అంతర్జాతీయంకరోనా వైరస్జాతీయంరాజకీయాలుసంపాదకీయం

కరోనా మహమ్మారి కట్టడికి చైనా నమూనా ఆదర్శమా ?

చైనా దేశం తీసుకున్న అద్భుత నివారణా చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తుంది. రెండో వైపు అసలు దీనికంతటికి కారణం చైనా దాచిన సమాచారమే నని కూడా జరుగుతుంది. ఏది నిజం. ఈ అనుభవం నుంచి తీసుకోవాల్సిన గుణపాఠాలేంటి? చైనా నిజంగా అంతటి ప్రశంసలకు అర్హురాలా ? ఇది ఎలావుందంటే చంపేసి తర్వాత పూడ్చటానికి సహాయపడ్డట్టు వుంది. దీనిలో కొంత అతివర్ణన వున్నా నిజంకూడా లేకపోలేదు. అవేమిటో పరిశీలిద్దాం.

అసలేం జరిగింది?

ఈ కొత్త వైరస్ పుట్టుక చైనాలోని వుహాన్ నగరంలో జరిగింది. మొట్టమొదటిసారిగా నవంబర్ 17వ తేదీన ఈ వైరస్ శాస్త్రజ్ఞులు గుర్తించటం జరిగింది. అయినా చైనా ఇది నిజమని ఒప్పుకోలేదు. డిసెంబరులో అనేక ప్రయోగశాలల్లో ఈ కొత్త వైరస్ చైనాలో గుర్తించటం జరిగింది. అయినా చైనా అధికారులు నిరాకరిస్తూనే వచ్చారు. డిసెంబర్ 30వ తేదీన చైనా డాక్టర్ లీ వింగ్లీయాంగ్ ప్రపంచాన్ని హెచ్చరిస్తూ సాక్ష్యాధారాలు అంతర్జాలంలో పెట్టారు. అది చైనా ప్రభుత్వానికి కోపాన్ని తెప్పించింది. చైనా కమ్యూనిస్టు పార్టీ డాక్టర్ లీ ని అధికారికంగా మందలిస్తూ తీర్మానం చేసింది. దాని అర్ధం చైనా సమాజంలో దాదాపు వెలివేసినట్లే. అతనిచేత బలవంతంగా చట్టవ్యతిరేక ప్రవర్తన చేశానని చెప్పించింది. దురదృష్టవశాత్తూ 5 వారాల తర్వాత ఆయన బయటకు తెచ్చిన వైరస్ బారినపడి చనిపోయాడు. ఈలోపు జనవరి 3వ తేదీన చైనా జాతీయ ఆరోగ్య మిషన్ అన్ని సంస్థలకు , ప్రయోగశాలలకు ఎటువంటి పరిస్థితుల్లో దీనికి సంబందించిన వార్తలను ప్రచురించరాదని , అలాగే దీనికి సంబందించిన సాంపిల్స్ అన్నీ నిర్మూలించాలని ప్రయోగశాలలకు ఆదేశాలు జారీచేసింది. అంతటితో ఆగకుండా జనవరి 14వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా చైనా లో మనిషి నుంచి మనిషి కి సోకే వైరస్ ఏదీ నిర్ధారణ కాలేదని చైనా అధికారులు చెప్పినట్లు ప్రకటన ఇప్పించింది.

ఇది జరిగిన కొద్దిరోజులకే వుహాన్ లో పడిపోతున్న మనుషుల వీడియోలు రహస్యంగా బయటకు పొక్కి ప్రపంచం లో వైరల్ అయ్యాయి. ఇక తప్పని పరిస్థితుల్లో జనవరి 20వ తేదీన బహిరంగంగా కొత్త వైరస్ వ్యాప్తిచెందినట్లు నిర్ధారించవలసి వచ్చింది. ఆ రోజుకి దాదాపు 217 మందికి వ్యాధి సోకిందని 4గురు చనిపోయారని ప్రకటించింది. అంటే నవంబర్ 17 వ తేదీనుంచి బయట ప్రపంచానికి తెలియటానికి రెండు నెలలు పట్టింది. అదీ వుహాన్ లో పడిపోతున్న మనుషుల వీడియోలు బయట ప్రపంచం లో వైరల్ అయిన తర్వాత. 3 రోజుల తర్వాత 23వ తేదీన వుహాన్ నగరం లో లాక్ డౌన్ ప్రకటించింది. మిగతాచోట్ల ఎక్కువమంది సమూహంలాగా గుమికూడవద్దని కూడా ప్రకటించింది. కానీ వుహాన్ నుంచి, మిగతా చోట్లనుంచి ఇతరదేశాల కు వెళ్లటాన్ని నిషేదించలేదు. అదే ప్రపంచాన్ని కొంపముంచింది. చైనీయులు అక్కడనుంచి ఇతరదేశాల కు ముఖ్యంగా యూరోప్ కి, అమెరికా కి నిరభ్యంతరంగా ప్రయాణించటం వలన అది చాలా వేగంగా అన్ని దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ లోపు డాక్టర్ లీ చనిపోవటం వుహాన్ లో పెద్ద కలకలం లేపింది. దీనికంతా ప్రభుత్వమే కారణమని ప్రజల్లో అశాంతి రగిలింది. కానీ లాక్ అవుట్ తో, ఇతర నిర్బంధాలతో దాన్ని కంట్రోల్ చేయగలిగింది. ఇదీ జరిగిన చరిత్ర.

వ్యవస్థీకృత ప్రచారం

తర్వాత చరిత్ర ప్రపంచానికి తెలిసిందే. చైనా అద్భుతంగా ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టిందనీ, ఇది మిగతా దేశాలకు ఆదర్శమని ప్రశంసలు కురిపించటం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక వైరస్ బాధితులు చైనాలో వున్నా అది మరుగున పడింది. ముందుగా సమాచార మివ్వకుండా , తెలిసిన తర్వాత వెంటనే అంతర్జాతీయ ప్రయాణాలు నిషేదించకపోవటం లాంటి అతిముఖ్య విషయాలు మరుగునపడేటట్లు చేయటం లో చైనా కొంతమేర కృతకృత్యరాలయింది. చివరకు ఏ యూరోప్ లో నయితే విస్తృత వ్యాప్తికి పరోక్షంగా కారణమయ్యిందో అదే యూరోప్ కి సాయమందిస్తున్నట్లు విస్తృత ప్రచారం చేసుకుంటుంది. అలాగే ఏ డాక్టర్ ని శిక్షించిందో అదే డాక్టర్ కుటుంబానికి ఇప్పుడు క్షమాపణలు చెప్పింది. మొదటిభాగమైన సమాచార నిర్బంధంపై కధనాలు ప్రచురించిన వాల్ స్ట్రీట్ జర్నల్, న్యూ యార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు విలేఖరులను దేశంనుంచి బహిష్కరించింది. అదేకాకుండా అమెరికా కనుక ప్రవర్తన మార్చుకోకపోతే మాదేశంలోనే తయారవుతున్న పారాసెటమాల్ , ఇబుప్రోఫెన్ లాంటి మందుల ఎగుమతి ని ఆపేస్తానని బెదిరించింది. దీనితోపాటు వుహాన్ లో వచ్చిన అశాంతి ని చల్లబర్చటానికి “కమ్యూనిస్టు పార్టీకి కృతజ్ఞతా ప్రచారాన్ని” ప్రారంభించింది. లాక్ డౌన్ ఎత్తివేయటానికి ముందే ప్రజల్ని తమ దారిలోకి తెచ్చుకోవటానికి కావాల్సిన విస్తృత ఎడ్యుకేషన్ కాంపెయిన్ మొదలుపెట్టింది. దాంట్లో భాగంగానే చైనా విదేశాంగ అధికారి ద్వారా అసలు దీనికంతటికి కారణం నవంబర్ లో అమెరికా రక్షణ నిపుణుల పర్యటనలో కుట్ర జరిగిందని ఆరోపించింది. దాన్ని వారి అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రముఖంగా ప్రచురించింది. తర్వాత ప్రపంచం మొత్తం లో వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆ ప్రకటనకు మేము దూరమని చెప్పింది. ఈ లోపల చైనా ప్రజలకు ఈ వార్త విస్తృతంగా ప్రచారంలోకి వెళ్ళింది. ఈ క్యాంపైన్ లో భాగంగానే వుహాన్ డాక్టర్ కుటుంబానికి క్షమాపణలు కూడా ప్రకటించి తప్పంతా పార్టీది కాదు ఎవరో కొద్దిమంది అధికారులదని చెప్పుకొచ్చింది. చివరకు ఏప్రిల్ 8వ తేదీన సాధారణ స్థితిని వుహాన్ లో పునరుద్దరించేనాటికి ప్రజల్లో సానుకూల వాతావరణాన్ని పునరుద్ధరించగలనని నమ్ముతుంది.

అనుభవం నేర్పుతున్న పాఠాలు

ఈ అనుభవం నుంచి ప్రపంచం నేర్చుకోవాల్సిన గుణపాఠాలేమిటి? ఈ అనుభవం మనకేం చెబుతుంది. భావ స్వేచ్ఛ, సమాచార స్వేచ్ఛ సమాజానికి , మానవాళికి ఎంత అవసరమో మరొక్కసారి నిరూపించబడింది. సమాచార నిర్బంధం , అభిప్రాయం వ్యక్తీకరణ నిర్బంధం లేకపోయినట్లయితే చైనా సమాజానికి, ప్రపంచానికి ఎంతో మేలు జరిగుండేది. చైనాలో ప్రజలు ముందుగా మేల్కొని ప్రభుత్వం మీద ముందస్తు ఒత్తిడి తెచ్చున్ డే వాళ్ళు. ఉదాహరణకు అమెరికాలో ట్రంప్ ని ముందస్తు చర్యలు తీసుకోకపోవటం పై ప్రజలు ఉతికి ఆరేశారు. ప్రజల ఒత్తిడిలేకపోతే అమెరికా ప్రభుత్వం ఇంకా ఆలస్యం చేసేది. ఇంకా ఎక్కువ సంఖ్యలో ఊహకందని రీతిలో నష్టం జరిగేది. ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఇంతదాకా వచ్చిందని అమెరికా సమాజం భావిస్తుంది. అలాగే ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంటే ఇంకా ముందుగానే గుర్తించటం, అంతర్జాతీయ ప్రయాణాలు నిషేదించటం లాంటి చర్యలు ఇంకా ముందుగానే చైనా ప్రజలకు అందుబాటులోకి వచ్చేవి. వచ్చిన తర్వాత చైనా ప్రభుత్వం అద్భుతంగా పనిచేయటం నిజమైనా అసలు ముందస్తుగా మేలుకొనివుంటే ఇంత అనర్ధం జరిగివుండేది కాదుకదా. చైనా మోడల్ ఎప్పటికీ ఆదర్శం కాదు. కేంద్రీకృత వ్యవస్థతో ప్రజలకు మేలు కన్నా కీడే జరుగుతుంది. పారదర్శకత, జవాబుదారీతనం లేని వ్యవస్థలు ప్రజలకు ఎప్పటికీ ఆదర్శం కాదు. తప్పుని కప్పిపుచ్చుకోవటానికి వ్యవస్తీకృత ప్రచారంతో ప్రజల అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం ఈరోజూ కొత్తేమీ కాదు. మొదట్నుంచీ జరుగుతుందే. రెండో కోణంలో అభిప్రాయాలు వ్యక్తపరిచే హక్కు లేనప్పుడు ప్రజల అభిప్రాయాల్ని మార్చటం పెద్ద కష్టమేమీ కాదు. ఇటీవలికాలంలో 10 లక్షలమంది ముస్లిం లను పునర్విద్య పేరుతో శిబిరాల్లో వుంచినప్పుడే వ్యవస్తీకృత వ్యవస్థ ప్రజల హక్కుల్ని ఎలా హరిస్తుందో అర్ధమయ్యింది.

చివరగా చెప్పేదేమంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో భావ స్వేచ్ఛ , సమాచార స్వేచ్ఛ ఎంత అవసరమో మరొక్కసారి ప్రజలకు అర్ధమయ్యింది. అది సంప్రదాయవాదం కావచ్చు, మధ్యేవాదం కావచ్చు, సామాజిక వాదం కావచ్చు . ఏ వాదమయినా పాటించే హక్కు ప్రజలకు , పార్టీలకు వుంది. కానీ అవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉండాలి. లేకపోతే చైనాలో జరిగిందే ఎక్కడైనా జరుగుతుంది. పారదర్శకత, జవాబుదారీతనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యమవుతాయి. అభిప్రాయం వ్యక్తపరిచే స్వేచ్ఛ ప్రజలకు వున్నప్పుడే ప్రజల హక్కులు కాపాడబడతాయనేది మరొక్కసారి చైనా అనుభవంలో ప్రపంచానికి రుజువయ్యింది.

Back to top button