ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

YS Jagan, Vijaya Sai Reddy : జ‌గ‌న్ – విజ‌య‌సాయి భ‌వితవ్యం తేలేది ఆ రోజేనా?

ఏపీ సీఎం జ‌గ‌న్, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయించేదాకా విశ్ర‌మించేది లేద‌ని భీష్మించిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు.. ఇద్ద‌రి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని వేర్వేరుగా సీబీఐ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ పై ఎప్పుడో పిటిష‌న్ వేసిన ర‌ఘురామ‌.. విజ‌య‌సాయిపై ఈ మ‌ధ్య‌నే వేశారు. ఇందులో జ‌గ‌న్ కేసులో విచార‌ణ పూర్తి చేసి, తీర్పు రిజ‌ర్వు చేసిన‌ న్యాయ‌స్థానం.. విజ‌య‌సాయి బెయిల్ పై విచార‌ణ కొన‌సాగిస్తోంది.

విజ‌య‌సాయి రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని వేసిన‌ పిటిష‌న్లో.. న‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు కోర్టు దృష్టికి ప‌లు విష‌యాలు తీసుకెళ్లారు. ఆయ‌న బెయిల్ ఎందుకు ర‌ద్దు చేయాలో అందులో వివ‌రించారు. ఎంపీ విజ‌యసాయిరెడ్డి త‌న అధికారాన్ని ఉప‌యోగించి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా సాక్షుల‌ను ప్ర‌భావితం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని పేర్కొన్నారు. అంతేకాకుండా.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు తీర్పు వెలువ‌డ‌నున్న‌ నేప‌థ్యంలో.. ఏ2గా ఉన్న విజ‌య‌సాయి విదేశాల‌కు పారిపోయే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల‌ ఆయ‌న బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరారు.

విజ‌య‌సాయి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని ఈ నెల 7వ తేదీన ర‌ఘురామ పిటిష‌న్ వేయ‌గా.. ఆ రోజునే కోర్టు విచార‌ణ చేప‌ట్టింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని విజ‌యసాయిని, సీబీఐని ఆదేశిస్తూ.. ఇందుకోసం మూడు రోజుల గ‌డువు విధించింది. కేసు విచార‌ణ‌ ఈ నెల 10కి వాయిదావేసింది. ఆ రోజు విచార‌ణ సంద‌ర్భంగా.. కౌంట‌ర్ దాఖ‌లుకు మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని సీబీఐ కోరింది. దీంతో.. మ‌రో మూడు రోజుల గ‌డువు ఇస్తూ.. కేసును 13వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

ఈ రోజు విచార‌ణ‌లో సీబీఐ త‌నదైన వాద‌న ఏమీ వినిపించ‌లేదు. కోర్టు మెరిట్ ప్ర‌కార‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని అఫిడ విట్ లో కోరింది. దాని ప్ర‌కార‌మే బెయిల్ ర‌ద్దు చేయాలా? లేదా? అనే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది. సీబీఐ అఫిడ విట్ స్వీకరించిన కోర్టు.. విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

అయితే.. జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ విచార‌ణ‌లోనూ సీబీఐ ఇదేవిధ‌మైన అభిప్రాయం వ్య‌క్తం చేసింది. కోర్టు మెరిట్ ప్రకార‌మే బెయిల్ ర‌ద్దు చేయాలా? వ‌ద్దా? అనే నిర్ణ‌యం తీసుకోవాల‌ని తెలిపింది. దీంతో.. కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందోన‌న్న ఉత్కంఠ అంద‌రిలోనూ నెల‌కొంది. సీబీఐ చెప్పాల్సిన విష‌యం ఏమీ లేక‌పోవడంతో.. 16వ తేదీ వాయిదాతో విచార‌ణ పూర్తి కావొచ్చ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, ఎలాంటి తీర్పువెల్ల‌డిస్తుంది అనే ఉత్కంఠ స‌ర్వ‌త్రా నెల‌కొంది.

ఇప్ప‌టికే.. జ‌గ‌న్ కేసు విచార‌ణ పూర్తి చేసి, తీర్పును రిజ‌ర్వులో ఉంచిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 25వ తేదీన తీర్పును వెలువ‌రించ‌నుంది న్యాయ‌స్థానం. విజ‌య‌సాయి విచార‌ణ కూడా వ‌చ్చే వాయిదాలో పూర్తిచేసి, రెండు తీర్పుల‌నూ 25వ తేదీన ప్ర‌క‌టించే అవ‌కాశం ఉందా? అనే చ‌ర్చ సాగుతోంది. దీనిపై 16వ తేదీ విచార‌ణ త‌ర్వాత స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Back to top button