికి పైగా పోలింగ్ నమోదు అయ్యింది. దీంతో అధికార టీఎంసీలో గుబులు రేగుతోంది. కేంద్రంలోని బీజేపీకి బెంగాల్ పై ఆశపుడుతోంది.

మనదేశంలో 75శాతం పోలింగ్ నమోదు అవ్వడమే కష్టం. ఎందుకంటే ఓటర్ల జాబితాలో చాలా వరకు పొరపాట్లు ఉంటాయి. ఇలాంటి లిస్టును ఈసీ ఎప్పటికప్పుడు క్లియర్ చేయదు. దీంతో కనీసం 10శాతం ఓట్లను ఈ లెక్కలో తీసివేస్తుంది. అదే విధంగా పోలింగ్ అంటేనే చాలా మందికి అనాసక్తి ఉంటుంది. ఓటర్ ఐడీని కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే వాడుకునేవారు చాలా మంది ఉంటారు. పోలింగ్ రోజున క్యూకట్టి.. గంటలకొద్ది నిల్చుని ఓటు వేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వీటితో పాటు చాలాకారణాల వల్ల మనదేశంలో 60నుంచి 70శాతం పోలింగ్ నమోదు కాదు.

అలాంటిది ఇప్పుడు బెంగాల్ లో సగటున ఏకంగా 82శాతానికి పైగా ఓటింగ్ నమోదు అయ్యింది. ఓటర్ల జాబితాలోని పొరపాట్లను తీసివేస్తే.. 100శాతం నమోదు అయ్యినట్టే.. మరి పరిణామం.. మమతా పాలనకు వ్యతిరేకంగానా..? బీజేపీకి మద్దతుగానా..? అన్నది మరికొద్ది రోజుల్లో తేలుతుంది. మే రెండో తేదీన వెలువడే ఫలితాలు బెంగాల్ భవిష్యత్ ను తేల్చుతాయి.

Back to top button