తెలంగాణప్రత్యేకంరాజకీయాలు

ఈట‌లను జైలుకూ పంపిస్తారా?

Etela Rajenderమొన్న ఈట‌ల రాజేంద‌ర్ శాఖ తొల‌గించారు. నిన్న మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. మ‌రి రేపు ఏంటీ? ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో జోరుగా సాగుతున్న చ‌ర్చ‌. ఎక్క‌డ చెడింద‌న్న సంగ‌తి బ‌య‌ట‌కు తెలియ‌దుగానీ.. కేసీఆర్‌-ఈట‌ల మ‌ధ్య గట్టి వైర‌మే పాతుకుపోయింది. అయితే.. కేవ‌లం మంత్రి వ‌ర్గం నుంచో, పార్టీ నుంచో పంపించ‌డ‌మే కాకుండా.. జైలుకు సైతం పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారన్న‌చ‌ర్చ సంచల‌నం క‌లిగిస్తోంది.

ప్రెస్ మీట్లో కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్య‌లు చేసిన ఈట‌ల‌.. ఎన్ని రోజులు జైల్లో పెడ‌తావ‌ని కూడా ప్ర‌శ్నించారు. దీన్నిబ‌ట్టి వ్య‌వ‌హారం సీరియ‌స్ గానే ఉంద‌ని తేలిపోయింది. అయితే.. ఇప్పుడున్న భూముల క‌బ్జా ఆరోప‌ణ‌లే కాకుండా.. గ‌తంలో పౌర‌స‌ర‌ఫ‌రాల మంత్రిగా ఉన్న‌ప్పుడు తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా వివాదాస్ప‌దం చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అదేవిధంగా దేవ‌ర‌యాంజ‌ల్ భూముల విష‌యంలోనూ ఈట‌ల‌పై చ‌ర్య‌ల‌కు సిద్ధ‌మైన‌ట్టుగా తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌య‌మై విచార‌ణ క‌మిటీని కూడా నియ‌మించారు. నివేదిక ఎలా వ‌స్తుంద‌న్న‌ది ఊహించాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని అంటున్నారు. అయితే.. ఈ విష‌యంలో మిగిలిన పార్టీల నేత‌ల‌కు సైతం సంబంధాలు ఉన్నాయ‌ని, ఈ తేనె తుట్టెను క‌దిలిస్తే.. అంద‌రికీ చుట్టుకోవ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

మ‌రి, ఇంత‌గా కేసీఆర్ కక్ష‌గ‌ట్ట‌డానికి కార‌ణ‌మేంట‌నే ప్ర‌శ్న‌కు ఒకే స‌మాధానం చెబుతున్నారు విశ్లేష‌కులు. ఈట‌ల రాజేంద‌ర్ కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోవ‌డానికి సిద్ధ‌మ‌వ‌డ‌మే ఇందుకు కార‌ణంగా చెబుతున్నారు. సొంత పార్టీ పెట్ట‌డానికి కూడా ఈట‌ల రెడీ అవుతున్నార‌ని టాక్‌. ఈ నేప‌థ్యంలో.. ఈట‌ల రాజ‌కీయంగా ఎలాంటి ముంద‌డ‌గూ వేయ‌కుండా ఇలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ని బ‌హిరంగంగానే చ‌ర్చించుకుంటున్నారు.

అయితే.. జైలుకు పంపిస్తే కేసీఆర్ ల‌క్ష్యం నెర‌వేరుతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే ఈట‌ల‌కు సోష‌ల్ మీడియాలో సానుభూతి వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదంతా రాజ‌కీయ క‌క్ష అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు జైలుకు కూడా పంపిస్తే.. ఇది మ‌రింత పెరుగుతుంద‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే జ‌రిగితే ఈట‌ల ఇంకా హీరోగా మారిపోయినా ఆశ్చ‌ర్యం లేదంటున్నారు. మ‌రి, ఫైన‌ల్ గా ఏం జ‌రుగుతుంది? టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? అన్న‌ది చూడాలి.

Back to top button