Top Storiesఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

కాంగ్రెస్ పాపం.. ఎవరికి గుణపాఠం?

-సోనియాను జగన్ ఎదురించి 11 ఏళ్లు

Jagan Sonia

భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే బాహుబలి సినిమాలో మాహిష్మతి సామ్రాజ్యం లెక్క. కాంగ్రెస్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం, కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించడం అంటే ఎవరైనా తన గోతిని తానే తవ్వుకోవడం. ఇలా ఎందరో ఆ పార్టీని వ్యతిరేకించి చివరికి రాజీ పడ్డారు. కానీ ఈ దేశ రాజకీయాల్లో ఓ యువకుడు మాత్రం రాజీ పడలేదు. తలపడ్డాడు.. ఢీ కొట్టాడు.. ఎవరా యువకుడు..?

ఆంధ్రప్రదేశ్ ను ఎందరో మహానుభావులు పాలించారు. టంగుటూరు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మనందరెడ్డి, పీవీ నరసింహారావు, జలగం వెంగళ్ రావు, మర్రి చెన్నారెడ్డి, టి. అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె. రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. వీళ్లంతా కాంగ్రెస్ అనే ప్లాట్ ఫాం నుంచి ముఖ్యమంత్రులైనవారు. జెండా వారిది కాదు.. ఏజెండా వారిది కాదు.. చివరకి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన స్క్రిప్టు కూడా వారిది కాదు.. చాలామంది ఇందులో ఢిల్లీ నుంచి వచ్చిన షీల్డు కవర్ ద్వారా ముఖ్యమంత్రులు అయినవారే. వీరిలో స్వాంతంత్ర్య సమరమోధులు ఉన్నారు. రాజకీయ యోధానుయోధులు ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ ప్లాట్ ఫాం నుంచి రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నందమూరి తారకరామారావు ఒక సంచలనం. 1982లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే ఆయన రికార్డు విజయం సాధించాడు. అయితే ఆయన విజయం వెనుక సినిమా గ్లామర్ ఉంది. అప్పటికే 300 సినిమాల్లో నటించిన చరిత్ర ఆయనది. రాముడైనా, కృష్ణుడైనా తెలుగు ప్రజలకు ఎన్టీఆరే చేయాల్సిన వాతావరణం. దీనికి తోడు ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడిన రాజకీయ శూన్యత, కాంగ్రెస్ లో బలమైన నాయకత్వం లేకపోవడం. ఈ పరిణామాలే ఎన్టీఆర్ అత్యంత సులువుగా గెలిచేందుకు దోహదపడ్డాయి.

ఇక ఈ రాష్ట్ర చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబునాయుడుది ప్రత్యేక రికార్డు ఉంది. జెండా ఆయనది కాదు.. ఏజెండా ఆయనది కాదు.. మూడేళ్లు తెలుగుదేశం గెలిపించిన ఎన్టీఆర్ సీఎంగా ఏడేళ్లు అయితే..రెండు సార్లు మాత్రమే తెలుగుదేశం గెలుపుకు కారణమైన చంద్రబాబు 14 ఏళ్లు సీఎం గా ఉన్నారు. ఇక నెల రోజులు మాత్రమే సీఎంగా ఉన్న నాదేండ్ల భాస్కర్ రావుది ప్రత్యేక చరిత్ర. వీరందరికంటే భిన్నమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇప్పటిదాకా రాష్ట్రాన్ని పరిపాలించిన 18 మంది ముఖ్యమంత్రులు ఒక పక్క.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో లెక్క.. ఆ తేడా ఏంటో చూద్దామా..

రాష్ట్ర రాజకీయ చరిత్రలో సొంతంగా పార్టీలు పెట్టి, సొంతంగా జెండాలు పెట్టి, సొంత ఎజెండాలతో ప్రజల్లోకి దూసుకెళ్లి ప్రజల మనసును గెలిచిన నాయకులుగా నందమూరి తారకరామారావు, ఆ తరువాత వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు నిలుస్తారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ కు, జగన్మోహన్ రెడ్డికి చాలా తేడా ఉంది. ఎన్టీఆర్ లా జగన్మోహన్ రెడ్డికి సినిమా గ్లామర్ లేదు. ఎన్టీఆర్ లా ప్రజాకర్షణ లేదు. ఎన్టీఆర్ లా వాగ్దాటి కూడా కాదు.. అయినా కూడా ఈ రాష్ట్ర రాజకీయాలను ఎన్టీఆర్ ను మించిన ఘనవిజయాన్ని, ప్రజా ప్రభంజనాన్ని సృష్టించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. కాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేశాడు. పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే ఎన్టీఆర్ సులభంగా అధికారంలోకి వచ్చాడు.కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారం అంత సులభంగా దక్కలేదు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలిక్యాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో అనే క పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ శక్తులన్నీ ఏకమయ్యాయి. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఆగిపోయిన గుండెలను, వారి కుటుంబాలను ఓదార్చాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. ఆ మేరకు నిర్ణయం తీసుకొని ఓదార్పు యాత్ర నిర్వహించారు. ఈలోపు కాంగ్రెస్ అధిష్టానం జగన్, ఆయన తల్లిని ఢిల్లీకి పిలిపించుకుంది. టెన్షన్ పడుతూనే సోనియాను కలిసిన వారికి ఆమె మీరు ఓదార్పు యాత్ర చేయకూడదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అందుకు ఒప్పుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకిచ్చిన ఆస్తి, మా తండ్రి, మాకుటుంబం. కాబట్టి వాళ్లను ఓదార్చడం నా బాధ్యత. వాళ్లింటి పెద్దకొడుకుగా నేను ఈ యాత్ర చేపట్టామని సమాధానం ఇచ్చాడు. మీరు కోరిన పదవి ఇస్తాను.. కేంద్ర మంత్రి పదవి ఇస్తాను.. అని సోనియా ఆఫర్ చేసింది. మీ ముందు రెండు దారులు పెడుతున్నామం. ప్రజలా.. పదవా.. అని ఆప్షన్ ఇచ్చింది. నాకు పదవి అక్కర్లేదు, రెండో ఆప్షన్ ప్రజలే ముఖ్యమంటూ చెప్పాడు.

జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర ప్రారంభించడంతో సోనియాగాంధీ అహం దెబ్బతింది. ఆయన మీద కేసులు నమోదయ్యాయి. అక్రమాస్తుల కేసులు పెట్టారు. సొంత కాంగ్రెస్ పార్టీ వాళ్లే ప్రతీకార చర్యలకు దిగారు. 2010 నవంబర్ 20వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తల్లి విజయమ్మతో కలిసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2010 డిసెంబర్ 7వ తేదీన కొత్త రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. 2011 మార్చి 12వ తేదీన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇదొక మైలురాయిగా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి ఆయన, తల్లి విజయమ్మ రాజీనామాలు చేశారు. ఆ తరువాత కాలంలో జగన్ వెంట నడిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన వాళ్లంతా ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ కడుపుమంటకు, సోనియాగాంధీ అహంభావం దెబ్బతినడానికి ఉప ఎన్నికల ఫలితాలు పెద్ద కారణమయ్యాయి. ఈ ఉప ఎన్నికలు చూశాకే, రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడగొట్టాలనే ఆలోచనకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. దానిని అమలు చేసింది కూడా.

రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ డెడ్ కు గురైంది. అయితే దాని అవయవాలు తీసి ఆరోజు జీవచ్ఛంలా ఉన్న తెలుగుదేశం పార్టీకి వేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం పొందింది. 2014 ఎన్నికల్లో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా అన్ని శక్తులు ఏకమయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, అంతకుమించి మీడియా అన్నీ కుమ్మక్కయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ ఎన్నికలలో అడ్డుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

2014 ఓటమికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భవిష్యత్తుకు మెట్లుగా మలుచుకున్నాడు. 2014నుంచి 2019 మధ్య కాలంలో ప్రతిపక్షనేతగా అధికార పార్టీతో యుద్ధమే చేశాడు. ఓ పక్క కేసుల విచారణలు, మరోపక్క పచ్చ మీడియా అసహ్యపు రాతలు, అసెంబ్లీ లోపల, బయట టీడీపీ నేతల వ్యంగ్య కూతలను ఓర్చుకున్నాడు. తన పార్టీకి చెందిన ఎంపీలు,ఎమ్మెల్యేలు విడిచిపోవడమే కాకుండా తనపై అనరాని మాటలు అంటుంటే ఏరోజు ఒక్కమాట కూడా వారిని అనలేదు.

అసెంబ్లీలో సభకు పెద్దగా వ్యవహరించాల్సిన స్పీకర్ పక్షపాతానికి పరాకాష్టగా మారినప్పుడు ఈ సభలో కాదు ప్రజా కోర్టులోనే నేను తేల్చుకుంటానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చేశాడు. దేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయాన్ని నెలకొల్పి 2017 నవంబర్ 6వ తేదీన ఇడుపుల పాయ నుంచి తన తండ్రి వైఎస్ రాజశేఖర్ సమాధి నుండి ప్రజా సంకల్ప పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. రాష్ట్రంలోని 13 జిల్లాలు, 125 అసెంబ్లీ నియోజకవర్గాల గుండా 630 రోజులపాటు 3,648 కిలోమీటర్లు సాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 2019 జనవరి 9వ తేదీన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసింది. ఈ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

2019 మార్చిలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 లోక్ సభ స్థానాలకు సమరశంఖారావం మోగింది. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టారు. ఎన్నికల ప్రచారంలో అంతా తానై నడిపించారు. 2019 ఎన్నికల ఫలితాలలో రాష్ట్ర రాజకీయాల్లో 151 అసెంబ్లీలు, 22 లోక్ సభ స్థానాలు, 55 శాతం ఓట్లు సంపాదించారు. 86 శాతం ఫలితాలు వైసీపీ సొంతమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్టీఆర్ లాంటి ప్రజాకర్షణ నేతకే సాధ్యం కానటువంటి ఘన విజయం జగన్ కు సొంతమైంది. ఈయన సినిమా యాక్టర్ కాదు..హిస్టరీలు కొట్టిన నెగెటివ్ కాదు..ఆయన గెలుపు వెనుక అలుపెరుగని పోరాటం ఉంది. కష్టం ఉంది.. కన్నీళ్లు ఉన్నాయి.. జైలు జీవితం ఉంది.. పగలు.. పంతాలు.. ఓర్పు, నేర్పు ఇవన్నీ ఉన్నాయి. ఆ గుండె అన్నింటికి తట్టుకొని నిలబడింది కాబట్టే ఏపీ రాజకీయ చరిత్ర పుటల్లో నెంబర్ 1 హీరోగా జగన్ నిలబడ్డాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జగన్మోహన్ రెడ్డి ఆపలేకపోవచ్చు.. కానీ సోనియగాంధీ నాడు జగన్ చేస్తున్న ఓదార్పు యాత్రను అడ్డుకొనకపోతే, కాంగ్రెస్ వృద్ధ నేతలమాటలు జీర్ణించుకోకుండా ఉంటే ఈ రాష్ట్ర విభజన ఉండేది కాదేమో.. ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంకా కాంగ్రెస్ మిగిలి ఉండేదేమో..

Back to top button