జాతీయంరాజకీయాలుసంపాదకీయం

జమ్మూ-కాశ్మీర్ జాతీయ స్రవంతి లో భాగస్వామ్యమవుతుందా?

గత ఆగస్టు లో జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్విభజన చేయటం, ఆర్టికల్ 370, 35ఎ ని రద్దుచేయటం మోడీ 2.0 పాలనలో సంచలనాత్మక నిర్ణయాలు. దీని పర్యవసానం ఎలా వుంటుందో అప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు.  రాజకీయపార్టీల నాయకుల్ని నిర్బంధంలోకి తీసుకోవటం, పూర్తి సైనిక దిగ్బంధం లో వుంచటంతో తక్షణ ప్రతిచర్యలు పెద్దగాలేవు. ఒకవిధంగా చెప్పాలంటే అదివరకటి కంటే ఉగ్రవాద చర్యలు తగ్గాయనే చెప్పాలి. దీనికి స్థానిక ప్రభుత్వ యంత్రాంగం, సైన్యం సమన్వయం తో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ పకడ్బందీ నియంత్రణ చర్యలు చేపట్టటం కారణం. సంవత్సరాంతానికి శాంతిభద్రతలు పూర్తి అదుపులో వుండటంతో మెల్లి మెల్లిగా నిర్బందాల్ని సడలించటం మొదలుపెట్టారు. ప్రస్తుతం కొద్దిమందిని తప్పిస్తే  రాజకీయ నాయకుల్ని విడుదల చేయటం కూడా జరిగింది. ఫోన్,మొబైల్ సదుపాయాల్ని పునరుద్ధరించారు. ఇంటర్నెట్ 2 జి వరకు అనుమతిచ్చారు. మిగతా రాజకీయ నాయకుల్ని కూడా త్వరలో విడుదల చేస్తారని తెలుస్తుంది. మధ్యలో కరోనా మహమ్మారి నేపధ్యం లో గత మూడు నెలలనుంచి ప్రాధాన్యం మారింది. అయినా రెండోవైపు రాజకీయ ప్రక్రియ సమాంతరం గా నడుస్తుంది.

ముఖ్యమైన రాజకీయ ప్రక్రియ ఆరంభం 

మార్చి లో జరిగిన రెండు  ప్రభుత్వ చర్యలతో  జమ్మూ-కాశ్మీర్ రాజకీయాలు వేడెక్కాయి. ఒకటి , నియోజక వర్గాల పునర్విభజన కోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ ని నియమించటం . రెండోది, స్థానికతని నిర్ధారించి నివాస ప్రమాణ పత్రాన్ని జారీచేయటానికి మార్గదర్శకాలు విడుదల చేయటం. ఈ రెండూ జమ్మూ-కాశ్మీర్ భవిత్యాన్ని మార్చే రాజకీయ ప్రక్రియలే. అందుకే దీనిపై రాజకీయ పార్టీలు, నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అవేమిటో విపులంగా పరిశీలిద్దాం.

నివాస ప్రమాణ పత్రం ( Domicile Certificate)

దీని వివరాల్లోకి వెళ్లేముందు ఇంతకుముందు పరిస్థితి ని కూడా తెలుసుకోవాల్సివుంది. జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రం లో కేంద్ర చట్టాలు వర్తించవు. అవి తిరిగి జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ అనుమతి పొందిన తర్వాతనే ఆ రాష్ట్రాల్లో అమలవుతాయి. ఎందుకంటే జమ్మూ-కాశ్మీర్ కి ప్రత్యేక రాజ్యాంగం వుంది. దాని ప్రకారం అసెంబ్లీ లో ఆమోదం తప్పనిసరి. మన భారత రాజ్యాంగం లో అధికరణ 370, 35 ఎ లు ఈ ప్రత్యేక ప్రతిపత్తిని  కాపాడుతున్నాయి. అధికరణ 35 ఎ ప్రకారం జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రం లో ” శాశ్వత నివాసి” అనే నిబంధన ని తీసుకొచ్చారు. ఈ “శాశ్వత నివాసి” కే అన్ని హక్కులూ వుంటాయి. ఆస్తిని కొనుగోలుచేయటం దగ్గర్నుంచి చివరకు అసెంబ్లీ కి ఓటు హక్కు కూడా వీరికే వుంటుంది. అందుకే దేశం లో ఎక్కడా లేనివిధంగా ఈ రాష్ట్రం లో రెండు ఓటర్ల లిస్టులు ఉండేవి. పార్లమెంట్ లో ఓటు వేసే అందరికీ అసెంబ్లీ లో ఓటు హక్కు లేదు. అసెంబ్లీ లో ఓటు వేయాలంటే “శాశ్వత నివాసి” అయి వుండాలి. ఆ అర్హత అందరికీ రాదు. ఉదాహరణకు పాకిస్తాన్ విభజనతో జమ్మూ-కాశ్మీర్ కి వచ్చిన శరణార్ధులు ఇప్పటికీ ” శాశ్వత నివాసులు ” కారు. అలాగే ఎంతోమంది ని వివిధ కారణాలతో అనర్హులుగా ప్రకటించారు. 1990 ఘటనల తర్వాత లక్షలాది కాశ్మీర్ పండిట్లు అక్కడనుంచి తరిమివేయబడిన తర్వాత వాళ్ళు ఆ రాష్ట్ర శాశ్వత నివాసులు కారు. వాళ్ళ పేర్లన్నీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. గత సంవత్సరం లో ఆగస్టులో పార్లమెంటు ఆమోదించిన చట్టం ప్రకారం ఈ కాలం చెల్లిన నిబంధనలు రద్దయ్యాయి.

వీటి స్థానంలో కొత్తగా స్థిర నివాస ( domicile) నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా 15  సంవత్సరాలు జమ్మూ-కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం లో నివాసమున్నా, 7 సంవత్సరాలు చదివి 10 వ లేక 12 వ తరగతి పరీక్షలకు హాజరైనా,వలసదారుడిగా కమీషన్ ముందు నమోదు చేసుకున్నా, 10 సంవత్సరాలు ప్రభుత్వం లో గానీ, ప్రభుత్వ రంగం లో గానీ, ప్రభుత్వ బ్యాంకు ల్లోగానీ కేంద్ర విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో గానీ పనిచేసిన ఉద్యోగుల పిల్లలూ, బయట పనిచేసే , వ్యాపారం చేసుకునే జమ్మూ-కాశ్మీర్ వాసుల పిల్లలకు, పశ్చిమ పాకిస్తాన్ శరణార్ధులకు, స్థానికేతరులను పెళ్ళాడిన కాశ్మీర్ స్త్రీల పిల్లలకు స్థిర నివాస నిర్వచనం వర్తిస్తుంది. అంటే ఇన్నాళ్ళు జమ్మూ-కాశ్మీర్ తో సంబంధముండి కూడా శాశ్వత నివాసం పేరుతో కాశ్మీర్ సమాజం లో భాగస్వామ్యం కాని అందరూ మొట్టమొదటసారి అర్హులయ్యారు. ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయి. దీనికి సంబంధించిన ప్రమాణ పత్రం కోసం  దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో కనుక తహిసిల్దార్ ఇవ్వకపోతే 50 వేల రూపాయలు  ఆ అధికారి కి శిక్షగా వేస్తారు. దీనికింద బయటనున్నలక్షలాది కాశ్మీర్ పండితులతో పాటు ఎంతోమంది కొత్తగా స్థానికులుగా నమోదు అయ్యే అవకాశం వచ్చింది. కొంతమంది కాశ్మీర్ నాయకులు  ప్రచారం చేస్తున్నట్లు ఈ ప్రక్రియతో రాష్ట్ర జనాభా లో ఏమీ మార్పులు రావు. ఈ కొత్త విధానంతో జమ్మూ-కాశ్మీర్ లోకి మిగతా ప్రాంతాలనుంచి విచ్చలవిడిగా వలస వచ్చే అవకాశాలు లేవు. అంతకుముందు జరిగిన తప్పుల్ని సరిదిద్దటం వరకే ఈ విధానం లో అవకాశముంది.

దీనితోపాటు 2010 జమూ-కాశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగాల చట్టం లో శాశ్వత నివాసం స్థానం లో స్థిరనివాసం పదాన్ని చేరుస్తూ ఈ సంవత్సరం మార్చి , ఏప్రియల్ లో సవరణలు చేసింది. ప్రభుత్వ అంచనాల ప్రకారం షుమారు 84 వేల ఖాళీలు ప్రభుత్వ ఉద్యోగాల్లో వున్నాయి. అందులో 10 వేలు తక్షణం భర్తీ చేయటానికి ప్రకటన ఇచ్చింది. దీనిపై రాజకీయ పార్టీలు స్థానికులకు ఉద్యోగాలు రాకుండా బయట వాళ్లకు కొత్త నిబంధనల ప్రకారం వస్తాయని విమర్శచేస్తున్నారు. నిరుద్యోగం అధికంగా వున్న కాశ్మీర్ లో ప్రభుత్వ కొత్త స్థిర నివాస నిబంధన ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీని ఏ విధంగా కాశ్మీరీ యువత స్పందిస్తుందో చూడాలి. ఇది అతి సున్నిత సమస్య.

నియోజకవర్గాల పునర్విభజన కమీషన్ నియామకం 

జమ్మూ-కాశ్మీర్ తో పాటు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్ లకు కలిపి నియోజక వర్గాల పునర్విభజన కమీషన్ ని నియమించారు. 2019 జమ్మూ-కాశ్మీర్ పునర్నిర్మాణ చట్టం ప్రకారం 2011 జనాభా లెక్కల ఆధారంగా జమ్మూ-కాశ్మీర్ లో ఈ పునర్విభజన చేపడతారు. మిగతా రాష్ట్రాల్లో 2002 పునర్విభజన చట్టం ప్రకారం 2001 జనాభా లెక్కర ప్రకారం చేబడతారు( ఇక్కడ భద్రతా కారణాలతో 2002 లో పునర్విభజన జరగలేదు). అన్నింటికీ కలిపి సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి రంజన ప్రకాష్ దేశాయ్ కమీషనరుగా, ఎన్నికల కమీషనరు సుశీల్ చంద్ర సభ్యుడిగా, రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ఎన్నికల కమీషనర్లు సభ్యులుగా నియమితులయ్యారు. వీరికి సలహా సభ్యులుగా ఆయా రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు/ శాసన సభ్యులు వుంటారు. ఒక సంవత్సరం లోపు ఈ కమీషన్ తన నివేదికను సమర్పిస్తుంది.

జమ్మూ-కాశ్మీర్ లో 1995 లో చివరిసారిగా పునర్విభజన జరిగింది. మొత్తం దేశం లో నాలుగు సార్లు జరిగితే జమ్మూ-కాశ్మీర్ లో కేవలం రెండు సార్లే జరిగింది. అదీ జనాభాతో సంబంధం లేకుండా కాశ్మీర్ లోయకు ఎక్కువ స్థానాలు కేటాయించటం జమ్మూ ప్రాంత వాసులకు ఖేదం కలిగించింది. దీనిపై మతంతో సంబంధం లేకుండా జమ్మూ వాసులందరూ మొదట్నుంచీ కాశ్మీర్ నాయకులపై గుర్రుగా వున్నారు. ప్రస్తుతం కాశ్మీర్ లో 68 లక్షల 88 వేల జనాభావుంటే జమ్మూ లో 53 లక్షల 78 వేల జనాభా వున్నారు. ఈ లెక్కలపై కూడా ఆరోపణలున్నాయి. ప్రస్తుతం కాశ్మీర్ లోయకు అసెంబ్లీ లో 46 స్థానాలుంటే జమ్మూ కి 37 స్థానాలు వున్నాయి. జమ్మూ-కాశ్మీర్ పునర్నిర్మాణ చట్టం ప్రకారం జమ్మూ-కాశ్మీర్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 107 నుంచి 114 కి పెరుగుతాయి. ఇందులో 24 స్థానాలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కోసం పక్కన ఉంచుతారు. అవి పోతే ప్రస్తుత 83 స్థానాలు 90 కి పెరుగుతాయి. 2011 జనాభా ప్రకారం జమ్మూకి అదనంగా 5 , కాశ్మీర్ కి 2 స్థానాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దీనితో జమ్మూ ప్రాంత బలం అసెంబ్లీ లో అదివరకటి కన్నా పెరుగుతుంది. ఇది కాశ్మీరీలకు ఏ మాత్రమూ ఇష్టం లేదు.

ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాలు కాశ్మీర్ ప్రాంత వాసులే ఎన్నిక అవుతూ వచ్చారు. గులాం నబీ ఆజాద్ జమ్మూ నుంచి ఎన్నికైనా కాశ్మీరీలదే హవా. అందుకే అక్కడ రాజకీయ పార్టీలు ఈ కమీషన్ ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ పునర్విభజన సలహా సంఘం లో జమ్మూ-కాశ్మీర్ కి చెందిన అయిదుగురు పార్లమెంటు సభ్యుల్లో ఇద్దరు భారతీయ జనతా పార్టీకి, ముగ్గురు నేషనల్ కాన్ఫరెన్స్ కి చెందినవారు. నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు ముగ్గురూ ఈ సలహా సంఘం లో చేరటానికి నిరాకరించారు. ఇప్పటికే మహబూబా  ముఫ్తీ ఆధ్వర్యం లోని పిడిపి దీన్ని వ్యతిరేకించింది. ఇది ఇలావుంటే జమ్మూ లోని పాంథర్స్ పార్టీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ పునర్విభజన చేపట్టటాన్ని వ్యతిరేకిస్తుంది. 2011 జనాభా లెక్కలు  తప్పుల తడక అనీ దీని ప్రకార మయితే జమ్మూ వాసులకు అన్యాయం జరుగుతుందని వాదిస్తుంది. అలాగే డిల్లీ లోని కాశ్మీర్ పండిట్ల సంఘం కూడా ఈ కమీషన్ నియామకాన్ని వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే 2 లక్షలకు పైగా బయట వున్న కాశ్మీర్ పండిట్లకు ఓటు హక్కు కల్పించకుండా ఈ పునర్విభజన జరిగితే వాళ్ల గొంతు వినిపించే అవకాశం కోల్పోతామని చెబుతున్నారు. కాబట్టి కొత్త స్థిర నివాస నిబంధనల ప్రకారం స్థిర నివాస ప్రమాణ పత్రం అందరికి వచ్చిన తరవాత వీరిని  ఓటరుగా నమోదు చేసుకున్న తర్వాతనే ఈ పునర్విభజన చేపట్టాలని చెబుతున్నారు. అంటే 2021 జనాభా లెక్కల ప్రకారమే నన్నమాట. ఇప్పటి కమీషన్ ప్రకారం వచ్చే కొద్దిపాటి వెసులుబాటు కూడా ఇలా అయితే రాదు. అందుకే ప్రభుత్వం వున్నరాజ్యాంగ పరిమితుల్లో జమ్మూ కి న్యాయం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే జమ్మూ-కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయి.

మోడీ నూతన కాశ్మీర్ విధానం విజయవంతమవుతుందా?

ఈ రెండు ప్రక్రియలు జమ్మూ-కాశ్మీర్ లో సున్నితంగా తయారయ్యాయి. వీటిని ప్రభుత్వం స్థానిక ప్రజల్ని ఒప్పించి అమలుచేయగలిగితేనే మోడీ ప్రభుత్వ కాశ్మీర్ విధానం విజయవంతమవుతుంది  .దీనితోపాటు ఈ 10 నెలల్లో జమ్మూ-కాశ్మీర్ లో గణనీయమైన ఆర్ధిక, సామాజిక పురోగతి కన్పించలేదు. ఇదే అన్నింటికన్నా ప్రధానమయినది. జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర యంత్రాంగం పూర్తి అవినీతి, బంధుప్రీతి, అసమర్ధ పరిపాలన కు పేరుగాంచింది. గత పది నెలల నిర్బంధం తో జమ్మూ-కాశ్మీర్ ప్రాంత ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలి పోయింది. ప్రధాన ఆదాయ వనరులైన పర్యాటకం, హస్తకళలు, ఐటి లు నిర్వీర్యమయ్యాయి. దానిమీద ఆధారపడ్డ లక్షలాది మంది  నిరుద్యోగులయ్యారు.ఉద్యానవన రంగం కుదేలయ్యింది. ఇంటర్నెట్ నిషేధం తో మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. ఏ విధంగా చూసినా జమ్మూ-కాశ్మీర్ ప్రజల ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో కోలుకోలేనంత దెబ్బతింది. దీనిపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.

ఈ నేపధ్యం లో జమ్మూ-కాశ్మీర్ పరిస్థితులు ఎలా మలుపు తిరుగుతాయో చెప్పలేము. ప్రస్తుతానికయితే శాంతి భద్రతలు ఫర్వాలేదనిపిస్తుంది. కరోనా మహమ్మారి రాకముందే శ్రీనగర్ సాధారణ పరిస్థితులకు దగ్గరగా వున్నట్లు , ట్రాఫిక్ జాం లు లాంటి పరిస్థితులు తిరిగి ఏర్పడ్డాయని పరిశీలకులు భావించారు. దానితోపాటు సంతోషకర వార్తా ఏమిటంటే ఉగ్రవాదం లోకి స్థానిక రిక్రూట్మెంట్ అదివరకటి కన్నా తగ్గిందని గూఢచారి వర్గాల కధనం. ఆగస్టు 5 కి ముందు నెలకు 14 మంది స్థానిక యువత ఉగ్రవాదం లో చేరితే తర్వాత ఆ సంఖ్య 5 కి తగ్గిందని చెబుతున్నారు. ఈ 10 నెలల్లో భద్రతా వర్గాలు ఉగ్రవాదం పై పట్టు సంపాదించాయని చెప్పొచ్చు. అయితే ఇది శాశ్వతం కావాలంటే ప్రభుత్వం చక చకా పునర్నిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెల్లగలగాలి. అప్పుడే జమ్మూ-కాశ్మీర్ జాతీయ స్రవంతి లో కలిసి అభివృద్ధి బాటలో పయనిస్తుంది.