జాతీయంరాజకీయాలుసంపాదకీయం

ఉదారవాదులా? అవకాశావాదులా?

ఉదారవాదాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది

మూడు రోజుల క్రితం బెంగుళూరు లో జరిగిన సంఘటనలు ఆందోళనకరంగా వున్నాయి. ఆ తర్వాత వస్తున్న ప్రతిస్పందనలు కూడా అంతకన్నా ఆందోళనకరంగా వున్నాయి. మొదటిది ఓ మతాన్ని కించపరిచేవిధంగా సాంఘిక మాధ్యమం లో పోస్టు పెట్టారనే కారణంతో పోలీసు స్టేషన్లు, ఎంఎల్ ఏ ఇల్లు తగలబెట్టటం, ఆస్తులు ధ్వసం చేయటం, ప్రాణ నష్టం జరగటం చూస్తుంటే మనం మధ్యకాలపు సమాజం లో వున్నామా లేక నాగరిక సమాజం లో వున్నామా అనే సందేహం కలగకమానదు. రెండోది దానిపై ప్రతిస్పందన ఇంకా దారుణంగా వుంది. అలా దాడిచేయటాన్ని హేతుబద్దీకరించే విధంగా వుదారవాదాన్ని గుత్తకు తీసుకున్న కొన్ని పార్టీలు, మేధావులు, ఇస్లామిక్ వాదులు మాట్లాడటం దారుణం. ఇటువంటి తరుణంలో రాజకీయాలకన్నా ఇటువంటి ధోరణల్ని అరికట్టటానికి అందరూ ఒకటి కాకుండా ఒకరిమీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం చూస్తుంటే అసలు వీళ్ళకు సమాజం మీద , చట్టాలుమీద ఏమైనా గౌరవముందా అని కూడా సందేహం వస్తుంది.

సమస్యని ఎలా పరిశీలించాలి?

భారత సమాజం వివిధ మతాల, కులాల, ప్రాంతాల , సంస్కృతుల సమాహారం. అటువంటప్పుడు ఉద్భవించే సమస్యలు కూడా అలానే వుంటాయి. ఇప్పటికే ఎన్నో సార్లు మత ఘర్షణలతో దేశం అట్టుడికి పోయింది. 21వ శతాబ్దం లోకి ప్రవేశించి ఇప్పటికే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. మతాన్ని సమాజం నుంచి విడదీసినవారు, మత సమస్యలతో సతమతం కాని సమాజం లో నివశించే వారు మిగతా ప్రపంచం కన్నా ముందంజలో వున్నారు. ఉదాహరణకు ప్రాశ్చాత్య దేశాల్లో మతం పాత్ర రోజు రోజుకీ తగ్గుతుంది. పశ్చిమ యూరప్ , అమెరికా, చైనా, దక్షిణ కొరియా, జపాన్ లలో ఏ మతాన్ని నమ్మనివాళ్ళ సంఖ్య గణనీయంగా వుంది. మతాన్ని నమ్మేవాళ్ళు కూడా దాన్నో సాంఘిక సమస్యగా కాకుండా వ్యక్తిగతంగా మతాన్ని ఆచరించటం వరకే పరిమితమయ్యారు. ఒక్క చైనా లో ప్రధాన చైనా కాని జిన్జియాంగ్ , టిబెట్ లలోనే ఇది సమస్యాత్మకంగా వుంది. కానీ ప్రధాన భూభాగం లోని హాన్ జాతీయుల్లో ఇది అసలు సమస్యే కాదు. ఒక్కసారి ఈ దేశాల సామాజిక, ఆర్ధిక పరిస్తితులు పరిశీలిస్తే ఈ దేశాలు , సమాజాలు మిగతా ప్రపంచం కన్నా అభివృద్ధి లో ముందున్నారు. ఇందులో ఒక్క చైనా తప్పించి మిగతా దేశాలన్నీ ప్రజాస్వామ్య దేశాలు. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ ని నమ్మేవారు. ఇక్కడ భావ స్వేచ్చ పూర్తిగా వుంది. దాన్నే మనమూ రాజ్యాంగం లో పొందుపరుచుకున్నాము. కానీ ఆచరణ లో పాటించే దానికన్నా ఉల్లంఘించటమే చేస్తుంటాము.

ఉదాహరణకు అమెరికా లో భావ స్వేచ్చ అంటే మీ మనసులోని భావాలు ఎటువంటివైనా వ్యక్తపరిచే హక్కు వుంటుంది. క్రైస్తవ మతస్తులు అత్యధికంగా వున్న ఈ దేశం లో జీసస్ క్రీస్తు పుట్టుక దగ్గర్నుంచి ఎన్నో వివాదాస్పద పుస్తకాలు తన గురించి, క్రైస్తవమతం గురించి ప్రచురిస్తుంటారు. ప్రభుత్వం ఎక్కడా వీటిని నిషేదించిన దాఖలాలు లేవు. అదేవిధంగా మిగతా ఎన్నో వివాదాస్పద విషయాలపై కూడా. కానీ భారత్ లో ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ ని రాజ్యాంగం లో పొందు పరుచుకున్నా స్వాతంత్రానంతరం నిషేధించిన పుస్తకాలు చాలా వున్నాయి. మత పరంగా చూస్తే ముఖ్యంగా ఇస్లాం మతానికి వ్యతిరేకంగా రాస్తే అవి నిషేధానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. అదే హిందూ మతాన్ని గురించి, హిందూ దేవుళ్ళ గురించి వ్యతిరేకంగా రాస్తే అవి ఎన్నో పునర్ముద్రణలు కూడా జరుగుతాయి. వ్యక్తిగతంగా అటువంటి ఎన్నో పుస్తకాలు నా చిన్నప్పుడు చదివిన అనుభవం వుంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవిస్తుంది. అటువంటి స్వేచ్చే లేకపోతే హేతువాదం ఎలా అభివృద్ధి చెందింది? చార్వాకుడు భౌతిక వాదాన్ని ఎలా ప్రచారం చేయగలిగాడు?

ఇంకో ఉదాహరణ కూడా ప్రస్తావిస్తాను. ఇరాన్ ఇస్లామిక్ విప్లవం పేరుతో అయతుల్లా ఖోమైనీ షా సామ్రాజ్యాన్ని కూల్చి ఇస్లామిక్ రిపబ్లిక్ ని స్థాపించటం ఎలా సాధ్యమయ్యింది? షా హయాం లో నిర్బంధాలకు లోనైతే యూరప్ వెళ్లి పారిస్ లో కొన్నాళ్ళు వున్నాడు. అది ఎలా సాధ్యమయ్యింది? ఆధునిక ప్రజాస్వామ్య దేశమైన ఫ్రాన్స్ ఆశ్రయమిచ్చింది కాబట్టే. అలా యూరప్ లో తలదాచుకున్న ఇతర దేశాల నాయకులు ఎంతోమంది వున్నారు. కానీ అదే అయతుల్లా ఖోమైనీ అధికారం చేపట్టిన తర్వాత అసమ్మతి వర్గీయుల ను ఏరిపారేసిన సంగతి తెలిసిందే. అంటే అర్ధం మీ రాజకీయ అభిప్రాయాలకు సంబంధం లేకుండా ఆధునిక ప్రజాస్వామ్య దేశం లో ఎవరైనా స్వేచ్చగా జీవించవచ్చు. కానీ దురదృష్టవశాత్తు ఇది నియంతృత్వ దేశాల్లో, ఇస్లామిక్ దేశాల్లో ( అత్యధిక దేశాల్లో , కొన్ని మినహాయింపు), కమ్యునిస్టు దేశాల్లో సాధ్యం కాదు. అక్కడ భావ వ్యక్తీకరణ నిర్బంధం వుంటుంది. ఉదాహరణకు తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ ( కొంత మెరుగైన హక్కులున్న ఇస్లాం దేశం) నుంచి ప్రాణ భయం తో పారిపోయి ప్రపంచం అంతా తిరిగి భారత్ కి వచ్చి వుంటుంది. టిబెట్ రాజు దలైలామా చైనా కమ్యునిస్టు పరిపాలన కి భయపడి భారత్ కి వచ్చి తలదాచుకున్నాడు. అదే భారత్ లో మీ అభిప్రాయాలు ఎటువంటివైనా నివశించే హక్కు వుంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే సాధ్యం. కాబట్టి భావ స్వేచ్చనే ఆధునిక ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ. దాన్ని ఎట్టిపరిస్థితుల్లో కాపాడుకోవాల్సిన అవసరం వుంది.

మరి ఇప్పుడు జరిగిందేమిటి?

బెంగుళూరు స్థానిక ఎంఎల్ ఎ మేనల్లుడు పేస్ బుక్ లో ఇస్లాం మతం మీద ఒక పోస్టు పెట్టాడని ( అదేమిటో తెలియదు) మూక హింస కు పాల్పడ్డారు. అతన్ని బెదిరించటం, అతని మామ ఎంఎల్ఎ ఇంటిని తగలపెట్టటం, పోలీసు స్టేషన్ లను తగల పెట్టటం, ఎన్నో ఆస్తులను ధ్వసం చేయటం , ఈ దుర్ఘటనలో కొంతమంది ప్రాణాలు కోల్పోవటం ఎంతోమందికి గాయాలవ్వటం, అందులో పోలీసులే ఎక్కువగా వుండటం జరిగింది. వస్తున్న వార్తల్ని బట్టి ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగింది. ఉత్తర ప్రదేశ్ ఇమాం ఒకరు పోస్టు పెట్టిన నవీన్ ని చంపితే 51 లక్షల బహుమతి ప్రకటించాడు. అంటే చట్టాన్ని తమ చేతులోకి తీసుకొని శిక్షలు కూడా విధిస్తున్నారు. విశేషమేమంటే ఇస్లాం దేశాల్లో కూడా శిక్షలు చట్ట ప్రకారమే వేస్తున్నారు. కాకపోతే ఆ చట్టాలు దారుణంగా వున్నాయి అదివేరే విషయం. మన పక్కన పాకిస్తాన్ లో గవర్నర్ ని ఇస్లాం దూషణ పేరుతో చంపినా దిక్కులేదు. అది అక్కడున్న సమాజం తలనొప్పి, మనకొద్దు. కానీ మనం ప్రజాస్వామ్య దేశం లో ఉన్నాము. పరిపాలన చట్టప్రకారమే జరగాలి. ఎవరికివారు ఆటవిక రాజ్యం జరపరాదు. చట్టమంటే మనదేశంలో ఎవరికీ భయం లేదు, గౌరవం లేదు. లేకపోతే 51 లక్షల రివార్డ్ ప్రకటించటాన్ని ఏమనాలి? మత దూషణ పోస్టింగ్ ఎంత తప్పో చంపమని ప్రోత్సహించటం కూడా అంతకన్నా పెద్ద తప్పు.

ఇకపోతే ప్రతిస్పందన ఎందుకు దారుణమంటే మూక హింస ను ఖరాఖండిగా ఖండించాల్సింది పోయి సన్నాయి నొక్కులు నొక్కటం దారుణం. పోలీసుల వైఫల్యముందని, పేస్ బుక్ పోస్టు పెట్టటమే దీనికంతటకీ కారణమని మూక హింస ని పరోక్షంగా సమర్ధించటం చూస్తుంటే ఎవరికైనా మతిపోతుంది. మత దూషణలు ఈ రోజు కొత్తేమీ కాదు. నా చిన్నప్పుడు హిందూ మతం పై ఎన్నో సెటైర్లు, విమర్శలు వినటం, చదవటం జరిగేది. అప్పట్లో అన్నింటినీ విని సహించే ఓర్పు వుండేది. ఎంత దాకా అంటే డి కే ఉద్యమం లో పెరియార్ దేవుళ్ళకు చెప్పుల దండలు వేసి ఊరేగించిన చరిత్ర మనది. ఎం ఎఫ్ హుస్సేన్ సరస్వతి దేవి నగ్న చిత్రాలు గీయటం, రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం పుస్తకం వ్రాయటం కూడా మన సమాజం లోనే చూసాం. మరి ఆ రచయితలందరికీ మరణశిక్షలు విధించారా? మరి ఒక్క ఇస్లాం మతం విషయం లోనే ఇలా అసహన చర్యలు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి. అంటే వీటిని సమర్దించినట్లు కాదు. అవి ఎవరి మత సెంటిమెంట్ నైనా గాయపరిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకొనే అవకాశం వుంది. అంతేగాని ఈ మూస హింస పద్దతుల్లో పరిష్కార మార్గాలు వెదుక్కోవటాన్ని ఎటువంటి పరిస్థితుల్లో సహించరాదు.

హేతువాదులు, ఉదారవాదులు ఎక్కడున్నారు?

హిందూ మతం పై, దాని ఆచారాలపై విరుచుకుపడే వీళ్ళు ప్రస్తుతం ఎక్కడ వున్నారు. హేతువాదులు హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని దూషించినప్పుడు భావ స్వేచ్చని గురించి ఎంతోమంది మేధావులు పుంఖాను పుంఖాలుగా వ్యాసాలూ, ఉపన్యాసాలు దంచేశారు కదా. మరి ఇప్పుడు ఇస్లాం మతంపై పోస్టింగు పెడితే ఇంత హింస, హత్యా బెదిరింపులు చేస్తూ వుంటే ఏం చేస్తున్నారు. ఆరోజు కలబుర్గి, లంకా గౌరేష్ ని హత్య చేయటం ఎంత తప్పో ఇప్పుడు ఇస్లాం మత వ్యతిరేకులపై హత్యా బెదిరింపులు కూడా అంతే తప్పు. హత్యా విధానాలు ఎక్కడ జరిగినా తప్పే. ఆ రోజు ఆ హత్యలపై మాట్లాడిన హేతువాదులు ఈ రోజు ఏమయ్యారు? రామచంద్ర గుహ లాంటి మేధావులు వుండేది బెంగుళూరు లోనే కదా. నిర్ద్వందంగా ఖండించారా? ఎందుకీ ద్వంద ప్రమాణాలు? మనం నిజంగా ఆధునిక ప్రజాస్వామ్యాన్ని నమ్మితే అందరికీ భావ స్వేచ్చ వుందని మరిచిపోవద్దు. మతాన్ని నమ్మే వాళ్లకు ఎంత స్వేచ్చ వుందో, హేతువాదాన్ని నమ్మే వాళ్లకు కూడా అంతే స్వేచ్చ వుంది. ఉదారవాదమంటే ఏమిటి? అన్ని భావాల్ని సమంగా గౌరవించటమే. లేకపోతే మనది పేరుకు ప్రజాస్వామ్యం, ఆచరణలో ఆటవిక రాజ్యమవుతుంది. బెంగుళూరు లో జరిగిన ఘటనలను అరమరికలు లేకుండా ఖండించినప్పుడే మీరు నిజమైన ఉదారవాదులవుతారు. లేకపోతే ఉదారవాద ముసుగులో వున్న హిందూ వ్యతిరేకవాదులుగా మిగిలిపోతారు, గుర్తుంచుకోండి.

Tags
Back to top button
Close
Close