తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

కేంద్ర ప్యాకేజీ పై కెసిఆర్ కు ఎందుకంత కోపం?

కెసిఆర్ ఏది చేసినా వెనక రాజకీయ పరమార్ధం వుంటుంది. నిన్నటిదాకా మోడీ పై అభిమానం ఒలకపోసిన కెసిఆర్ కి అంత  సడన్ గా కోపమెందుకు వచ్చింది? కరోనా మహమ్మారి మొదలైన తర్వాత ప్రెస్ మీటుల్లో మోడీ తోటి అన్నిసార్లు మాట్లాడాను, ఇన్ని సార్లు మాట్లాడాను, ఇలా సలహాలిచ్చాను అని చెప్పే వ్యక్తి ఒక్కసారి ఈ ప్యాకేజీ బోగస్, మేమన్నా బిచ్చగాల్ల మనుకుంటున్నాడా అని మాట్లాడటం వెనక ఏదో రాజకీయకోణం వుండి వుండాలి. మాములుగా అయితే అసలు రాష్ట్రాల రుణ పరిమితి 3 శాతం నుంచి 5 శాతానికి పెంచటానికి నే నిచ్చిన సలహానే అని గొప్పలు చేసుకోవాలి. కానీ సీను రివర్స్ అయ్యింది. దానికి కారణమేమిటో పరిశీలిద్దాం.

ప్యాకేజీలో వివాదాస్పద అంశాలు 

విద్యుత్తు సంస్కరణలు : దీనికి ముందే విద్యుత్తు సవరణ బిల్లు ముసాయిదాను రాష్ట్రాలకు పంపటం జరిగింది. మాములుగా అయితే నిధుల కొరతతో సతమతమవుతున్న టైం లో 90 వేల కోట్ల రుణ సదుపాయం పంపిణీ సంస్థలకు కల్పించటాన్ని హర్షించాలి. కానీ దానికి పెట్టిన షరతులు, ముసాయిదా లో పొందుపరిచిన విషయాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు విద్యుత్తు పంపిణీ సంస్థల వ్యవహారం లో తన ఇష్టా రాజ్యంగా నడుస్తుంది. ఈ బిల్లు కనక ఆమోదం పొందితే ఆ పప్పులుడకవు. విద్యుత్తు టారిఫ్ యూనిఫారం గా అన్ని రంగాలకు వర్తించాలి. అంటే ఇప్పటిలాగా పారిశ్రామిక రంగానికి, వాణిజ్య రంగానికి ఎక్కువ వసూలు చేయ కూడదు. అదే సమయం లో నివాస సముదాయాలకు , వ్యవసాయానికి సబ్సిడీ ఇవ్వాలంటే ఆ డబ్బు నేరుగా ఇవ్వాలి. అది వంట గ్యాస్ లాగా నేరుగా ప్రజల ఖాతా లోకి జమ చేయాలి. తేడా అల్లా వంట గ్యాస్ రాయితీ గ్యాస్ కంపనీలు ఇస్తాయి , విద్యుత్తు రాయితీలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇక్కడే వచ్చిన చిక్కల్లా. ఇప్పటివరకు సబ్సిడీ మొత్తం పంపిణీ సంస్థలకు చెల్లించకుండా వాయిదాల పద్దతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వటం ఇకనుంచి కుదరదు. ఎప్పటికప్పుడు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అది ఖజానా పై భారం పడుతుంది. అంటే పంపిణీ సంస్థల ఆర్ధిక పరిస్థితి మెరుగుపడి అవసరమయితే తక్కువ ధరకు విద్యుత్తు ని అందించే వీలు కలుగుతుంది. అదివరకటి లాగా ఉచితాలు, రాయితీలు ఇష్టారాజ్యంగా ఇవ్వటానికి కుదరదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని బట్టి అవి అందించాల్సి వుంటుంది.  రెండోది, నియామకాలు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యాన జరుగుతాయి, రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టారాజ్యంగా జరగవు. మూడోది, విద్యుత్తు కాంట్రాక్టులు ఎప్పుడుబడితే అప్పుడు రద్దు చేసుకోవటం జరగదు. ఇవన్నీ అమలయితే కెసిఆర్ విద్యుత్తు రంగం పై అదివరకటి పట్టు కోల్పోయి నిబంధనల ప్రకారం విద్యుత్తు పంపిణీ సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయి. అది కెసిఆర్ కి ఇష్టం లేదు. తన అజమాయిషీ పోతుందని భావిస్తున్నాడు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ సంస్కరణలు : ప్యాకేజి లో ప్రకటించిన ఇంకో ప్రధాన సంస్కరణ వ్యవసాయరంగం. ఇప్పటివరకు కాలం చెల్లిన 1955 నిత్యావసరాల చట్టం, 1960 లలో ఏర్పడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చట్టాలతో ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయి. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వ అధ్వర్యం లో వుంటాయి. ఇందులో తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టటం తో పాటు, రైతుల ఉత్పత్తులపై పూర్తి అజమాయిషీ తో వాటి అమ్మకాలపై సెస్సు వేస్తూ వున్నాయి. ఈ మార్కెట్ కమిటీల్లో లైసెన్స్ వున్న వ్యాపారస్తులు కుమ్మక్కయ్యి రైతుకి గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు. 2017 సంవత్సరం లో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు, జంతుసంపద మార్కెటింగ్ పేరుతో ఓ నమూనా చట్టాన్ని తీసుకొచ్చింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ పంధాలో సంస్కరణలను తీసుకొచ్చాయి. ఎప్పటినుంచో కేంద్రం దీనిపై రాష్ట్రాలను ఒప్పించటానికి ప్రయత్నం చేస్తుంది. ఈ కరోనా మహమ్మారి నేపధ్యంలో ఈ పరిధిని విస్తృతం చేసింది. ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా మార్కెట్ సంస్థలు స్థాపించుకోవచ్చు. దీనితో మరిన్ని పెట్టుబడులు ఇందులోకి రావటమే కాకుండా రైతులకు మార్కెట్ లో మరింత ఛాయిస్ వుంటుంది. ఉత్పత్తి ని మార్కెట్టుకి తరలించకుండా , ఇంటిదగ్గరనుంచే అమ్ముకోవచ్చు. అలాగే దేశం లో ఎక్కడికైనా తన ఉత్పత్తిని తరలించుకోవచ్చు. సెస్సులు చెల్లించాల్సిన పనిలేదు. ఈ సంస్కరణలు అమలయితే వ్యవసాయ మార్కెట్ కమిటీల గుత్తాధిపత్యం బద్దలవుతుంది. రైతుకి మెరుగైన గిట్టుబాటు ధర , మార్కెట్ లో వినిమయదారుడికి మరింత చౌకగా లభ్యమయ్యే అవకాశముంది. అంటే మార్కెట్ లో పంట లభ్యత ని బట్టి పోటీ వుంటుంది. పోటీ ఎప్పుడూ అటు రైతు కి ఇటు వినిమయదారుడికి ఉపయోగపడుతుంది. ఇదో పెద్ద వ్యవసాయ సంస్కరణ. కానీ దీనితో ప్రభుత్వ గుత్తాధిపత్యం తగ్గుతుంది. అది రాష్ట్ర ప్రభుత్వానికి మింగుడు పడుతున్నట్లు లేదు.

రాష్ట్రాల రుణ పరిమితి పెంపు: కెసిఆర్ ఇంతకుముందు రాష్ట్రాల రుణ పరిమితిని రాష్ట్ర స్థూల ఉత్పత్తి లో 3 శాతం నుంచి 5 శాతానికి పరిమితిని పెంచమని కోరటం జరిగింది. అదే ఇప్పుడు కేంద్ర చేస్తే గగ్గోలు పెట్టటం జరుగుతుంది. అసలు కేంద్రం పెట్టిన షరతులు అంత ఇబ్బంది పెట్టేవి ఏమున్నాయి? ఒక దేశం, ఒక రేషన్ కార్దు అమలు, వాణిజ్య సులభతర విధానం, విద్యుత్తు పంపిణీ పనివిధానం మెరుగుదల, పట్టణ స్థానిక సంస్థల వనరుల సేకరణ. ఇందులో అంతగా అభ్యంతరం పెట్టాల్సిన అంశాలేమిటో అర్ధం కావటం లేదు. వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాలు సంస్కరణల్లో ముందున్నాయి. కాబట్టి సమస్య పెద్దగా వుండదు. చిన్న చిన్న అంశాల్లో దృష్టి సారించగలిగితే ఇవి అమలుచేయటం పెద్ద కష్టం కాదు. ఇవి ప్రతిపాదించింది ఫైనాన్సు కమీషన్ , దీనివలన దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో కూడా ఆర్ధిక క్రమశిక్షణ వస్తుంది.

ఇవీ ప్రధాన వివాదాస్పద అంశాలు . కానీ కెసిఆర్ ఏమి చేసినా  దానివెనక రాజకీయ పరమార్ధం వుంటుంది. రాష్ట్రం లో మెల్లి మెల్లిగా తెరాస కి ప్రత్యర్ధి గా బిజెపి ఎదుగుతుందనే భయం లోలోపల కెసిఆర్ ని వెంటాడుతుందని అనిపిస్తుంది. ఇటీవల పోతిరెడ్డిపాడు విషయమే తీసుకుందాం. ఆంధ్ర ప్రభుత్వం పోతిరెడ్డుపాడు పై టెండర్లు పిలవటం అంశాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర జల విద్యుత్తు మంత్రి దృష్టి కి తీసుకెళ్లటం , ఆయన వెంటనే కృష్ణా బోర్డుకి చెప్పటం , అదే విషయాన్ని తిరిగి బండి సంజయ్ కుమార్ కి లేఖ ద్వారా తెలపటం చక చకా జరిగిపోయాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడి మాట చెల్లుబాటు అయ్యిందన్నమాట. ఇది కెసిఆర్ లాంటి వ్యక్తి కి మింగుడుపడటం అయ్యేపని కాదు. అందుకే ఇంతకోపమని అనుకుంటున్నారు. ఈ రాష్ట్రం లో తన మాటే చెల్లాలి. ఇంకొకరు ఎవరూ ఎదగటాన్ని కెసిఆర్ తట్టుకోలేడు. అసలు రాష్ట్రం లో రాజకీయంగా తనని సవాలు చేసే వ్యక్తి , శక్తి వుండటం తన మనస్తత్వానికి గిట్టదు. అయితే తను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల నీడలో ఈ బలహీనత ప్రజల ముందు పెద్దదిగా కనిపించటం లేదు. అదే ప్రస్తుతానికి తనని కాపాడుతుంది. అయితే పరిస్థితులు ముందు ముందు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేము. రాజకీయాల్లో నాలుగు సంవత్సరాలు చాలా పెద్ద కాలమే.