Uncategorizedజాతీయంరాజకీయాలుసంపాదకీయం

ఇస్లాం ప్రపంచం సెక్యులరిజంతో ఎందుకు ఘర్షణ పడుతుంది?

ఆధునిక సమాజంలో ఇస్లాం సంక్షోభం

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం ఇస్లాం. కొన్ని దశాబ్దాలలో క్రైస్తవాన్ని తోసి ఇస్లాం పెద్ద మతంగా అవతరించబోతుంది. ఆఫ్రికాలోని అత్యంత జనాభా గల నైజీరియాలో ప్రస్తుతం క్రైస్తవం, ఇస్లాం సమానంగా వున్నాయి. కాని త్వరలో ఇస్లాం అధిక జనాభా గల దేశంగా నైజీరియా అవతరించబోతుంది. మొత్తం ప్రపంచంలో ఇస్లాం మెజారిటీ గల దేశాలు 58 వున్నాయి. ఇందులో రెండో అతిపెద్ద ముస్లిం జనాభాగల భారత్ ని కలపలేదు. ప్రపంచవ్యాప్తంగా సున్నీలు దాదాపు 80 నుంచి 85 శాతం, షియాలు 15 నుంచి 20 శాతం వుంటారు. మొత్తం ఇస్లాం జనాభాలో అతి పెద్ద జనాభా వుంది మన భారత ఉపఖండంలోనే. కాబట్టి అతి పెద్ద హిందూ జనాభాతో పాటు, అతి పెద్ద ముస్లిం జనాభా కూడా మన అవిభాజ్య భారత్ లోనే. ఇస్లాం పుట్టిన అరేబియా లో జనాభా తక్కువ. అతి పెద్ద ముస్లిం జనాభా కల దేశం ఇండోనేసియా అదీ మన పక్కనే వుంది. తర్వాత స్థానానికి పోటీ పడుతున్న భారత్, పాకిస్తాన్ దాదాపు సరిసమాన స్థాయిలో రెండో స్థానంలో వున్నాయి. ఆ తర్వాతి స్థానం మన ఇంకో పొరుగుదేశం బంగ్లాదేశ్ ఆక్రమిస్తుంది. ఇవీ గణాంకాలు. ఇక అసలు విషయానికి వద్దాం.

భారతీయ ఇస్లాం సమాజంలో సంస్కరణల ఆవశ్యకత

మన హైదరాబాద్ ఇస్లాం రాజకీయనాయకుడు ఒవైసీ దేశవ్యాప్త ముస్లిం ప్రజానీకానికి నాయకుడిగా ఎదగాలనే తాపత్రయంలో సెక్యులరిజాన్ని పైకి ఎత్తి ప్రచారం చేస్తున్నా వాస్తవానికి ఇస్లాంకి, సెక్యులరిజానికి పొసగటం లేదంటే అతిశయోక్తి కాదు. పొసగాలి అంటే కావాల్సింది ఒవైసీ లాంటి నాయకులు కాదు, భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ లాంటి నాయకులు  రావాలి. ఒక రాజా రామమోహన రాయ్, ఒక దయానంద సరస్వతి, ఒక మహాత్మా గాంధీ లాగా ఇస్లాం సమాజాన్ని సంస్కరించే  సంఘ సంస్కర్తల అవసరం ఎంతయినా వుంది. స్వాతంత్రానంతరం హిందూ సమాజం లో వచ్చిన సంస్కరణలు ఇస్లాం సమాజంలో రాకపోవటం శోచనీయం. ఉదారవాదులనేవారు ఈ విషయం పై దృష్టి సారించకపోవటం ఇస్లాం సమాజానికి చేసిన అన్యాయంగా చెప్పుకోవాలి. హిందూ సంస్కరణలు కూడా వాటంతట అవి రాలేదు. సంప్రదాయవాదులు ఈ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకించారని మరవొద్దు. అంబేద్కర్ ఈ సంస్కరణల విషయమై విభేదించి మంత్రి పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి కూడా మరవొద్దు. అదే స్పూర్తితో ఇస్లాం సమాజంలో కూడా సంస్కరణలు జరిగివుంటే మన భారతీయ సమాజంలోని రెండు అతిపెద్ద మత సమాజాలు అభ్యుదయ పంధాలో పయనించి మానవ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించి ఉండేవి. అదే ఈ రోజు ముస్లిం సమాజం లో ఎక్కువమంది ఆధునిక విద్యకు నోచుకోకపోవటానికి కారణమయ్యింది. సంస్కరణల ఇస్లాం సమాజం ఆధునిక విద్యకు ప్రోత్సాహమిచ్చేది. సామాన్య ముస్లిం ప్రజానీకం విద్యావంతులై హిందువులతో పాటు సరిసమాన అభివృద్ధికి నోచుకొని వుండేవారు. దురదృష్టవశాత్తు ఈ ప్రాధమ్యాల పై దృష్టి సారించకుండా మదరసాల్లో ఎక్కువమంది చదువుకుంటే ఆధునిక భావాలతో మమేకం ఎలా అవుతారు? దీనికి సెక్యులరిజానికి సంబంధమేమిటని అనుకుంటున్నారా? ఎంతోవుంది. ఆధునిక భావాలనుంచే సెక్యులర్ భావాలు ఉద్భవిస్తాయి. ఒవైసీ చెప్పే ముస్లిం ప్రత్యేకవాదంతో ముస్లిం ప్రజలు ఇంకా వెనకబడి పోతారనేది మా ఆవేదన. ఇది ఓ సమాజాన్ని విమర్శించటానికి చేస్తున్న వాదన కాదు, సమాజాన్ని మిగతా సమాజంతో మిళితం చేయటానికి పడే ఆవేదన. భారతీయులందరూ సరి సమానంగా అభివృద్ధి కావటం లేదనే ఆవేదన. సచార్ కమిటీ నివేదిక చూసిన తర్వాత ముస్లింలు ఈ దేశంలోని దళితులు, ఆదివాసుల కన్నా వెనకబడి పోయారనే ఆవేదన. ఇప్పటికైనా భారతీయ ఇస్లాం సమాజంలో సంస్కరణల కోసం కృషిచేసే మేధావులు ముందు కొస్తారనే ఆవేదన. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని గుర్తుచేస్తున్నాము, అవి ఇక్కడ జరగకూడదనే మా ఈ భావ వ్యక్తీకరణ.

ఇస్లాం ప్రపంచం సెక్యులరిజంతో ఘర్షణ పడుతుంది

ఇది వాస్తవం. సామాజిక శాస్త్రవేత్తల అధ్యయనం ఇది. ప్రస్తుతం పారిస్ లో జరుగుతున్న పరిణామాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. మన పొరుగుదేశం పాకిస్తాన్ లో జరుగుతున్న పరిణామాలు ఇదే సూచిస్తున్నాయి. ఇటీవల బెంగుళూరు లో జరిగిన ఘటనలు ఇదే చెబుతున్నాయి. అవేమిటో వివరంగా పరిశీలిద్దాం. ఆధునిక సమాజానికి, ప్రజాస్వామ్యానికి మూల ఇరుసు సెక్యులరిజం. ఇవి ఫ్రెంచ్, యురోపియన్ భావజాలంతో ప్రభావితమయ్యాయి. మొట్టమొదటి ఆధునిక ప్రజాస్వామ్య రిపబ్లిక్ 1767లో అమెరికాలో ఏర్పడింది. ఆ స్వాతంత్రప్రకటన మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్య వాదులను ఉత్తేజపరిచింది. ప్రతిఒక్క పౌరుడు తమ తమ అభిప్రాయాలను స్వేచ్చగా వ్యక్తం చేసుకోవచ్చు. ఏ మత విశ్వాసాన్నయినా స్వేచ్చగా పాటించవచ్చు. అసలు ఏ మతాన్ని నమ్మకుండా హేతువాద దృక్పధం తోనూ ఉండొచ్చు. ఇదే అసలు సిసలైన సెక్యులరిజం. అదే సమయంలో పౌరులందరూ సమాజంలో ఒకే విధమైన నియమ నిబంధనలు,ఆదర్శాలు పాటించాలి. అదే వుమ్మడి పౌర స్మృతి. ఇదే అసలు సిసలైన సెక్యులరిజం. ఈ దృక్పదాన్నే ఆ తర్వాత అనేక యురోపియన్ దేశాలు పాటించాయి. అయితే దీనికి కొంత సవరణ కూడా వుంది. చాలా యురోపియన్ దేశాల్లో క్రైస్తవాన్ని అధికారిక మతంగా ప్రకటించారు, కాని మిగతా మతాలను సమాన దృక్పధం తో చూస్తారు. మతాన్ని నమ్మని వాళ్ళను కూడా సరిసమానంగా చూస్తారు. ఇది కూడా సెక్యులర్ సిద్ధాంతంగా చూస్తున్నారు. ఇవి రెండు ఆచరణలో పౌరులకు పూర్తి భావ స్వేచ్చను ప్రసాదించాయి. ఇందులో మతాలను విమర్శించే స్వేచ్చకూడా వుంది. ఇదే ఇస్లాం మెజారిటీ దేశాలతో పోల్చి చూద్దాం.

మొత్తం 58 ఇస్లాం మెజారిటీ దేశాల్లో దాదాపు 30 దాకా ఇస్లాంని అధికారిక మతంగా ప్రకటించాయి. అదీగాక ఈ దేశాల్లో ఇస్లాంకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ‘బ్లాస్ ఫెమి’ అంటే మత దూషణ చట్టాల కింద శిక్షార్హులు. ఇంకో తమాషా ఏమిటంటే సెక్యులరిజం పేరు చెప్పుకున్న అత్యధిక ముస్లిం దేశాలు మిలిటరీ నియంతృత్వ పాలనలోనో, పేరుకు ప్రజాస్వామ్యం తో చెలామణి అవుతున్న నియంతల( ఇవి మధ్య ఆసియా దేశాలు) పాలన లోనో మగ్గుతున్నవి. ఇవికాక ప్రజాస్వామ్య దేశాలు వున్నవి బహు కొద్ది మాత్రమే. అందులో కొన్ని ఇప్పుడు మతవాదం వైపు చూస్తున్నాయి. అవి ప్రధానంగా టర్కీ, ఇండోనేషియా, బంగ్లాదేశ్, మలేషియాలు. ఇందులో టర్కీ ఇప్పుడు ఎర్డ్ గోవిన్ నాయకత్వాన మతవాదం వైపు మొగ్గు చూపుతుంది. ఇటీవలే హాగియా సోఫియా మ్యూజియాన్ని తిరిగి మసీదుగా మార్చింది. ఇది అసలు చర్చ్. అలాగే మరికొన్నింటిని కూడా మార్చారు. ఇక మలేషియా లోని 9 సుల్తానేట్లు అధికారికంగా ఇస్లాం మతాన్ని ప్రకటించుకున్నాయి. ఈ తొమ్మిదింటిని కలిసే మలేషియా అంటారు. బంగ్లాదేశ్ మాత్రం అధికారికంగా ఇస్లాం మతాన్ని ప్రకటించుకున్నా సుప్రీం కోర్టు మాత్రం 1972 స్పూర్తినే కొనసాగించాలని తీర్పు చెప్పింది. ఇండోనేషియా ఒక్కటీ సెక్యులర్ రాజ్యాంగాన్ని ప్రకటించుకుంది. అయితే ఈ అన్ని దేశాల్లోనూ ఇస్లాం మత దూషణను ఆమోదించరు. ఒకవేళ ప్రభుత్వం చూసీ చూడనట్లు ఊరుకున్నా ఇస్లాం మత ప్రవక్తలు వూరుకోరు. అందుకే తస్లిమా నస్రీన్ ని దేశం నుంచి బహిష్కరించారు. ఇక పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా పంజాబ్ గవర్నర్ నే శిక్షించారు. అసలు మత దూషణ చట్టాల్ని పకడ్బందిగా అమలు చేస్తున్న దేశాల్లో ముందున్నది పాకిస్తాన్. అహామ్మదీయుల్ని ఇస్లాం మతస్తులు కాదని చట్టం చేసింది. ప్రస్తుతం షియాలను కూడా ఇస్లాం మతస్తులు కాదనే వాదన బలంగా వినిపిస్తుంది. వాళ్ళమీద దాడులు జరుగుతున్నాయి, వాళ్ళ మసీదులు తగలబెడుతున్నారు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదే భారతదేశంలో సున్నీలయినా, షియాలయినా, ఇస్లామీయులయినా, బోహ్రాలయినా, అహామ్మదీయులయినా, దూదేకులయినా స్వేచ్చగా ఇస్లాం మతస్తులుగా చెలామణి కావచ్చు. మరి ఈ స్వేచ్చ ఇస్లాం దేశాల్లో లేకపోవటానికి కారణం ఏమిటి? ఈ సమస్యను స్వేచ్చగా మాట్లాడుకోవాలి. గుంభనంగా వుంచితే నష్టం ఇస్లాంని నమ్మే సామాన్య ప్రజలకే. స్వేచ్చగా మత విశ్వాసాలను ఆచరించ లేకపోతే అది సెక్యులరిజంతో ఘర్షణ పడుతున్నట్లే కదా. అటువంటప్పుడు ఒవైసీ సెక్యులరిజాన్ని గురించి మాట్లాడటం బూటకం కాదా? తస్లిమా నస్రీన్ ని అడుగు పెట్టనివ్వననే ఒవైసీ సెక్యులర్ ఎలా అవుతాడు?    తనది ఇస్లాం వాదం, సెక్యులరిజం కాదు.

సెక్యులరిజానికి ఇస్లాంకి ఎందుకు ఘర్షణ జరుగుతుంది?

ఒక్కసారి ప్రస్తుత పరిస్థితుల్ని పరిశీలిద్దాం. పారిస్ లో ఒక టీచర్ ని ఇటీవలే తల నరికేశారు. ఎందుకో తెలుసా తను మహమ్మద్ ప్రవక్త గురించి ఎవరో వేసిన కార్టూను ప్రదర్శించాడట. దీనికి మూలం 2015 లో చార్లీ హోబ్దే అనే పత్రిక మహమ్మద్ ప్రవక్త పై కార్టూన్ వేయటం. అప్పుడూ ఇలాగే జరిగింది. అలాగే ఇటీవల బెంగుళూరులో మహమ్మద్ ప్రవక్త మీద ట్వీట్ చేసారని దాడులు చేసి నానా భీభత్సం చేసారు. పాకిస్తాన్ లోనయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. ఇరాన్ లో నయితే హేతువాదులు,కమ్యూనిస్టులు పారిపోయి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. ప్రజాస్వామ్యానికి మూలసూత్రాలయిన సహనం, అవతలివారి భావాలకు ( నచ్చక పోయినా, వ్యతిరేకించినా) గౌరవం అనే పదాలకు ఈ దేశాల్లో అసలు చోటులేదు. ఈ మాట మాట్లాడితే మమ్మల్ని కూడా మతవాదులుగా చిత్రీకరిస్తారేమో. ఈ అసహనం ఆధునిక ప్రజాస్వామ్యానికి,సెక్యులరిజానికి బద్ధ శత్రువులు. అమెరికాలో,యూరప్ లో జీసస్ క్రీస్తుని విమర్శిస్తూ ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి, ఇప్పటికీ వస్తూనే వుంటాయి. అయినా వాళ్ళమీద దాడులు జరగటం లేదు. వాటిని ఖండిస్తూ మరికొన్ని పుస్తకాలు వెలువడుతూ వుంటాయి. ఎవరి స్వేచ్చవారిది, ఎవరి అభిప్రాయాలు వారివి. దేవుళ్ళపై సెటైర్లు వేస్తూ తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. వాటిని నిషేదించనూ లేదు, ఖండించనూ లేదు. మన దేశంలో దేవుళ్ళను, గుళ్ళను, జ్యోతిష్యాలను, వేదాలను విమర్శిస్తూ ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. వాటిని నిషేదించలేదు. కారణం మన దేశంలో వివిధ మతాలూ, విశ్వాసాలు అనాదిగా సహజీవనం చేసాయి. ఇటీవలే వీటిపై కొంత అసహనం,గొడవలు జరుగుతున్నా స్థూలంగా ఇప్పటికీ అన్ని భావాలను ప్రచారం చేసుకొనే స్వేచ్చ ఈ సమాజం కలిగివుంది. ఇదే అసలైన సెక్యులరిజం.

ఈ ఆధునిక భావాలకు పుట్టినిల్లయిన ఫ్రాన్స్ లో జరుగుతున్న పరిణామాలు అక్కడి సమాజం భరించలేక పోతుంది. మొత్తం పశ్చిమ యూరప్ లో ముస్లింలు ఎక్కువ వున్న దేశం ఫ్రాన్స్. షుమారు 9 శాతం ప్రజలు ముస్లింలు. ఎన్నో దేశాలనుంచి ముస్లింలు వలసవచ్చి ఫ్రాన్స్ లో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. కానీ ఇటీవలికాలంలో అసహన  ధోరణులు ముస్లిం సమాజంలో ప్రవేశించటంపై ఫ్రాన్స్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తపరుస్తుంది. గత రెండు,మూడు దశాబ్దాల జిహాది సంస్కృతి ప్రభావం అక్కడ ముస్లిం సమాజంపై పడుతుందని ఫ్రాన్స్ ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ఈ సంస్కృతిని ప్రచారం చేసే కొన్ని మదరసా స్కూళ్ళను మూసివేసారు. ఇటీవల టీచర్ ని చంపిన వ్యక్తి రష్యాలోని చెచెన్యా ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ ఇస్లాం ప్రత్యేకవాదం,రాడికల్ ఇస్లాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ముస్లింలలో ప్రచారాన్ని నిర్వహించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది.

ఇస్లాం మేధావులారా ఆలోచించండి

ఇస్లాం ప్రపంచం నిజమైన సెక్యులర్ సమాజం వైపు అడుగులు వేయాల్సిన తరుణం ఆసన్నమయింది. ఈ మాట అంటే ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమని ఎవరైనా భావిస్తే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఫ్రాన్స్ ని సెక్యులర్ ప్రభుత్వం కాదని ఎవరూ అనలేరు కదా. ఎంతోమంది ముస్లింలకు మెరుగైన ఉపాధికోసం ఆశ్రయమిచ్చిన సమాజం ఫ్రెంచ్ సమాజం. అభ్యుదయ భావాలకు పుట్టిల్లు ఫ్రాన్స్. మరి ఆ ప్రభుత్వం చేసే ప్రచారం వాళ్లకు వ్యతిరేకం కాదు. ఆధునిక సమాజ విలువల్ని అలవర్చుకుంటే అది వాళ్ళందరికీ మంచిదనే భావనతోనే ఆ ప్రచారం చేపట్టింది. మన దేశంలో కూడా ఇస్లాం సమాజంలో చదువుకున్న మేధావులెంతోమంది వున్నారు. వాళ్ళందరూ నడుం బిగించి ఇస్లాం సమాజంలో సంస్కరణలవైపు నడిపించాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ మాట చెప్పగానే కొంతమంది హిందూ సమాజంలో కూడా ఈ పని చేయాలని వాదన లంఘించు కుంటారు. దానిలో తప్పులేదు. కాకపోతే హిందూ సమాజంలో సంస్కరణలను ప్రోత్సహించే వారి శాతం అధికంగా ఉండటంతో ఇప్పటికే ఆ దిశగా ఎన్నో అడుగులు పడ్డాయి. ఇంకా కృషి చేయాల్సివుంది. అందరూకలిసి వుమ్మడిగా ఒకే మానవ సంబంధాల్ని ఆదర్శ సమాజం వైపు నడిపించాల్సిన బాధ్యత వుందని గుర్తు చేస్తూ ఈ చిన్ని ప్రయత్నం చేశాము. దీన్ని సానుకూలంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాము.

Back to top button