అంతర్జాతీయంరాజకీయాలుసంపాదకీయం

అమెరికా ఎన్నికల్లో భారతీయ సంతతి వారు ఎటువైపు?

భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?

అమెరికా ఎన్నికలు రెండువారాల్లో జరగబోతున్నాయి. వాస్తవానికి ఇప్పటికే మొదలయ్యాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలట్, ముందస్తు ఎన్నికలు మొదలయ్యాయి. కరోనా మహమ్మారి నేపధ్యంలో మెయిల్ ఇన్ బ్యాలట్ పద్ధతి లో పోస్టల్ బ్యాలట్ ని గణనీయ సంఖ్యలో ఎంచుకుంటున్నారు. అలాగే ముందస్తుగా పోలింగ్ కేంద్రాల దగ్గర గంటల తరబడి నించొని ఓటు వేస్తున్నారు. అయినా ఎక్కువమంది ఇప్పటికీ నవంబర్ మూడో తేదీనే ఓటు వేస్తారు. ఎక్కువమంది అనుకునేది మెయిల్ ఇన్ ఓట్లలో అధిక శాతం డెమొక్రాట్ ఓటర్లు వినియోగించుకుంటారు. రిపబ్లికన్లు స్వయంగా పోలింగ్ బూతుకి వెళ్లి ఓటు వేయటానికే ఇష్టపడతారు. దానికి కారణం లేకపోలేదు. బాగా చదువుకున్న వాళ్ళు,యువకులు ఎక్కువమంది డెమొక్రాట్ అభ్యర్ధి వైపు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళలో ఎక్కువమంది మెయిల్ ఇన్ ఓటు వేయటానికి ఇష్టపడుతున్నారు.

ఎన్నికల అంచనాలు ఎలా వున్నాయి?

ఇప్పటి అంచనాల ప్రకారం బైడెన్ కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది పరిశీలకుల అభిప్రాయం. రోజువారీ ఒపీనియన్ పోల్ అంచనాలు చూస్తే ట్రంప్ కి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. అలా అని పూర్తిగా కొట్టిపారేయలేము కూడా. 2016లో అన్ని ఒపీనియన్ పోల్స్ హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని చెప్పాయి. కానీ అనూహ్యంగా ట్రంప్ గెలవటం జరిగింది. అప్పుడు కూడా దేశవ్యాప్త పాపులర్ ఓటు హిల్లరీ వైపే వుంది. ఇంతకుముందు వ్యాసాల్లో చెప్పుకున్నట్లు దేశవ్యాప్త పాపులర్ ఓటుకి ఎన్నికల్లో గెలవటానికి సంబంధంలేదు. రాష్ట్రాలవారి ఎలెక్టోరల్ కాలేజి సంఖ్య మొత్తం కలుపుకొని 538 లో 270 ఎవరికి  వస్తే వారే గెలుస్తారు.ఇప్పటికి ఖచ్చితంగా గెలుస్తామనుకున్న రాష్ట్రాలను అంచనా వేస్తే 200 కి పైగా ఎలెక్టోరల్ కాలేజి ఓట్లు బైడేన్ కి వున్నాయి. అదే ట్రంప్ కి 100 కి పైగా మాత్రమే వున్నాయి. మిగతా ‘పోటీ’ రాష్ట్రాల్లో ఎక్కువభాగం గెలిస్తేనే ట్రంప్ ఎన్నికవుతాడు. అదే బైడెన్ అందులో కొన్ని గెలిచినా ఎన్నికయ్యే అవకాశం వుంది. అందుకే అవకాశాలు బైడెన్ కే వున్నాయని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఈ ‘పోటీ’ రాష్ట్రాల్లో ఎక్కువభాగం రిపబ్లికన్లకు మొదట్నుంచీ బలంగా వున్న రాష్ట్రాలు. అదేసమయంలో ఈ రాష్ట్రాల్లో జనాభాలో మార్పులు రావటం, నగరీకరణ జరగటం వలన డెమోక్రాట్లకు అవకాశాలు మెరుగయ్యాయని పరిశీలకుల అంచనా.

2016 అంచనాలు తప్పటంతో ఒపీనియన్ పోల్స్ పై మొట్టమొదటసారి అనుమానాలు తలెత్తాయి. అమెరికాలో సెఫాలజి శాస్త్రం బాగా అభివృద్ధి చెందింది, ప్రజలు కూడా నిర్భయంగా అభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. అయినా అంచనాలు తప్పటం అందరికీ ఆశ్చర్యమేసింది. అందుకే ఈసారి తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఈ సంస్థలు చెబుతున్నాయి. మరి వీటి అంచనాల ప్రకారం ఈ ‘పోటీ’ రాష్ట్రాల్లో కూడా బైడెన్ కే ఆధిక్యత వుందని ప్రకటించాయి. ఈ ప్రకటించిన వాటిలో ట్రంప్ అనుకూల ఫాక్స్ న్యూస్, వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా వుండటం విశేషం. కాకపోతే ట్రంప్ మద్దతుదారులు ఈ అంచనాలను కొట్టిపారేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో కూడా ఈ సమయానికి హిల్లరీకి షుమారు 7 శాతం ఆధిక్యత వుందని చెప్పాయని ఈ సంస్థల అంచనాలను మేము నమ్మమని చెబుతున్నారు. ట్రంప్ మీటింగులు మంచి ఉత్సాహంగా, ఉత్తేజ భరితంగా కొనసాగుతున్నాయి. తన మద్దతుదారులు ఎప్పటిలాగే అత్యంత హుషారుగా కేరింతలు, చప్పట్లతో మీటింగుల్లో పాల్గొంటున్నారు. కాకపోతే అది ఒక్కటే సరిపోదని అన్నివర్గాల ప్రజలకి ట్రంప్ దూరమయ్యాడని బైడెన్ అనుచరులు చెబుతున్నారు. ఈ వాదనని కొట్టివేయలేము. ఎందుకంటే 2016 అనుభవంతో డెమోక్రాట్లు తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్ధమవుతుంది. బైడెన్ అనుచరులతో పాటు బెర్నీ సాండర్స్ అనుచరులు, మిగతా వామపక్ష వాదులు కూడా ఈసారి పూర్తి ఇక్యతతో ట్రంప్ ని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో వున్నారు.అలాగే పట్టణ శివారు ప్రాంత మహిళలు కూడా పట్టుదలతో ఈసారి ఓటు వేస్తారని చెబుతున్నారు. వీటన్నింటి తోపాటు ఈసారి సీనియర్ సిటిజెన్లు ట్రంప్ కి దూరంగా జరిగారని సర్వేలు చెబుతున్నాయి. పోయిన సారి వీరే ప్రధానంగా ట్రంప్ ని గెలిపించారని చెప్పొచ్చు. చివరికి ట్రంప్ కి గట్టిగా మిగిలింది కాలేజి యేతర తెల్ల జాతీయ పురుషులు. సీనియర్ సిటిజెన్లలో వున్న ఆధిక్యతను కోల్పోవటం ట్రంప్ కి పెద్ద దెబ్బగా చెబుతున్నారు. ఈ అన్ని అంశాల కారణంగా ట్రంప్ ఓటమి ఖాయమని ఎక్కువమంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

భారతీయ సంతతివారి ప్రభావం, భారత్ తో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?

ముందుగా భారతీయ సంతతి వారి గురించి మాట్లాడుకుందాము. మనం అమెరికా ఎన్నికల్లో అంత ప్రభావం చేసే స్థాయిలో లేమని గమనించాలి. మొత్తం జనాభాలో భారతీయ సంతతి అమెరికా పౌరుల శాతం బాగా తక్కువ వుంది. అమెరికా పౌరుల్లో మనం ఒక్క శాతం కూడా లేము. ఇకపోతే మన జనాభా కేంద్రీకరించిన న్యూ జర్సీ, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఇల్లినాయ్, వాషింగ్టన్ రాష్ట్రాల్లో అసలు పోటీనే లేదు. అవన్నీ ఇప్పటికే డెమొక్రాట్ల వైపు ఖచ్చితంగా వున్న రాష్ట్రాలు. ఇక ‘పోటీ’ రాష్ట్రాల్లో ఎంతశాతమున్నా లెక్కనే. ఆ విధంగా చూస్తే టెక్సాస్,ఫ్లోరిడా,పెన్సిల్వేనియా, విస్కాన్సిన్,మిచిగాన్,జార్జియా,నార్త్ కరోలినా లాంటి రాష్ట్రాల్లో వున్న భారతీయ సంతతి వారు ఎటువేస్తారనేది చర్చనీయాంశమే. పోయినసారి గుంప గుత్తగా హిల్లరీ కి వేశారు. ఈసారి అలా ఉండకపోవచ్చు. ముఖ్యంగా గుజరాతీలు, ఉత్తర భారతీయ మూలాలు వున్న వారు ట్రంప్ కి వేస్తారని అనుకుంటున్నారు. అలాగే మన తెలుగువాళ్ళలో కూడా ఈసారి రెండు పార్టీలకి మధ్య చీలతాయని అనుకుంటున్నారు. ఇతరదేశాలనుంచి వచ్చి పౌరులైన వారిలో భారతీయ సంతతి వారే అధిక వేతనం పొందుతున్నారు. వీరిలో బైడెన్ వస్తే పన్నులు పెంచుతాడనే భావన వున్నవాళ్ళు గణనీయంగా వున్నారు. అందుకే ఈసారి భారతీయ ఓటర్లు చీలి ఓటేయటం ఖాయంగా కనిపిస్తుంది. భారతీయ సంతతికి చెందిన  కమలా హారిస్ డెమోక్రటిక్ తరఫున ఉపాధ్యక్షురాలిగా పోటీ చేస్తున్నా భారతీయ అమెరికన్లలో ఆశించినంత గుంప గుత్తగా ఒక వైపు పడకపోవచ్చని పరిశీలకుల అంచనా. అదీగాక ఆమె కాశ్మీర్ విషయంలో పమీల జయపాల్ తీర్మానాన్ని బలపరిచిందనే  వాదన రిపబ్లికన్ మద్దతుదారులు బలంగా ప్రచారం చేశారు. మొత్తంమీద చూస్తే అమెరికన్ భారతీయులు రెండువైపులా చీలి ఓటు వేస్తారని అంచనా. ఇటీవలి సర్వే 70 శాతానికి పైగా బైడెన్ కి ఓటు వేస్తారనేది నిజం కాదనిపిస్తుంది. మెజారిటీ బైడెన్ కి పడినా ట్రంప్ కి కూడా గణనీయంగా పడే అవకాశం లేకపోలేదు.

ఇకపోతే ప్రవాస భారతీయుల్లో పౌరులు కానివారు ఎక్కువమంది బైడెన్ గెలవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ట్రంప్ వచ్చిన తర్వాత హెచ్ 1 బి వీసాల విషయం లో ఎన్నో నిర్బంధ విధానాలు ప్రవేశ పెట్టాడు. అలాగే గ్రీన్ కార్డ్ విషయంలో బైడెన్ దేశీయ కోటా విధానం ఎత్తివేసి నిపుణుల కోటాలో వున్న అందరికీ శాశ్వత నివాసం కల్పిస్తానని    ప్రకటించాడు. దాదాపు 3 లక్షలకు పైగా ప్రవాస భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి వీళ్ళందరూ బైడెన్ రావాలని కోరుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు పౌరులుకాదు, ఓటు హక్కు లేదు.

ఇక భారత -అమెరికా సంబంధాల్లో ఎవరు గెలిస్తే బాగుంటాయనేది అందరి మనస్సులో వున్న ప్రశ్న. స్థూలంగా చెప్పాలంటే ఎవరుగెలిచినా ఇండో-అమెరికన్ సంబంధాలు వృద్ధి చెందుతాయి తప్పితే క్షీణించవు. దానికి కారణం మారిన రాజకీయ పరిస్థితుల్లో అమెరికాకి భారత్ కీలకంగా మారింది. ఇండో పసిఫిక్ లో చైనాని నిలవరించాలంటే భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా వుండక తప్పదు. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ (మన పార్లమెంటుకి సమానం) ఆ దిశగా తీర్మానం చేసింది. ఇందులో డెమోక్రాట్లు,రిపబ్లికన్లు కూడా వున్నారు. అలాగే భారత్ కి కూడా మారిన పరిస్థితుల్లో అమెరికా అవసరం ఎంతయినా వుంది. కాకపోతే కాశ్మీర్ విషయంలో కొంచెం తేడా వుంటుంది. ట్రంప్ ఈ విషయంలో భారత్ కి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ డెమొక్రాట్లలో కాశ్మీర్ పై భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఉపాధ్యక్ష పోటీలో వున్న కమలా హారిస్ నుంచి భారతీయ సంతతి కి చెందిన పమీల జయపాల్ దాకా అందరూ అమెరికా కాంగ్రెస్ లో కాశ్మీర్ పై భారత్ వైఖరికి భిన్నంగా మాట్లాడిన వారే. అయితే ఒకసారి ఎన్నికయిన తర్వాత బైడెన్, కమలా హారిస్ లు ఆచితూచి ప్రవర్తిస్తారని అనుకుంటున్నారు. ఎందుకంటే భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యం అవసరం కాబట్టి. అందుకనే స్థూలంగా ఎవరు గెలిచినా భారత్-అమెరికా సంబంధాలు వృద్ధి చెందటం ఖాయం. మన ప్రభుత్వం కూడా ఇప్పటినుంచే ఎవరుగెలిచినా అందుకు సిద్ధపడేలా మసులుకోవటం మంచిది. బైడెన్ కి కూడా మొదట్నుంచి భారత్ తో సంబంధాలు బాగానే వున్నాయి. రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలు మరింత దగ్గర కావటం ఉభయులకు మంచిదేననే అభిప్రాయం అందరిలో వుంది. అదీగాక భారత్ లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇంకో మూడున్నర సంవత్సరాలు వుంటుంది కాబట్టి ఎవరు గెలిచినా సంబంధాలు మరింత బలపడతాయి అనేది స్పష్టం.

Back to top button