Top Storiesఅత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

తిరుపతి ఉప ఎన్నికల్లో బలాబలాలు.. పవన్ ప్రయాణం ఎటు?

Who will win the Tirupati by-election .. What is Pawan's journey?

ఏపీలో అరవీర భయంకరంగా మారిన అధికార వైసీపీ ఒకవైపు.. జగన్ ధాటికి అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోయిన 40 ఇయర్స్ పాలిటిక్స్ చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ మరోవైపు.. మధ్యలో జనసేన సపోర్టుతో తిరుపతి బరిలో దిగిన బీజేపీ మరోవైపు… ఇలా తిరుపతి ఉప ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డ వేళ  గెలుపు ఎవరిది..? తిరుపతిలో బలాబలాలు ఏమిటీ? పార్టీల బలహీనతలు ఏమిటీ.? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈక్రమంలోనే తిరుపతి ఉప ఎన్నికలపై స్పెషల్ ఫోకస్..

-తిరుపతి బరిలో బలంగా వైసీపీ..
ఉప ఎన్నిక జరుగుతున్న తిరుపతి ఎంపీ స్థానంలో ఖచ్చితంగా రేసు గుర్రం ఎవరంటే వైసీపీ అభ్యర్థినే. తిరుపతి సిట్టింగ్ వైసీపీ ఎంపీ దుర్గా ప్రసాద్ మరణంతో ఖాళీ అయిన ఈ సీటులో ఆ కుటుంబాన్ని కాదని మరి.. జగన్ గెలిచే అవకాశాలున్న ఒక డాక్టర్ కు సీటు కేటాయించడం సంచలనమైంది. డాక్టర్ గురుమూర్తిని పార్టీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ఇప్పటికే తిరుపతి ఎంపీగా ఉండి చనిపోయిన బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు బల్లి చక్రవర్తికి ఇటీవలే ఎమ్మెల్సీ  ఇవ్వడంతో పార్టీలో అసమ్మతి లేకుండా పోయింది. ఆ ఫ్యామిలీ కూడా ఇప్పుడు డాక్టర్ గురుమూర్తిని గెలిపించేందుకు రెడీ కావడం వైసీపీకి అక్కడ సానుకూల వాతావరణాన్ని కల్పించింది. గురుమూర్తి మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి, వైసీపీకి విధేయుడిగా ఉన్న ఒక ఫిజియోథెరపిస్ట్. వైసీపీ పెట్టినప్పటి నుంచి జగన్ వెంట సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వస్తున్నారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఆయన సోదరి షర్మిల పాదయాత్ర చేపట్టగా ఆమె వెంట నడిచారు. జగన్ పాదయాత్ర సమయంలో ఆయన వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్ గా గురుమూర్తి రాష్ట్రమంతా తిరిగారు. జగన్ కు గురుమూర్తి అంటే ప్రత్యేక అభిమానం. అందుకే పిలిచి మరీ టికెట్ ఇచ్చారు.

ఇక తిరుపతి జిల్లా నుంచి ఉన్న బలమైన మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తిరుపతి ఎంపీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందరు ఎమ్మెల్యేలు, నేతలను అలెర్ట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేతలను రప్పించి కమిటీలు వేసి పకడ్బందీగా ముందుకెళుతున్నారు. జగన్ కు 3 లక్షల మెజార్టీతో గెలిపించి గిఫ్ట్ ఇస్తానని పెద్దిరెడ్డి సవాల్ చేశారు. తిరుపతిలో పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గెలవాలంటే కష్టంతో పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆధ్యాత్మిక అలుముకున్న తిరుపతిలో  ప్రభుత్వం నుంచి ఏ చిన్న తప్పిదం దొరికినా దానిని ఆధారంగా చేసుకొని ప్రజల్లోకి వెళుతున్నాయి ప్రతిపక్ష పార్టీలు. హిందువాదం పేరుతో బీజేపీ, జనసేనలు.. ప్రభుత్వం చేస్తున్న కొన్ని తప్పిదాలతో టీడీపీ ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇక్కడ వైసీపి గెలుపుకు తీవ్ర పోటీ ఏర్పడింది.  ప్రతిపక్షాల పోటీని తట్టుకోవడానికి ఖర్చుకు వెనుకాడని పరిస్థితి ఎదురైంది. అయితే జగన్ అనుకుంటున్న తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమూర్తి పెద్ద క్యాష్ పార్టీ కాదని టాక్. ఎన్నికల్లో ఖర్చు పెట్టేందుకు ఆయన దగ్గర డబ్బులు లేవు అంటూ ప్రచారం సాగుతోంది. అయితే పార్లమెంట్ పరిధిలో ఉన్న కొందరు వైసీపీ నేతలు కోట్లకు ఉన్నారు. కానీ వారు ఈ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డవారు. ఈ తరుణంలో గురుమూర్తిని గెలిపించేందుకు డబ్బును పెట్టే అవకాశాలు తక్కవేనంటున్నారు. అయితే పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల నాయకులతో జగన్ సమావేశం నిర్వహించి గురుమూర్తిని గెలిపించాలని ఆదేశాలు ఇచ్చారని కొందరు అంటున్నారు. గురుమూర్తికి అవసరమైన ఖర్చును ఆయా నాయకులే భరిస్తారా లేదా చూడాలంటున్నారు. ఎంత లేదన్నా నియోజకవర్గానికి 10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు చేయాలి. అంటే కనీసం 100 కోట్లు ఖర్చు చేయనిదే తిరుపతి పార్లమెంట్లో అభ్యర్థి గెలుపు కష్టం. ఒకవేళ ఎమ్మెల్యేలు ఈ ఖర్చు మోయాలనే ఆదేశాలు ఇవ్వని నేపథ్యంలో పార్టీ నుంచే నిధులు వచ్చే అవకాశం ఉంది.. మరి జగన్ ఈ రెండింటిలో ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. అధికారంలో ఉండడం.. సహజంగానే ఉప ఎన్నికలు వైసీపీకి కలిసి వచ్చే అవకాశం ఉంది.

-టీడీపీకి రెండోస్థానం అయినా దక్కేనా?
ఇక బీజేపీలోకి వెళ్లడానికి రెడీ అయిన పనబాక లక్ష్మీని అటుపోకుండా ముందరికాళ్లకు బంధం వేసి మరీ లాక్కొచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. అందరికంటే ముందే ఈమెను తిరుపతి ఎంపీ స్తానానికి టీడీపీ ఎంపీగా ప్రకటించి ఆమెకే షాకిచ్చారు. తద్వారా బలమైన ఈమె బీజేపీలోకి ఇతర పార్టీలోకి వెళ్లకుండా చంద్రబాబు బ్రేకులు వేశారని తిరుపతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఆ అయిష్టంతోనే ఆమె చాలా రోజులు చంద్రబాబుపై, టీడీపీపై గుర్రుగా ఉన్నారని టాక్. కానీ ఇప్పుడు అన్ని సర్దుకొని..టీడీపీ పెద్దల బుజ్జగింపులతో తిరుపతి బరిలో నిలబడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు లేకపోయినా అభ్యర్థిని ముందుగా ప్రకటించి పనబాక లక్ష్మీని చంద్రబాబు బుక్ చేశాడని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయాక టీడీపీకి గడ్డు రోజులు నడుస్తున్న తరుణంలో మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మీ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న వార్తలు వచ్చాయి. బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపి తేది కూడా ఖరారు చేసుకున్నట్లు తెలిసింది. ఇంతలో చంద్రబాబు తిరుపతి ఎంపీగా ప్రకటించడంతో ఆమె ఇన్నాళ్లుగా మౌనంగా ఉన్నారు. అయితే మాజీ మంత్రి సోమిరెడ్డితో చంద్రబాబు రాయబారం పంపడంతో పనబాక చల్లబడ్డారు. మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తిరుపతి ఎంపీగా నిలబడేందుకు ఒప్పుకున్నారు. మొత్తానికి ఇక లాభం లేదనుకొని పనబాక లక్ష్మీ ప్రచారానికి శ్రీకారం చుట్టారు.  తన గెలుపు కోసం పనిచేయాలంటూ తాజాగా కొందరు సీనియర్ నేతలకు ఫోన్లు చేసి అడిగినట్టు సమాచారం. ఇప్పుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు వంటి నేతలు రంగంలోకి దిగడంతో కొంత బలంతో పనబాక ప్రచారం మొదలుపెట్టారు.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలుండగా.. టీడీపీ గెలిచింది ఒక్కటే.. అదీ చంద్రబాబుదే.. కుప్పంలో మాత్రమే టీడీపీ గెలవగా.. మొత్తం 13 సీట్లు వైసీపీ పరమైంది. ఇలా సొంత జిల్లాలోనే బాబుకు గట్టి షాకిచ్చారు జగన్. ఇప్పుడు తిరుపతి ఎంపీ స్థానంలో అస్సలు బలం లేని టీడీపీ ఎలా ఈ ఉప ఎన్నికను ఎదుర్కొంటుందనేది ఆసక్తిగా మారింది. గడిచిన ఎన్నికల్లో ఓడిపోయిన నేతలంతా ఇప్పుడు టీడీపీకి సహకరించేందుకు పెద్దగా ఆసక్తి చూపకపోవడం చంద్రబాబును ఆందోళన కు గురిచేస్తోందట. ఓడిన ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీవైపు చూస్తున్నారని.. కింది స్థాయి కేడర్ అంతా వైసీపీలోకి క్యూ కట్టేందుకు రెడీ కావడం టీడీపీ శిబిరాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సొంత జిల్లాలో గెలవడానికి చంద్రబాబు ఏం చేస్తాడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఎంత పోరాడినా కేవలం బీజేపీని కాదని రెండో స్థానం కోసం మాత్రమేనన్న ప్రచారం నియోజకవర్గంలో సాగుతోంది.

* బీజేపీకే అసలు పరీక్ష..
తెలంగాణలో బండి సంజయ్ ‘దుబ్బాక, జీహెచ్ఎంసీ’ ఎన్నికల్లో నిరూపించుకొని సత్తా చాటాడు. ఇప్పుడు సోము వీర్రాజు వంతు వచ్చింది. జనసేనతో కలిసి ఏపీలో 2024లో బలమైన ప్రత్యామ్మాయంగా ఎదుగుతామని సోము వీర్రాజు సవాల్ చేశారు. అయితే బండి సంజయ్ లా సోము వీర్రాజు ఏపీలో ఎదుగుతారా? లేదా అన్నది తిరుపతి ఉప ఎన్నికలతో తేలిపోతుంది. ఇది ఆయనకు, బీజేపీకి కూడా పరీక్షనే. ఎందుకంటే ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ అందరికీ కార్నర్ అయ్యింది. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసిన బీజేపీ ఇప్పుడు ఏపీ ప్రజల దృష్టిలో విలన్ గా మారిపోయింది. అయితే సోషల్ ఇంజనీరింగ్ లో రాటుతేలిన ఏపీ బీజేపీ సహ ఇన్ చార్జి సునీల్ ధియోధర్ వంటి బీజేపీ నేతలు కొద్ది నెలలుగా తిరుపతిలో మకాం వేసి బూత్ లెవల్ రిపోర్టులను తెప్పించుకొని మరీ కష్టపడుతున్నారట.. ఈ క్రమంలోనే తిరుపతిలో బీజేపీ భవితవ్యం ఎలా ఉండనుందనేది ఆసక్తిగా మారింది. వీరి కృషి ఫలిస్తుందా.? ఈ పరీక్షలో బీజేపీ నిలుస్తుందా అన్నది వేచిచూడాలి.

అధికార వైసీపీకి అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ వ్యవహరిస్తోందన్న విమర్శలు టీడీపీ చేస్తోంది. అదీకాక సామాజిక సమీకరణాల పరంగా బీజేపీతో పోల్చితే ఇక్కడ జనసేనకు కొంత అడ్వాంటేజ్ ఉంది. కానీ జనసేనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ టికెట్ తీసుకోవడం మైనస్ గా మారిందంటున్నారు. వైసీపీకి మేలు చేసేలా ఈ నిర్ణయం ఉందన్న విమర్శలు బీజేపీపై వినిపిస్తున్నాయి. టీడీపీ ఇదే లేవనెత్తి బీజేపీని దెబ్బకొట్టడానికి రెడీ అవుతోంది. ఇక ఏపీబీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు ఇదీ పరీక్షనే.. బండిసంజయ్ లా ఆయన ఏపీలో హిట్ అవుతాడా? నిలుస్తాడా? అన్నది తిరుపతి ఉప ఎన్నిక తేల్చనుంది.

*పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎటు?
తిరుపతికి మెగా ఫ్యామిలీకి అనుబంధం ఎక్కువ. ఇక్కడ చిరంజీవి ఎమ్మెల్యేగా గెలవడానికి సామాజిక సమీకరణాలు కలిసి వచ్చాయి. తిరుపతిలో జనసేనకు అనుకూల వాతావరణం ఉందని.. జనసేన అభ్యర్థిని నిలబెడితే గెలిచేవారన్న ఆశ ఆ పార్టీలో ఉంది. అయితే క్షేత్రస్థాయిలో క్యాడర్, బూత్ లెవల్ నాయకులు లేకపోవడం.. కేవలం పవన్ ఛరిష్మా మీదే ఎన్నికలకు వెళితే నష్టం అని బీజేపీ టికెట్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక తిరుపతిలో ఒక సామాజికవర్గానికి చెందిన కొన్ని సంఘాలు తిరుపతి టికెట్ జనసేకు ఇస్తే తామంతా అండగా ఉండి గెలిపించుకుంటామని.. ఇవ్వకపోతే బీజేపీకి మద్దతు ఇవ్వమని బహిరంగంగా వ్యాఖ్యానించారు. జనసేన నేతలు కూడా ఇదే అంటున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు ఇప్పుడు తిరుపతిలో కూడా సీటు వదలుకున్న జనసైనికులు, పవన్ సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నాడనిప్రచారం సాగుతోంది. అందుకే ఇటీవల తెలంగాణబీజేపీతో దోస్తీ కట్ చేసి షాక్ ఇచ్చాడంటున్నారు. ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వని బీజేపీ తీరుపై గుర్రుగా పవన్ తిరుపతిలో ప్రచారానికి వస్తాడో రాడో అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీకి సీటు వదలుకున్న కారణంగా ఖచ్చితంగా ఇక్కడ జనసేన అభిమానులు అసహనంతో అసలు బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదన్నది ఇన్ సైడ్ టాక్. ప్రచారానికి వారు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే పవన్ సహాయ నిరాకరణ, జనసైనికులు దూరం జరిగితే బీజేపీకి గడ్డుకాలమే అంటున్నారు. ఇదో బలమైన పరీక్షగా కమలదళానికి నిలువనుంది.

*సర్వేలో గెలుపు ఎవరిదంటే?
తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపు ఎవరిది అని ఓ ప్రముఖ తెలుగు మీడియా నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రజల ఓటు వైసీపీ వైపే ఉందని తేలింది. వైసీపీకి ఏకంగా 44.39శాతం ఓట్లు వస్తాయని.. అధికార పార్టీ గెలవడం గ్యారెంటీ అని సర్వేలో తేలింది. ఇక ప్రతిపక్ష టీడీపీ 24.37 శాతం ఓట్లతో మూడో స్థానంలోకి పడిపోతుందని ఓటర్లు తీర్పు ఇచ్చారు. ఇక అందరూ భారీగా అంచనాలు పెట్టుకున్న బీజేపీ-జనసేన కూటమి తిరుపతి ఉప ఎన్నికల్లో సత్తా చాటనుందని తేలింది. బీజేపీ కూటమికి ఏకంగా 27.76శాతం మంది ప్రజలు పట్టం కట్టారు. అంటే ఏపీలో ప్రతిపక్షంగా బీజేపీ-జనసేన నిలిచి టీడీపీ పరిస్థితి దిగజారునుందని సర్వేలో తేలింది.

2019 ఏపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ.. మరి ఈ ఉప ఎన్నికల్లో ఏపీలో పుంజుకుంటుందుందా? లేదా అన్నది చూడాలి. బీజేపీ భవిష్యత్ రాజకీయాలకు ఈ ఫలితమే చుక్కాని కానుంది.

-నరేశ్. ఎ

Back to top button