Uncategorizedజీహెచ్‌ఎంసీ ఎన్నికలురాజకీయాలుసంపాదకీయం

జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది?

గెలుపులో ఎన్నో మతలబులు వున్నాయి

జిహెచ్ఎంసి ఎన్నికలు ఇంకో అయిదు రోజుల్లో ముగుస్తాయి. కాబట్టి ఇప్పుడు ఎంతోకొంత ప్రజలనాడిని అంచనా వేసే సాహసం చేయొచ్చు. ఇప్పటికే కొన్ని సర్వే సంస్థలు ఈ పనిలోనే నిమగ్నమై వున్నాయి. ఇప్పటికయితే పోటీ రెండింటి మధ్యనే వుంది. అది తెరాస బిజెపిల మధ్య. పాత బస్తీలో ఎప్పటిలాగా మజ్లీస్ కి తిరుగు ఉండకపోవచ్చు. కాకపోతే అదివరకటి కన్నా ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని వాళ్ళు చెప్పేది ఈసారి జరగకపోవచ్చు. ఇప్పటికున్న ట్రెండ్ చూస్తావుంటే తెరాసపై ప్రజల్లో కోపం బాగానే వుందని అర్ధమవుతుంది. అది వోట్ల రూపంలోకి మారితే తెరాసకి ప్రజలు చుక్కలు చూపించినట్లే. ఇందులో ఎన్నో అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ మొత్తంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా వుంది. డిల్లీలో పరిస్థితులు ఏమీ బాగాలేవు. ఇక్కడా నాయకులు ఒక్కొక్కరూ వీడుతున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ దుకాణం ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎన్నికలో చోటుచేసుకొనే అంశాలు 

వరదసాయం అందించటంలో తెరాస ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీనివలన లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగినట్లుగా అనిపిస్తుంది. అలాగే గత అయిదు సంవత్సరాలలో జిహెచ్ఎంసి పరిపాలనపై ప్రజల్లో అసంతృప్తి పేరుకు పోయింది. 2016 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు నేరవేర్చలేదనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. దాన్ని ప్రజల్లోకి తీసుకెల్లటంలో ప్రతిపక్షాలు విజయవంతమయ్యాయనే చెప్పొచ్చు. మంచినీరు ఇవ్వటంలో, మురుగునీరు సక్రమంగా పారుదలలో, రోడ్లు నిర్మించి మెయిన్ టైన్ చేయటంలో ప్రజల్లో మిశ్రమ స్పందన వుంది. వరదనీటి కాల్వల విషయంలో,అక్రమ కట్టడాల నిర్మూలనలో పూర్తి వైఫల్యం చెందింది. హైదరాబాద్ మెట్రో ప్రారంభమైన ఘనత తెరాస ఖాతాలో వేసుకోలేరు. ఆర్టీసిని నడిపించటంలోనూ మైనస్ మార్కులే. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. మొత్తం మీద చూస్తే కెసిఆర్ ప్రభుత్వం ఆత్మరక్షణలోనే వుంది. అందుకే చర్చ దానిమీద కాకుండా బిజెపి మతరాజకీయాలపైకి మళ్ళింది. బిజెపి కూడా మెల్లి మెల్లిగా అదే ట్రాప్ లోకి వెళ్లినట్టు కనబడుతుంది.

ఎన్నికల ప్రచారం తప్పుదారిపడుతుంది 

ప్రజల్లో విద్యావంతులు, బస్తీల్లో వుండే పేద ప్రజలు, మధ్యతరగతి వర్గం ఎక్కువగా వుంటారు. ఇందులో మధ్యతరగతి వర్గం చాలా పెద్ద సంఖ్యలో వుంటారు. కానీ వీరు ఓటు వేసే శాతం తక్కువ. బస్తీల్లో ప్రజలు అధిక శాతం ఓటు వేస్తారు. అందుకే పార్టీల గురి వాళ్ళపై వుంది. ఉచిత హామీల పర్వం మొదలయ్యింది. ముందుగా తెరాస ఎన్నికల మేనిఫెస్టో ని విడుదల చేసింది. నిన్ననే కాంగ్రెస్ కూడా ఎన్నికల మానిఫెస్టోలో హామీల పరంగా రెండాకులు ఎక్కువే తిన్నది. ఇక మిగిలింది బిజెపి. రేపు విడుదల చేస్తారని అనుకుంటున్నారు. ఇందులో కాంగ్రెస్ ప్రణాళికను ఎవరూ సీరియస్ గా తీసుకోవటంలేదు.తెరాస,బిజెపి ల మీదే అందరి దృష్టి. కాని దురదృష్టవశాత్తు ఎన్నికల మేనిఫెస్టోలు వాస్తవానికి దూరంగా ఉంటున్నాయి. ఆచరణ సాధ్యంగా ఉండటంలేదు. ప్రజలకు కలల ప్రపంచం చూపిస్తున్నారు తప్పిస్తే అవి నెరవేరాలంటే నిధులు ఎలా సమకూరుస్తారో ఎవరూ మాట్లాడటం లేదు. జిహెచ్ఎంసికి వున్న ఆదాయాన్ని తగ్గించే మాటలు మాట్లాడుతున్నారు కానీ ఆదాయాన్ని పెంచే మార్గం చూపటంలేదు. ఇది ఆందోళన కలిగించే అంశం.

ఇక ప్రచార సరళిలో పెడ ధోరణలు చోటు చేసుకుంటున్నాయి. కేటిఆర్ తెరాస తరఫున ప్రచారాన్ని భుజానవేసుకున్నాడు. తను వరదసాయంపై పదేపదే బిజెపి వలన సాయం ఆగిపోయిందని చెప్పటం ప్రజల్ని మోసగించటమే. బిజెపి వాళ్ళు ఆ లెటర్ రాయలేదని చెప్పిన తర్వాత కూడా అదే మాటను పదే పదే వల్లెవేయటం లో పరమార్ధం గ్రహించలేనంత అమాయకులు కాదు ప్రజలు. తర్వాత కేంద్ర నిధులేమీ రాలేదని చెప్పటం కూడా కరెక్టు కాదు. బిజెపి లెక్కలు చూపిస్తే అసలు మేము పంపించే పన్నుల్లో సగం కూడా తిరిగి రావటం లేదని చెప్పటం సమస్యను పక్కదారి మళ్ళించటమే. అసలు ఆ వాదన ప్రమాదకరమైనది. ఏరాష్ట్రంలో వసూలైన పన్నులు ఆ రాష్ట్రం లోనే ఖర్చు పెట్టాలనే వాదన దేశ సమగ్రతకే విఘాతం. ఇక బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాత బస్తీ పై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పటం దారుణం. ఇది రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే మాటలుగా అర్ధం చేసుకోవాలి. ఈ ప్రచారం బిజెపికి నష్టం చేసే అవకాశం వుంది. మధ్యతరగతి ప్రజలు,విద్యావంతులు ఈ ప్రచారంతో కొంత మేర బిజెపి కి దూరం జరిగే అవకాశం వుంది. బిజెపి గత అయిదు సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టిపెడితే ప్రజలు హర్షిస్తారు. ఆ దిశగా ప్రచారం ప్రజల్ని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే ప్రజల్లో తెరాస హైదరాబాద్ లో విఫలమయ్యిందనే భావంలో వున్నారు. సమస్య పక్కదారి పడితే నష్టం బిజెపికే.

మేయర్ పదవి ఎవరికి దక్కేను?

తెరాసపై ప్రజావ్యతిరేకతతో మెజారిటీ వార్డులు బిజెపికి దక్కినా మేయర్ పదవి దక్కే అవకాశం లేదు. మజ్లీస్ పార్టీ కార్పొరేటర్లు,ఎక్స్ అఫిసియో సభ్యుల సహకారంతో తెరాసకే మేయర్ పీఠం దక్కే అవకాశం వుంది. అందుకే మొదట్నుంచీ ఇది అప్రజాస్వామిక,బూటకపు ఎన్నిక అని రాయటం జరిగింది. ఆ ధీమాతోనే తెరాస వుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ అధికారం బిజెపికి దక్కదనే ధీమానే ముందస్తు ఎన్నికలకు పురికొల్పింది. కాకపోతే మేయర్ పీఠం సంగతి పక్కనపెట్టినా మెజారిటీ వార్డుల్లో తెరాస గెలవకపోతే నైతికంగా అది ఓడిపోయినట్లే అవుతుంది. అందుకే చెమటోడుస్తుంది. బిజెపికి పోయిందేమీలేదు. ఎన్ని గెలిచినా ప్లస్ నే. అందుకే బిజెపి కన్నా తెరాసకే ప్రతిష్టగా మారింది.

ఒకవేళ మెజారిటీ స్థానాలు బిజెపి కైవసం చేసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చేసుకుంటాయి. వచ్చే వరంగల్, ఖమ్మం మునిసిపల్ ఎన్నికలు కూడా రెండు డీఅంటే డీ గా మారుతాయి. కాంగ్రెస్ లో నుంచి వలసపక్షులు బిజెపిలోకి క్యూ కడతాయి. 2023 ఎన్నికలు రసవత్తరంగా మారే అవకాశాలు మెండుగా వున్నాయి.

 

Back to top button