ఆంధ్రప్రదేశ్జాతీయంరాజకీయాలుసంపాదకీయం

AP Financial Crisis : ఏపీలో ఆర్టిక‌ల్ 360ని ప్ర‌యోగిస్తారా? అమ‌లు చేస్తే ఏమ‌వుతుంది?

ap jobs calendar 2021

ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు ఎదుర్కొంటున్న‌ అతిపెద్ద ఇబ్బందుల్లో ఆర్థిక లోటు ఒక‌టి. ప్ర‌తినెలా 5 వేల కోట్ల‌కు పైగా అప్పులు చేయ‌క‌పోతే.. బండి ముందుకు క‌దిలే ప‌రిస్థితి లేదు. ప్ర‌తినెలా ఉద్యోగుల జీతాలు, పెన్ష‌న్ల కోసమే 5,550 కోట్లు.. అప్పుల వ‌డ్డీల‌కు, కొన్ని అప్పులు తీర్చ‌డానికి మ‌రో రూ.3,500 కోట్లు అవ‌స‌రం అవుతున్నాయి. ప్ర‌తినెలా చేస్తున్న 5 వేల కోట్ల అప్పు.. ఈ రెండింటికీ చాల‌ట్లేదు. ఈ అప్పు కూడా స‌కాలంలో ల‌భించ‌ని స‌మ‌యంలో జీతాలు ఆల‌స్య‌మ‌వుతున్నాయి.

ఈ విధ‌మైన ప‌రిస్థితుల్లో ఏపీ దివాలా అంచున ఉంద‌ని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక‌, వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు ఈ విష‌య‌మై ఏకంగా రాష్ట్ర‌ప‌తి లేఖ‌రాశారు. ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించే రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 360ని ఏపీలో అమ‌లు చేయాల‌ని కోరారు. దీంతో.. ఇప్పుడు ఏపీ ఆర్థిక స‌మ‌స్య దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. మ‌రి, ఆర్టిక‌ల్ 360 అమ‌లు చేస్తే ఏమ‌వుతుంది? ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉంది? అప్పుల సంగ‌తేంటీ? అన్న‌ది చూద్దాం.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏ రాష్ట్ర ప్ర‌భుత్వానికైనా.. ఆ రాష్ట్ర‌ స్థూల జాతీయోత్ప‌త్తిలో 4 శాతం వ‌ర‌కు అప్పులు చేసుకునేందుకు అనుమ‌తి ఉంది. దీని ప్ర‌కారం.. 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఏపీకి 42,472 కోట్ల వ‌ర‌కు అప్పులు చేసుకునే అవ‌కాశం ఉంది. కొన్ని పాత రుణాలు తిరిగి చెల్లించ‌డంతో.. ఆ మేర‌కు మ‌రికొంత అప్పు చేసుకునే వెసులుబాటు క‌లిగింది. ఈ మేర‌కు మొత్తం 51,592 కోట్ల అప్పులు చేసుకునే అవ‌కాశం ఏర్ప‌డింది.

కానీ.. లొసుగులు చాలా ఉన్నాయి. రాష్ట్రం తెచ్చిన అప్పుల్లో.. మూల ధ‌న వ్య‌యం కింద కొంత ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అంటే అభివృద్ధి కోసం ఖ‌ర్చు చేయాలి. గ‌తేడాదికి సంబంధించిన ఆ వివ‌రాల‌ను వెల్ల‌డించ‌లేద‌ని ఏపీ తెచ్చుకోద‌లిచిన అప్పుల్లోంచి రూ.5,309 కోట్ల మేర కేంద్రం కోత విధించింది. దీంతోపాటు.. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇప్ప‌టికే చాలా తీసుకున్నార‌ని కేంద్రం గుర్తించింది. ఈ మేర‌కు లెక్క‌లు క‌ట్టి మ‌రో 17,923 కోట్ల మేర అప్పుల్లో కోత పెట్టింది. ఈ విధంగా.. అన్ని కోత‌లూ పోనూ.. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో 27,688 కోట్లు మాత్ర‌మే అప్పు తీసుకునే అవ‌కాశం ఏపీకి ఉంద‌ని కేంద్రం తేల్చింది.

అయితే.. ఇటు చూస్తే.. ప్ర‌తినెలా 5 వేల కోట్ల‌పైన అప్పు వ‌స్తేనే.. ఖ‌ర్చులు వెళ్లిపోయే అనివార్య‌త ఏర్ప‌డింది. అందుకే.. జీతాలు స‌కాలంలో ప‌డ‌క ఉద్యోగులు, పెన్ష‌న‌ర్లు అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ప్ర‌తీ మంగ‌ళ‌వారం ఆర్బీఐ ద‌గ్గ‌ర బాండ్లు వేలం వేసి, వాటి ద్వారా 2 వేల కోట్ల అప్పులు తీసుకుంటూ వ‌స్తోంది ఏపీ. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ఏపీ.. దివాలా అంచున ఉంద‌ని, అందువ‌ల్ల రాష్ట్రంలో ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ప్ర‌క‌టించాల‌నే డిమాండ్ తెర‌పైకి వ‌స్తోంది. న‌ర్సాపురం ఎంపీ ఇదే విష‌యాన్ని రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్లారు.

ఆర్టిక‌ల్ 360 ప్ర‌కారం.. ఆర్థిక అత్య‌వ‌స‌ర స్థితిని దేశంలో ఎక్క‌డైనా విధించే అవ‌కాశం రాష్ట్ర‌ప‌తికి ఉంది. ఇది అమ‌ల్లోకి వ‌స్తే.. ఆర్థిక నిర్ణ‌యాల‌న్నీ రాష్ట్ర‌ప‌తి ప‌రిధిలోకి వెళ్తాయి. ఆర్థిక వ‌న‌రుల‌ను ఎలా ఉప‌యోగించాలో ఆదేశించే అవ‌కాశం కేంద్రానికి ల‌భిస్తుంది. పార్ల‌మెంట్ తో సంబంధం లేకుండా 2 నెల‌ల‌పాటు రాష్ట్ర‌ప‌తి ఈ ఆదేశాల‌ను అమ‌లు చేయొచ్చు. ఆ త‌ర్వాత పార్ల‌మెంట్ ఆమోదంతో కొన‌సాగించొచ్చు. అప్పుడు ఉద్యోగుల జీతాల‌ను స‌మీక్షించే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఆర్థిక అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని వినియోగించే అవ‌స‌రం రాలేదు.

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఐదేళ్ల‌లో 1.65 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేస్తే.. జ‌గ‌న్ స‌ర్కారు రెండేళ్ల‌లోనే 1.15 ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసింది. ఇవి కాకుండా.. వివిధ కార్పొరేష‌న్ల పేరుతోనూ అప్పులు చేశారు. సంక్షేమ ప‌థ‌కాల పేరుతో, న‌గ‌దు బ‌దిలీ అంటూ ప్ర‌జ‌ల‌కు పంప‌కాలు చేప‌ట్ట‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. మొత్తానికి.. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌నేది వాస్త‌వం. మ‌రి, ఆర్టిక‌ల్ 360ని ఏపీలో ప్ర‌యోగిస్తారా? లేదా? అన్నది చూడాలి.

Back to top button