ఆంధ్రప్రదేశ్

రైతు బిల్లులకు వైసీపీ మద్దతు.. జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

దేశవ్యాప్తంగా రైతులు, రైతు మదసంఘాలు.. వివిధ పార్టీలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులకు వైసీపీ మద్దతు

jagan
దేశమంతా కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో రైతులంతా రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారు. అక్కడ కంట్రోల్ చేయలేక పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పక్కనున్న తెలంగాణలో కూడా సీఎం కేసీఆర్ ఈ కేంద్రం తెస్తున్న మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం రైతు రాజ్యాన్ని ఏపీలో నెలకొల్పుతానంటూ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కేసుల భయానికి బీజేపీకి మద్దతిచ్చారా అని విమర్శిస్తున్నాయి.

Also Read: ప్రధానితో భేటికి కేసీఆర్, జగన్.. ఏం జరుగుతోంది?

వ్యవసాయ సంబంధ బిల్లులను సంబంధిత మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆదివారం ఉదయం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇదివరకే పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఈ బిల్లుతో ప్రయోజనమే కాని నష్టం లేదని నరేంద్రసింగ్‌ తెలిపారు. అలాగే రైతులు తమ ఉత్పత్తులను దళారులకు అమ్ముకోకుండా స్వేచ్ఛగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించుకోవచ్చని దీంతో తమకు కమీషన్ల బెడద లేకుండా అనుకున్న లాభాలు వస్తాయని పేర్కొన్నారు. విపక్షాలు ఈ బిల్లుపై అనవసరంగా రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

బీజేపీ ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులను  విపక్షాలు మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాయి. పాలక, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గందరగోళ పరిస్థితి నెలకొంది.

కానీ ఈ రైతు వ్యతిరేక బిల్లులకు రాజ్యసభలో వైసీపీ మద్దతు ప్రకటించడం సంచలనంగా మారింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీలు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని..కాంగ్రెస్ మధ్యదళారుల పార్టీ అని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ అభ్యంతరం తెలిపారు. విజయాసాయి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: ఏపీలో మత రాజకీయాలు దేనికి సంకేతం..?

దేశవ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు.. వివిధ పార్టీలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లులకు వైసీపీ మద్దతు ప్రకటించడం ఆ పార్టీకి మైనస్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ రైతు రాష్ట్రమని ఇలాంటి విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సీఎం జగన్ ఇలా భేషరతుగా మద్దతు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Back to top button