ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

ఆంధ్ర సంక్షోభంపై మోడీ ఆలోచనేమిటి?

జగన్-మోడీ మీటింగ్ లో ఏం జరిగింది?

ఇంతకుముందే మేము అభిప్రాయపడినట్లు జగన్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ స్వాతంత్రానంతర భారత్ లో అతి పెద్ద సంచలనం. ఇది జగన్ ముఖ్యమంత్రి పదవికో, రమణ న్యాయమూర్తి పదవికో ముప్పు తెచ్చే అతి పెద్ద సంక్షోభం. ఈమాట మేము మొదటిరోజే చెప్పాము. ఒక ముఖ్యమంత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి తోటి సహచర న్యాయమూర్తిపై ఆరోపణలు చేయటం, ఆ తర్వాత దాన్ని బహిరంగపరచటం అతి పెద్ద సంఘటన. రాజ్యాంగ చరిత్రలో ఇటువంటి పరిస్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. అదే మేము చెప్పాము. అయితే దీనిపై కొంతమంది మిత్రులు మా సంపాదకీయంలో లేవనెత్తిన న్యాయపరమైన, వ్యవస్థలోని లోపాలపై వ్యాఖ్యానించకుండా ఇప్పటికే ఏర్పరుచుకున్న పార్టీల వైఖరి ఆధారంగా పోస్టులు పెట్టటం జరిగింది. అది  వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఇంతకుముందే ఎన్నోసార్లు ప్రస్తావించినట్లు ఆంధ్ర పరిస్థితులపై ఏమి వ్యాఖ్యానించినా దాన్ని రంగుటద్దాల నుంచే చూడటం తప్ప మేధోపరమైన చర్చవైపు దారి తీయటం లేదు. ఇది దురదృష్టకరం. అంతమాత్రాన మా వైఖరి మారదు. ఈ సమస్య ఉత్పన్నం కాక ముందునుంచీ మా వైఖరి ఒక్కటే. దేశంలోని అన్ని వ్యవస్థలకు (న్యాయ వ్యవస్థతో సహా) జవాబుదారి తనం ఉండాలి. ఇందులో ఒక జగన్ నో మరొక రమణ నో మేము చూడటం లేదు. ఇప్పుడు ఏర్పడిన ఈ సంక్షోభం నుంచి న్యాయ వ్యవస్థ పై సమగ్ర చర్చ జరిగి న్యాయ సంస్కరణలకు దారి తియ్యాలనేదే మా కోరిక.

జగన్ లేఖపై ఇప్పటివరకు వచ్చిన వాదనలపై చర్చిద్దాం 

దీనిపై వచ్చిన వాదనలు ప్రధానంగా రెండు మూడుగా విభజించవచ్చు. ఒకటి, జగన్ ఇప్పటికే అనేక కేసుల్లో ముద్దాయిగా వున్నాడు కాబట్టి ఆ కేసులనుంచి సమస్యను పక్కదారి పట్టించటానికి ఈ ఎత్తుగడ వేసాడనేది. ఇదే నిజమనుకుందాం. దానివలన ఆ కేసులు ఏవీ ఆగవు కదా. దాని పర్యవసానం ఈ లేఖలోని అంశాలపై ఆధారపడి లేదు. న్యాయమూర్తిగా, రేపు ప్రధాన న్యాయమూర్తిగా రమణ వున్నా వేరొకరున్నా సిబీఐ కోర్టులో కేసుల విచారణ ఆగదు. ఆ కేసుల్లో తీర్పు వచ్చేదాన్ని బట్టే ప్రధానంగా తన భవిష్యత్తు ఆధారపడి వుంటుంది. తీర్పు స్పష్టంగా ఆరోపణలను నిరూపించినప్పుడు శిక్ష అనుభవించక తప్పదు. కాబట్టి ఈ వాదనలో పస లేదు. వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి చేసిన నిర్దిష్ట ఆరోపణల నుంచి పక్కదారి మల్లించటానికే ఈ వాదన లేవనెత్తినట్లుగా అనుకోవాల్సి వస్తుంది. రెండోది, అసలు న్యాయవ్యవస్థపై ఒక ముఖ్యమంత్రి ఇలా ఆరోపణలు చేస్తే పట్టించుకుంటే రేపొద్దున న్యాయ వ్యవస్థ అస్తవ్యస్త మవుతుందని. ఇది న్యాయ వ్యవస్థలో భాగమైన న్యాయవాదులు, పూర్వ న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్లు మాట్లాడుతున్న, వాదిస్తున్న తర్కం. ఇది కొత్తదేమీకాదు. పార్లమెంటులో అన్ని పార్టీలు దాదాపు ఏకగ్రీవంగా జుడిషియల్ కమీషన్ బిల్లుని ఆమోదించినప్పుడు కూడా ఈ వర్గం ఇదే వాదన చేసింది. చివరకు ఈ వర్గం చేసిన ప్రచారాన్ని ఉపయోగించుకొని న్యాయమూర్తులు ఆ చట్టం చెల్లదని తీర్పు ఇచ్చింది. ఆరోజు దీనిపై అన్ని పార్టీలు దీనిని చీకటి రోజుగా వర్ణించాయి. ఈ చట్టం పార్లమెంటులో ఆమోదించినప్పుడు ఆంధ్రలోని తెలుగుదేశం, వైఎస్ ఆర్ సి పి కూడా సమర్ధించాయి. ఈరోజుకీ న్యాయమూర్తుల నియామకం రహస్యమే. ఇక మూడోది, రమణ ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవటానికి వేసిన ఎత్తుగడ. ఈ వాదన సహజంగా తలెత్తేదే. ఎన్నోచోట్ల అవతలి వారికి ప్రొమోషన్ వస్తుందంటే అడ్డుకోవటానికి ప్రయత్నం చేయటం సాధారణంగా జరుగుతున్నదే. అందుకే దీనిపై ప్రధాన న్యాయమూర్తి వెంటనే రమణగారి నియామకంకి అడ్డురాకుండా వుండే విధంగా నిర్దిష్ట కాలపరిమితి లోపల విచారణ పూర్తి చేయాలి. అంతేగాని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి లేవనెత్తిన ఆరోపణల్ని విచారణ లేకుండా కొట్టిపారేయలేరు. ఆ ఆరోపణల్లో నిజం లేకపోతే పిటీషన్ దారుపై చర్య తీసుకునే అధికారం కూడా సుప్రీంకోర్టుకి వుంది. అంతేగాని అసలు ఆరోపణలు చేసే హక్కే లేదనే అధికారం ఎవరికీ లేదు. చట్టంలో అందరూ సమానులే. చివరకు చట్టంపై వ్యాఖ్యానించే న్యాయమూర్తులతో సహా. చివరగా నాలుగోది, ముఖ్యమంత్రి లేఖ రాసినా బయటకు వెల్లడించటం తప్పనేది. ఈ వాదనలో అర్ధముంది. రాజ్యాంగ పదవుల్లో వున్న వ్యక్తులు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించే స్వేచ్చ వుండదు. ఒక ముఖ్యమంత్రి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కి రాసిన లేఖను ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చిందో కారణాలు చెప్పకుండా ప్రజలముందుకు తీసుకురావటం బాధ్యతారాహిత్యం. దానిపై ఖచ్చితంగా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రిని వివరణ కోరాల్సివుంది. అంతమాత్రాన ఆ మిషతో అసలు ఆరోపణలను విచారణలేకుండా  విస్మరించటం తగదు. సరే ఇక అసలు టాపిక్ కి వద్దాం.

జగన్-మోడీ మీటింగ్ లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందా?

ఇటువంటివి అధికారికంగా ఇరువైపులనుంచి వివరణ వచ్చే అవకాశాలు తక్కువ. ఇది మన విజ్ఞతకే వదిలిపెట్టారనుకుందాం. కాకపోతే అప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి ఎపి ముఖ్యమంత్రి తన చర్చల్లో ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశాలే మెండుగా వున్నాయి. దానికి కారణాలున్నాయి. ఒకటి , ఇద్దరూ రాజకీయనాయకులు. కేవలం సాంకేతికపరంగా మాట్లాడుకోవటం జరగదు. అదీ రెండు పార్టీలు పార్లమెంటులో సహకరించుకుంటున్నప్పుడు. రెండోది, ఎపి ప్రభుత్వం ఇప్పటికే అమరావతి భూముల విషయంపై సిబీఐ దర్యాప్తు కోరివుంది. కాబట్టి ఆ మేరకైనా ఖచ్చితంగా ప్రధానమంత్రితో చర్చించి వుండాలి. అది చర్చించినప్పుడు సహజంగానే దానిపై మరింత లోతుగా వివరాల్లోకి వెళ్ళే అవకాశాలే మెండుగా వున్నాయి. అదీ జగన్ మనస్తత్వం తెలిసినవారు అలా మాట్లాడకుండా కేవలం సాంకేతిక పరంగా మాట్లాడి వచ్చి ఉంటాడని నమ్మలేము. కాబట్టి ఏ విధంగా చూసినా జగన్ ప్రస్తావించకుండా ఉంటాడని అనుకోలేము.

ఇప్పుడు అందరి మనస్సులో వున్నదల్లా మోడీ జవాబు ఏమిటీ అనేదే. తన ప్రతిస్పందన ఎలా వుంది? తను సానుకూలమా? ప్రతికూలమా? దీనికి జవాబు కొన్నాళ్ళు పోతేగాని తెలియదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పాత్ర ఇటువంటి విషయాల్లో అసలు లేకుండా వుండదు. ఇప్పటికయితే ఇది శేష ప్రశ్నగానే వుంది. అదే సమయంలో ఒకటి మనం గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం సిబీఐ దర్యాప్తు కోరి కొన్ని నెలలయ్యింది. అయినా కేంద్రం ఏమి చేయబోతుందో తెలియదు. ఇప్పటికయితే సానుకూలంగా స్పందించలేదని చెప్పాలి. సానుకూలమయితే ఇప్పటికి సిబీఐ దర్యాప్తుకు ఆమోదించి వుండి  వుండాలి. అది జరగలేదు. ఇంకో ముఖ్య విషయం. నిజంగా ఆరోపణలు నిరూపించబడ్డాయే అనుకుందాం. అప్పుడైనా ఈ సమస్య పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. తుది నిర్ణయం తీసుకోవాల్సింది పార్లమెంటునే ( ఎందుకంటే సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్ని తొలగించే అధికారం కేవలం పార్లమెంటుదే కాబట్టి ). అందుకే ఈ మొత్తం సంఘటనలో మోడీ ప్రతిస్పందన కూడా కీలకం. అది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. చివరగా మరొక్కసారి చెప్పేదేమిటంటే ఈ ఘటన ఇటు జగన్, అటు రమణ గార్ల భవిత్యానికి ముడిపడివుందని, అలాగే న్యాయ వ్యవస్థపై సమీక్షకు ఇదో బంగారు అవకాశమని భావిస్తున్నాము.

Back to top button