ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

తిరుపతిలో గెలుపెవరిది..?

Tirupati Candidates
తిరుపతి లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనున్న సంగతి తెలిసిందే. ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ రావు కరోనా సోకి మరణించడంతో తిరుపతికి ఉప ఎన్నిక అనివార్యమైంది.

తిరుపతి లోక్‌సభ నుంచి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబంలో ఒకరికి టిక్కెట్ దక్కవచ్చని తొలుత ప్రచారం జరిగింది. కానీ.. దుర్గాప్రసాద్ తనయుడు కల్యాణ చక్రవర్తికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో తిరుపతి లోక్‌సభ స్థానానికి గురుమూర్తి పేరు తెరమీదికి వచ్చింది. అనుకున్నట్లుగానే వైసీపీ అధిష్టానం డాక్టర్‌‌ గురుమూర్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సైతం గత ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన పనబాక లక్ష్మినే రంగంలోకి దింపాలని నిర్ణయించింది. జనసేనతో కలిసి పనిచేస్తున్న బీజేపీ తామే బరిలో నిలుస్తామని ప్రకటించింది. కానీ.. అభ్యర్థి ఎంపిక దగ్గరే బీజేపీ ఆగిపోయినట్లు కనిపిస్తోంది. దానికి తోడు ఓ విశాఖ స్టీలు ప్లాంటు ఉద్యమం, మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర పార్లమెంటు సాక్షిగా ప్రకటించడం స్థానిక బీజేపీ నేతలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో తిరుపతి ఎన్నికల్లో ఎంతటి బలమైన అభ్యర్థిని నిలిపినా.. ఫలితం లేదని పలువురు కమలనాథులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు.. ప్రచారం సైతం పార్టీలు ముమ్మరం చేశాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని వైసీపీ పట్టుదలతో ఉంది. తమ అభ్యర్థి గురుమూర్తి గెలుపు నల్లేరు మీద నడకేనని ఓ వైపు అనుకుంటూనే.. దానికి తగినట్లుగా బంపర్‌‌ మెజార్టీ సాధించాలని ఉవ్విల్లూరుతోంది. మినిమం ఐదు లక్షలకు పైగా మెజార్టీ సాధించాలని వైసీపీ నేతలకు జగన్‌ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా.. ఆ పార్టీ ప్రధానంగా నవరత్నాలు, సంక్షేమ పథకాలను నమ్ముకొని ముందుకువెళ్తోంది.

ఇక టీడీపీ సైతం పనబాక లక్ష్మిని రంగంలోకి దింపగా.. ఆది నుంచే పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో పాటు మాజీ మంత్రులు, సీనియర్‌‌ నేతలను నియోజకవర్గాలకు, క్లస్టర్లకు ఇన్‌చార్జీలుగా నియమించారు. మరోవైపు.. అధినేత చంద్రబాబు నాయకుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ప్రత్యేక హోదా తేవడంలో జగన్‌ విఫలం అయ్యారని అంటున్నారు. వివేకా హత్య కేసులను ప్రధానంగా ప్రచారస్త్రంగా ఎంచుకున్నారు. దీంతో వైసీపీని ఇరుకున పెట్టొచ్చని ముందు నుంచీ టీడీపీ భావిస్తోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ.. తిరుపతిలో సత్తాచాటగలమని ఆశిస్తోంది.

ఇక పార్టీల వారీగా బలాలు.. బలహీనతలు ఇలా ఉన్నాయి..
* ప్రభుత్వ సంక్షేమ పథకాలు వైసీపీ ప్రభుత్వానికి కలిసొచ్చే అంశాలు. అధికార పార్టీకి సహజంగానే ఉండే సౌలభ్యాలు అవి. 2014, 2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ వైసీపీనే గెలుచుకుంది. ఇది కూడా అడ్వాంన్‌టేజీ కానుంది. తిరుపతి కార్పొరేషన్‌ను, ఇతర మున్సిపాలిటీలను సైతం వైసీపీనే గెలుచుకుంది. దీంతో ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఇది కూడా కలిసొచ్చే అంశమే. మంత్రులను ,ఇతర సీనియర్‌‌ నాయకులను మోహరించడం కూడా కలిసిరానుంది. పార్టీ అభ్యర్థి రాజకీయాల్లో పూర్తిగా కొత్త ముఖం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలేవీ తీసుకురాలేదు. పుణ్యక్షేత్రం తిరుమల కేంద్రంగా ముసురుకున్న వివాదాలు సైతం పార్టీకి నెగెటివ్‌లా మారబోతున్నాయి.

* టీడీపీ విషయానికొస్తే పనబాక లక్ష్మి మళ్లీ అభ్యర్థి కావడం.. అప్పుడు ఓడిపోయారన్న సానుభూతి ఉంది. కేంద్ర మాజీ మంత్రిగా.. సీనియర్‌‌ నేతగా ఆమెకు ఉన్న ప్రాచుర్యం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార బరిలోకి దిగడం.. క్షేత్రస్థాయి వరకు వెళ్లేలా పటిష్టమైన ప్రచార వ్యూహం వారి సొంతం. టీడీపీ హయాంలో హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌ వంటి పరిశ్రమలతోపాటు పలు సెల్‌ఫోన్ తయారీ కంపెనీలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. ఇక బలహీనతలు ఇలా ఉన్నాయి. అధికార పార్టీకి ఉన్న అర్థబలం లేదు. నగరపాలక, పురపాలక సంస్థల ఎన్నికల్లో పరాజయంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. అధికార పార్టీ కేసులు పెడుతుందేమోనన్న భయంతో నాయకులు దూరంగా ఉంటున్నారు. స్థానిక నాయకుల మధ్య సమన్వయం లోపించడం కూడా మైనస్‌.

* బీజేపీ విషయానికొస్తే.. బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడం కలిసొచ్చే అంశం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఉన్న సినీ గ్లామర్‌‌, యువతలో ఉన్న ఆదరణ ప్లస్‌ పాయింట్‌. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కేడర్‌‌ బలం పెద్దగా లేకపోవడం పార్టీకి పెద్ద మైనస్‌. క్షేత్రస్థాయిలో బీజేపీ, జనసేన శ్రేణుల మధ్య అంత సఖ్యత లేదు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని బీజేపీ ప్రజల్లో కోపం కూడా ఉంది.

* తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి ఆరుసార్లు గెలిచి.. కేంద్ర మంత్రిగా పనిచేసిన చంఇంతా మోహన్‌ మరోసారి రంగంలోకి దిగారు. 2014 2019 ఎన్నికల్లో ఆయనకు డిపాజిట్‌ కూడా దక్కలేదు. కానీ.. ఈసారి మాత్రం ఉనికి చాటాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

Back to top button