ఆంధ్రప్రదేశ్గెస్ట్ కాలమ్రాజకీయాలుసంపాదకీయం

అమరావతి కధకు ముగింపు ఎప్పుడు?

అమరావతి రైతుల ఆందోళన 200 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విదేశీ భారతీయుల నిరసన గళం హడావుడి టీవీ మాధ్యమాల్లో ధ్వనించింది. విశేషమేమంటే ఇదికూడా ఇప్పటికే టిడిపి అనుకూల ముద్రపడిన టీవీ ల్లోనే వినిపించటంతో దానికి రావాల్సిన ప్రాముఖ్యత రాలేదు. ఇదేదో టిడిపి అనుకూల విదేశీయులు ఓ పధకం ప్రకారం ప్రచారం చేసారనే స్థానిక ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. కారణం అసలు ఆందోళన జరగాల్సిన ఆంధ్రలో పెద్దగా ప్రజా ఉద్యమంగా మారకపోవటం, రెండోది ఇప్పటికే ప్రజలు చంద్రబాబు అనుకూల, జగన్ అనుకూల వర్గాలుగా విడిపోవటం, మూడోది కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకూ వుధృతం కావటం , నాలుగోది ఇది రాజధాని పోరాటం కన్నా రైతుల పోరాటంగా మారటం , అయిదోది ఉత్తరాంధ్ర , రాయలసీమ ప్రజలు దీనిపై అంతగా ఆసక్తి చూపకపోవటం , ఆరోది అమరావతి లో భూములు కొనుక్కున్న ఎన్నారై ల పోరాటంగా వై ఎస్ ఆర్ పి ప్రచారం కొంతమేర ప్రజల్లోకి వెళ్ళటం, ఏడోది, ఎంత గింజుకున్నా జగన్ మొండివాడు కాబట్టి ఫలితం ఉండదనే నిరాశల్లోకి టిడిపి శ్రేణులు కూడా వెళ్ళటం, ఎనిమిదోది, సంవత్సరం లోపే చంద్రబాబు మీద క్రమ క్రమేణా విశ్వాసం సన్నగిల్లటం, చివరగా జగన్ తీసుకున్న సంక్షేమ పధకాలు ప్రజల్లో ప్రభావం చూపటం ఇవన్నీ కలిసి ఆంధ్రలో ప్రజా ఉద్యమంగా రాజధాని ఉద్యమం మారలేకపోవటం ఈ సంవత్సరం లో జరిగిన పరిణామం .

ముందుగా ఉద్యమ సరళిని పరిశీలిస్తే అమరావతి రైతుల పై ప్రారంభంలో అందరికీ సానుభూతి వుండేది. ఎందుకంటే అన్ని వేల ఎకరాలు స్వచ్చందంగా ఇవ్వటమనేది చరిత్రలో మరుపురాని ఘట్టం. వాళ్ళందరినీ ఒప్పించటం లో చంద్రబాబు నాయుడు పాత్రని అభినందించాల్సిందే. రెండోది, రైతులకు భూమి అంటే ప్రాణంతో సమానం. అటువంటిది రాజధాని తమ ప్రాంతంలో వస్తుందని , తమకు కేటాయించే స్థలాలకు కూడా మంచి విలువ వస్తుందని, దానిపై ఆదాయం కూడా బాగా వస్తుందని నమ్మటంతో ప్రాణంతో సమానమైన భూమిని కూడా వదులుకోవటం చిన్న విషయమేమీ కాదు. అయితే మెల్లి మెల్లిగా ఈ సానుకూలత మొదట్లో ఉన్నంత లేకపోవటానికి కారణాలు అనేకం. రైతు ఉద్యమం టిడిపి ఉద్యమం లాగా మారటం అన్నింటికన్నా పెద్ద బలహీనత. దానికి ఎవర్నీ తప్పుపట్టలేము. మొదట్లో వాళ్ళ తరఫున మాట్లాడి వాళ్ళను ఉద్యమబాటలో నడిపించటం లో టిడిపి పాత్ర నే ప్రధానం. అది రాష్ట్రవ్యాప్త ప్రజావుద్యమంగా మారివుంటే ఈ బలహీనత నే బలంగా మారి వుండేది. అలా జరగక పోవటం తో ఇది టిడిపి తన రాజకీయాలకు వాడుకుంటుందనే ప్రచారం వైపు కొంత సెక్షన్ మారటానికి దోహదపడింది. దానితో పాటు వై ఎస్ ఆర్ పి వ్యూహం కూడా కొంత ప్రజల్లోకి వెళ్ళింది. విశాఖ లో కార్యనిర్వాహక రాజధాని , కర్నూలు  లో న్యాయ రాజధాని అని ప్రకటించటంతో ఆ ప్రాంత ప్రజలు అమరావతి రాజధాని ఉద్యమం లో పాలుపంచుకోవటం తగ్గింది. ఇకపోతే ఎన్నారై లు భూములు కొన్నారనేది పాజిటివ్ కన్నా నెగటివ్ గా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం లో వై ఎస్ ఆర్ పి కొంతమేర సఫలీకృత మయ్యింది. దానితోపాటు ఈ భూములు కొన్నవాళ్ళలో ఒక సామాజిక వర్గం వారే ఎక్కువమంది వున్నారనే ప్రచారం కూడా ప్రజల్లోకి వై ఎస్ ఆర్ పి తీసుకెళ్ళింది. ప్రజాభిప్రాయం ఏర్పడటానికి ఒక్కోసారి ప్రచార సరళి ప్రభావాన్ని చూపుతుంది. ఈ ఉద్యమం రాజధాని కోసమా , రైతుల కోసమా అనేది కూడా ముఖ్యమే. ఉద్యమం సజీవంగా నిలబడాలంటే సరైన వ్యూహమే కీలకం. ఆ విషయం లో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడనే చెప్పాలి. ఎంత పెద్ద అనుభవజ్నుడైనా  ఫలితం రానప్పుడు విఫలమయినట్లే అనుకోవాలి.

రాజధాని విషయం పక్కన పెడితే అమరావతి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై వుంది. రైతుల గోడు వినని ప్రభుత్వం ఎప్పటికీ ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా పరిగణించబడదు. జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం రాష్ట్రం లో అత్యంత ఉన్నత పదవి లో వున్నాడు. అటువంటప్పుడు పట్టువిడుపులతో ఒక మెట్టుదిగి రైతులను స్వయంగా పిలిపించుకొని మాట్లాడితే తన ప్రతిష్టే పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే మిగతా విషయాల్లో ఎంత పేరుతెచ్చుకున్నా ఈ ఒక్క విషయం చాలు ప్రతిష్ట మంట గలవటానికి. రైతులు కూడా స్వతంత్రంగా ముఖ్యమంత్రి ని కలవటానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందోళనల కన్నా, ఒక పార్టీ తోకగా వున్నామనే అభిప్రాయం కన్నా ఏదోవిధంగా సమస్య పరిష్కారానికి చొరవ చూపటమే సరైన చర్య అవుతుంది. అటు జగన్ మోహన రెడ్డి ఇటు రైతులు పట్టు విడుపులతో వ్యవహరిస్తే రైతులకు మేలు జరుగుతుంది. రాజధాని సమస్యగా కాకుండా రైతు సమస్యగా ఇద్దరూ చూడగలిగేటట్లయితే కొంతమేర పరిష్కారమార్గం దొరుకుతుంది. ఆ దిశగా ఇద్దరూ ప్రయత్నాలు చేస్తారని ఆశిద్దాం.

Tags
Show More
Back to top button
Close
Close