గెస్ట్ కాలమ్తెలంగాణ

కార్పొరేట్ శక్తులకు అంతలా వణికిపోతున్నారెందుకు? 

ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలి

corporate hospital

కోవిడ్ 19 మూలంగా లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తుంటే జనం ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని బతుకుతున్నారు. ప్రజల భయాలను దూరం చేసి వారికి మనో నిబ్బరం కలిగించవలసిన రాజ్యాంగ విహిత బాధ్యత కలిగిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ తో సహ జీవనం చేద్దాం అంటూ చేతులు ఎత్తేశాయి.
 

  కేంద్రమేమో రైతుల పీకకోసే వ్యవసాయ బిల్లులు, చైనాతో వార్ సన్నాహాలు, మహారాష్ట్రలో సుశాంత్ రాజకీయం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం లో తలమునుకలై ఉంటే రాష్ట్ర సర్కారేమో సెక్రటేరియట్ కూల్చి కొత్త నిర్మాణం పనుల్లో  బిజీగా ఉంది. ఇక ఎవరి భక్త జనం వారి చర్యలను కీర్తించే పనిలో చాలా చాలా బిజీగా ఉన్నారు. అయ్యో మేము చచ్చి పోతున్నాం సారూ, జర మా ఆరోగ్యాల సంగతి పట్టించు కోండి  అని సామాన్య ప్రజలు అరిచి గోల జేస్తే వాళ్ళు దేశ ద్రోహులో , కాకుంటే తెలంగాణ ద్రోహులో అయి కూర్చుంటున్నారు. మెజారిటీ ప్రజలు మనదాకా వచ్చినప్పుడు చూసుకుందాం లేమ్మనో లేక ,  టీవిలో వార్తలు చూస్తూ భయకంపితులై మాట పెకులక మరబొమ్మల్లా చేస్టలుడిగి చూస్తున్నారు.

Also Read: కేసీఆర్ కు సెల్ఫీ వీడియో.. నిరుద్యోగుల ఉసురుబోసుకుంటున్నారా?

రాజకీయనాయకులు  , సంపన్నులు తాము కరోనాను జయించి బయటపడ్డాం అని ఆనందోత్సాహాలతో టీవీల ముందుకు వచ్చి  చెపుతున్నారు. వారికి పాజిటివ్ వచ్చిన తర్వాత ఎలా హాస్పిటల్ కు వెళ్లింది, ఏ హాస్పిటల్ కు వెళ్లింది, అక్కడ వారికి ఎలాంటి చికిత్స జరిగింది, ఎంత బిల్ పే చేసింది చెప్పకుండా వాళ్లెదో పిక్నిక్ వెళ్లివచ్చినట్టు  చెబుతున్నారు. అక్కడ ఫుడ్ బాగుందని, కాషాయాలు, వేడి నీళ్ళు తాగి బాగైనామాని చెబుతున్నారు. అదే నిజమైతే ఇప్పటికే ఇన్ని లక్షల మంది ఎందుకు చనిపోయారంటే ఎవ్వరూ  సమాధానం చెప్పరు.

డబ్బులున్న వాళ్ళు లక్షలకు లక్షలు చెల్లించి చికిత్స పొంది హాయిగా బయటకు వస్తున్నారు. కానీ డబ్బులు లేని వాళ్ళ గతి ఏంది? తెలంగాణ రాష్ట్రంలో   2500 డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 7500 నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రోగులకు కనీస వసతులు కల్పించలేకపోతున్నామని ఇప్పటికే ఇద్దరు పర్యవేక్షకులు తమ బాధ్యతల నుండి తప్పుకున్నారు. మందులు లేవు, మాస్కూలు లేవు, ఆక్సీజన్ లేదు, కడకు చేతులకు వేసుకొనే గ్లౌజులు సైతం చాలినన్ని లేవని ఆరోగ్యసిబ్బంది రోడ్డున పడి మొత్తుకుంటున్నారు. ఇంత భయానక పరిస్తితిలో సి ఏం ఇంట్లనుండి బయటకు వచ్చి భరోసా ఇవ్వడు. రాకుంటే రాకపాయే , కనీసం అధికారులతో రివ్యూ చేసన్నా  ప్రజల భయ ఆందోళనలను దూరం చేసే ప్రయత్నం చేయడూ . ఆరోగ్య మంత్రి చెప్పేదానికి , అక్కడ ఫీల్డ్ మీద కనిపిస్తున్న దానికి అసలు పొలికే లేదు.

Also Read: జగన్ ప్లస్ పాయింట్లే బాబుకు మైనస్ అవుతున్నాయే..?

నిజంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్నీ సవ్యంగానే ఉంటే, ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే  ఎందుకు వైద్యం చేయించుకోవడం లేదు అని ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏ ఒక్కరూ సమాధానం చెప్పరు. రాష్ట్రం లో ప్రజల భయాందోళనలను చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చే  ప్రభుత్వం ఉందా? నిజంగానే ఉంటే ప్రజల భయాందోళనలకు కారణం అవుతున్న ప్రభుత్వ వైద్యం పైన విశ్వాసం  కలిగించే ప్రయత్నం చేయండి. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులు ఎంత ఫీజు వసూలు చేయాలో ప్రభుత్వం ఒక సర్కులర్ విడుదల చేసింది.
 
 కానీ తెలంగాణలో ఏ ఒక్క ప్రైవేట్ ఆసుపత్రి  కూడా ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా తన ఇష్టారాజ్యంగా డబ్బులు దండుకొంటుంటే ఏమైంది మీ కొరడా? సామాన్య ప్రజలనైతే రోడుపైకి వచ్చినా,  మాట వినలేదని కొట్టిచంపుతారే? మరి కార్పొరేట్ శక్తులకు అంతలా వణికిపోతున్నారెందుకు?ప్రజలేన్నుకున్న  ప్రభుత్వాలే వారికి బానిసల వలె జీ హుజూర్ అనడం ఎంత సిగ్గుచేటు? ఎవరి ప్రయోజనం కోసం మీరు పాలన చేస్తున్నారో చెప్పండి? మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మన కోసం గాకుండా మరెవ్వరికోసమో పనిజేస్తుంటే  ఎంతకని ఓపిక పడుదాం చెప్పండి? 

Also Read: ‘పరిటాల’ వారి పౌరుషం ఎక్కడ పాయె..?

ఓపిక అనేది వరమంటారు . కానీ ఇక్కడ ప్రజల పాలిట శాపం అవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి  రోగ లక్షణాలున్న  వారందరికి టెస్టులు చేసి, ప్రబుత్వ హాస్పిటల్లో నాణ్యమైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని  ప్రభుత్వం పైన ఒత్తిడి చేయవలసిన బాధ్యతను ఇకనైనా ప్రజలు గుర్తించాలని ఆశిద్దాం.

Back to top button