అత్యంత ప్రజాదరణప్రత్యేకం

పొరపాటున ఇతరుల ఖాతాల్లో డబ్బు జమ చేశారా.. ఏం చేయాలంటే..?

మనలో చాలామంది ప్రతిరోజూ వివిధ అవసరాల నిమిత్తం ఇతరుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బును పంపుతూ ఉంటారు. కొందరు ఆఫ్ లైన్ ద్వారా నగదును డిపాజిట్ చేస్తే మరి కొందరు ఆన్ లైన్ ద్వారా నగదును డిపాజిట్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మనం చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఇతరుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమవుతూ ఉంటుంది. అలాంటి సమయాల్లో చాలామంది ఏం చేయాలో అర్థం కాక కంగారు పడుతూ ఉంటారు.

ఒకటికి రెండుసార్లు బ్యాంక్ అకౌంట్ వివరాలు, పేరు, ఐ.ఎఫ్.ఎస్.సీ కోడ్ వివరాలను చెక్ చేసుకుంటే పొరపాటు జరగకుండా ఉంటుంది. అయితే పొరపాటున ఇతరుల బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తే మాత్రం వీలైనంత త్వరగా బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి మేనేజర్ ను సంప్రదించి మన సమస్య గురించి చెప్పాలి. మన అకౌంట్ వివరాలు, పొరపాటున జమ చేసిన అకౌంట్ వివరాలను అధికారులకు లెటర్ రూపంలో రాసి అందుకు సంబంధించిన ఆధారాలను జత చేయాలి.

మీరు డబ్బులు పొరపాటున పంపిన బ్యాంక్ కూడా మీ బ్యాంక్ అయితే త్వరగా డబ్బులు వెనక్కు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా వేరువేరు బ్యాంకులు అయితే మనం డబ్బులు పంపిన అవతలి బ్యాంకులో కూడా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు డబ్బులు జమ అయిన ఖాతాదారుడిని డబ్బులు వెనక్కు ఇవ్వమని కోరతాయి. ఖాతాదారుడు అందుకు అంగీకరిస్తే డబ్బులు తిరిగి మన ఖాతాలో జమవుతాయి.

డబ్బులు జమైన ఖాతాదారుడు డబ్బులు తిరిగి ఇవ్వడానికి అంగీకరించని పక్షంలో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి సరైన సాక్ష్యాలను సమర్పించి డబ్బులు వెనక్కు తెచ్చుకునే సౌకర్యం ఉంటుంది. అయితే వీలైనంత వరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో లావాదేవీలు జరిపే సమయంలో ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుంటే లావాదేవీల విషయంలో ఎటువంటి సమస్యలు ఉండవు.

Back to top button