క్రీడలుజాతీయంరాజకీయాలుసంపాదకీయం

హైదరాబాద్ క్రికెట్ ఎందుకింతలా భ్రష్టుపట్టింది?

Why is Hyderabad cricket so corrupt?

మరికొద్ది రోజుల్లో దేశంలో ఐపీఎల్‌ సీజన్‌ స్టార్ట్‌ కాబోతోంది. ఈసారి స్వదేశంలోనే ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అందరికీ హాట్‌టాపిక్‌ అయింది హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌. అసోసియేషన్‌లో నెలకొన్న విభేదాలతో హైదరాబాద్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేకపోతోంది. ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌ కూడా హైదరాబాద్‌లో నిర్వహించకుండానే ఈసారి ఐపీఎల్‌ ముగియబోతోంది. దీనంతటికి కారణం అసోసియేషన్‌లోని రాజకీయాలేనని పలువురి అభిప్రాయం.

భారీ మెజారిటీతో గెలిచినా సీన్‌ రివర్స్‌ కావడానికి ఎంతో కాలం పట్టలేదు. నాడు జిందాబాద్‌ అన్నవాళ్లే నేడు ముర్దాబాద్‌ అనే పరిస్థితి. అన్నీ బౌన్సర్లే. హిట్‌ వికెట్‌ తప్ప మరో ముచ్చటే లేదు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో అజారుద్దీన్‌ చుట్టూ జరుగుతున్న గొడవలే తాజా చర్చకు కారణం. అజారుద్దీన్‌…! టీం ఇండియా మాజీ కెప్టెన్‌. హైదరాబాదీ క్రికెటర్‌. అజ్జూభాయ్‌ని హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రావాలని క్రికెట్‌ సంఘాలన్నీ అప్పట్లో కోరుకున్నాయి. సిటీలోని క్రికెట్‌ క్లబ్బులన్నీ ఏకమై.. అజార్‌ను హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా భారీ మెజార్టీతో గెలిపించాయి కూడా. ఆ తర్వాత పెనుమార్పులు వస్తాయని అంతా భావించారు. కానీ.. ఊహించని పరిణామాలు జరుగుతుండటంతో హెచ్‌సీఏ చరిత్ర మసకబారే ప్రమాదం కనిపిస్తోంది. అజార్‌ వెన్నంటి ఉన్నవాళ్లే ఇప్పుడు హ్యాండిచ్చారు. ఆయన సొంత ప్యానల్‌ నుంచే తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అజార్‌ అవునంటే.. మిగతావాళ్లు నో చెబుతున్నారు. ప్రతి విషయంలోనూ ఇదే రియాక్షన్‌ కనిపిస్తోంది.

* భగ్గుమన్న అంతర్గత విభేదాలు!
హెచ్‌సీఏ సెక్రటరీగా ఉన్న విజయానంద్‌కి, అధ్యక్షుడు అజారుద్దీన్‌కి మధ్య వైరం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. నాటి ఎన్నికల్లో అజ్జూభాయ్‌ మద్దతుతోనే సెక్రటరీగా గెలిచారు విజయానంద్‌. ఇప్పుడు ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా తయారైంది. ఇటీవల నిర్వహించిన హెచ్‌సీఏ సమావేశంలో ఇద్దరూ వేదికపైనే వాగ్వాదానికి దిగారు. వెంటనే మిగతా సభ్యులు సైతం అజార్‌పై విరుచుకుపడటంతో తీవ్ర గందరగోళానికి దారితీసింది. మొత్తానికి నివురు గప్పిన నిప్పులా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

* అజార్‌ను నిలదీసిన సభ్యులు!
సర్వసభ్య సమావేశానికి తెలంగాణలోని అన్ని జిల్లాల క్రికెట్‌ అసోసియేషన్ల సభ్యులు హాజరయ్యారు. జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధికి హెచ్‌సీఏ ప్రెసిడెంట్‌గా ఏం చేశారో చెప్పాలని అజార్‌ను నిలదీశారు. ప్రెసిడెంట్‌ పదవికి అనర్హుడని కొందరు.. ఆ పోస్ట్‌ నుంచి తప్పుకోవాలని మరికొందరు నినదించారు. ఆ సమయంలో అజార్‌కి మద్దతుగా ఒక్కగళం వినిపించలేదు. గొడవ చేస్తున్నవారిని వారించే ప్రయత్నం జరగలేదు. పైగా ఈ మొత్తం ఎపిసోడ్‌ను అక్కడే ఉండి చూస్తున్నవారు ఎంజాయ్‌ చేసిన పరిస్థితి.

* వివాదానికి కేరాఫ్‌ హెచ్‌సీఏ
హైదరాబాద్‌లో ఇప్పుడు క్రికెట్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చరచ్చగా మారాయి. ఈసారి హైదరాబాద్ నగరానికి ఐపీఎల్ లేకుండా పోవడం ఈ గొడవలకు ఆజ్యం పోసింది. సాధారణంగా క్రీడా సంఘాల్లో రాజకీయాలు ఉంటాయి. కానీ.. కొంత కాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలు సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అజారుద్దీన్ ఒక వర్గంగా.. మాజీ క్రికెటర్లు అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ మరో వర్గంగా ఉన్నారు. ఇది మార్చి 28న జరిగిన హెచ్‌సీఏ వార్షిక సమావేశంలో అజర్‌కు వ్యతిరేకంగా సభ్యులు బహిరంగంగా నినాదాలు చేసే వరకూ వెళ్లింది.

* గతంలోనూ ఎన్నో ఆరోపణలు
గతంలోనూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలో 2019 సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో మహ్మద్ అజారుద్దీన్ సంస్థ అధ్యక్షులుగా, విజయానంద్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పట్లో దాదాపు అన్ని వర్గాలూ అజారుద్దీన్‌కు మద్దతు ఇచ్చాయి. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో అజర్‌కు మంచి మెజార్టీ వచ్చింది. కానీ.. ఆ తర్వాత పరిస్థితి తారుమారైంది. అజర్ వచ్చాక కూడా అసోసియేషన్ పరిస్థితి ఏమీ మారలేదని, ఇంకా దిగజారిందనీ పలువురు బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ముంబయిలో కూడా ఐపీఎల్ జరుగుతుంటే, హైదరాబాద్‌లో మాత్రం మ్యాచ్‌లు జరగడం లేదు. ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగకపోవడంపై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దానం నాగేందర్ బహిరంగంగా ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడారు. ఇక టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి కారణం అజర్ నిర్లక్ష్యమేనని ప్రత్యర్థులు ఆరోపించారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

* ఉత్తమ మైదానం అవార్డులు వచ్చినా..
‘ఐపీఎల్ నిర్వహణలో గత నాలుగు సీజన్లలో హైదరాబాద్‌కి ఉత్తమ మైదానం అవార్డులు వచ్చాయి. కానీ ఈసారి మ్యాచ్‌లు జరగకపోవడానికి కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యమే. ఇది సిగ్గుచేటు. బాధాకరం. టైం లేని వాళ్లు బాధ్యతలు తీసుకోకూడదు. సంఘానికి మళ్లీ ఎన్నికలు పెట్టాలి’ అని శివలాల్ యాదవ్ మీడియాతో అన్నారు. మరోవైపు.. అజర్‌‌ స్పందిస్తూ.. ‘నేను బీసీసీఐతో మాట్లాడాను. షెడ్యూల్ ఖరారు చేయక ముందు కూడా చర్చించాను. వాళ్లు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. హైదరాబాద్‌కి మ్యాచ్‌లు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. అది బోర్డుకే తెలియాలి. నేను శక్తిమేరకు ప్రయత్నం చేశాను’ అని మీడియాతో చెప్పారు. నిజానికి, తాను హెచ్‌సీఏలో గత పాలకులు చేసిన లోపాలను చక్కదిద్దుతూ, బకాయిలు చెల్లిస్తూ సంఘాన్ని నిలబెడుతున్నానని అజర్ అంటున్నారు.

* కమిటీలు వేసినా.. పరిష్కారం కాని సమస్యలు
హెచ్‌సీఏలో ఈ వివాదాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. వీటిని పరిష్కరించి, సంస్థను ప్రక్షాళన చేయడం కోసం కోసం గతంలో ఎన్నో కమిటీలు వేశారు. వాటిలో జస్టిస్ లోథా కమిటీ ఒకటి. ఇది సంస్థ పరిస్థితి మెరుగుపర్చడానికి కొన్ని సూచనలు కూడా చేసింది. కానీ.. వాటిని ఇప్పటికీ అమలు చేయలేదు. లోథా కమిటీ నివేదిక ప్రకారం సంస్థలో ఒక అంబుడ్స్‌మెన్‌ను నియమించాల్సి ఉంది. కానీ.. మొన్న జరిగిన సమావేశంలో అది కూడా సాధ్యపడలేదు. దీని వెనుక కూడా రాజకీయాలు ఉన్నాయి. అజర్ వర్గం దీనికి ఒక రిటైర్డ్ జడ్జి పేరు సూచిస్తే అర్షద్, శివలాల్ వర్గం మరో రిటైర్డ్ జడ్జి పేరు చెబుతున్నాయి. దీంతో అది ఎటూ తేలలేదు. ఇక మిగిలిన చాలా పోస్టుల విషయంలో కూడా సందిగ్ధత ఏర్పడింది. ఇప్పుడు.. ఏప్రిల్ 11న జరిగే సర్వసభ్య సమావేశంపైనే అందరి దృష్టి ఉం

Back to top button