అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్గెస్ట్ కాలమ్రాజకీయాలు

పవన్ కళ్యాణ్ కాపు కులంలో ఛాంపియన్ గా నిలుస్తాడా?

Will Pawan Kalyan be the champion of the Kapu caste?

‘కులం నీకు ఏమిచ్చింది.. కొట్టుకోవడానికి మనుషులను ఇచ్చింది.. చంపుకోవడానికి ప్రత్యర్థులను ఇచ్చింది’ అని కొందరు కుల ఛాందసవాదులు వెర్రిగా మాట్లాడుతారు. నేడు కులాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు లేవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉపన్యాసాలలో మాత్రమే కులరహిత రాజకీయాలు మాట్లాడతారు కానీ తెరవెనుక అంతా కులంతో ముడిపెట్టి రాజకీయం నడుపుతారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కులరహిత రాజకీయాలే నడపాలని మనసా వాచా భావించి ఉండవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవి సాధ్యపడవనేది వాస్తవం. పవన్ కళ్యాణ్ కాపు కులస్థుడని తమ సామాజిక వర్గానికి అండగా నిలుస్తాడని, అతని ద్వారా, అతడు స్థాపించిన పార్టీ ద్వారా తమ రాజ్యాధికారం సాధ్యమని కాపులు నమ్ముతున్నారు. తమ కులానికి అపరిష్కృతంగా ఉన్న బీసీ సమస్యల్లాంటివి పరిష్కారమవుతాయని కూడా ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలని గ్రహించడానికి ఎక్కువకాలం పట్టలేదు.

2014లో పార్టీ ప్రారంభోపన్యాసంలోనే తాను కులాలకతీతుడనని, అలాంటి ఆశలేవీ జనసేన పార్టీతో పెట్టుకోవద్దని పవన్ కళ్యాన్ కుండబద్దలు కొట్టారు. బహిరంగ సభల్లో అలా మాట్లాడడం సహజమేనని ఆశావాదులు సరిపెట్టుకున్నారు. కానీ 2014 ఎన్నికల్లో అనూహ్యంగా జనసేన పార్టీ ఎన్నికల్లో పాల్గొనదనీ, టీడీపీ, బీజేపీలతో అలయెన్స్ తో ముందుకుపోతామని ప్రకటించారు. ఆనాడు కాపుల ఓట్లు గంపగుత్తగా పొందటానికి టీడీపీ కాపులకు తమ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానాల జల్లు కురిపించింది. అదీగాక పవన్ కళ్యాణ్ టీడీపీతో జతకట్టడం కాపులు కొండంత ఆశలతో టీడీపీని గెలిపించారు. అది గెలిచాక కాపులకిచ్చిన వాగ్దానాలు మరిచిపోయింది.

అటువంటి దశలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు సమస్యలపై ప్రభుత్వానికి తన లేఖల రూపంలో హెచ్ఛరించారు. ప్రభుత్వం పెడచెవిన పెట్టిన దశలో ముద్రగడ ఉద్యమబాట పట్టారు. టీడీపీతో అలయెన్స్ ఉన్న జనసేన పార్టీ ఆ విషయంపై ఏరోజూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయలేదు. పైగా పవన్ కళ్యాణ్ ముద్రగడగారి ఉద్యమంపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఒక మీడియా సమావేశంలో తన కాపు కులానికి చెందినవాడినైనందు వల్ల కాపుల సమస్యలపై స్పదించడం తనకి ఇబ్బంది కలిగించే అంశమని కూడా సెలవిచ్చారు. తదుపరి చంద్రబాబు ప్రభుత్వం కాపు ఉద్యమంపై, కాపునాయకులపై నిర్భంధం ప్రయోగించిన సమయంలోనూ పవన్ కళ్యాణ్ నోరు మెదపలేదు.

ముద్రగడ కుటుంబంపై చంద్రబాబు పోలీసులతో పాశవిక దాడి జరిపినప్పుడు కాపునాయకులంతా, మెగాస్టార్ చిరంజీవి, స్వర్గీయ దాసరి నారాయణరావులాంటి అగ్రతారలు, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పళ్ళంరాజు, వి. హనుమంతరావులాంటి రాజకీయ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. కాపు కుల ఐక్యతను చాటి అప్పటి ప్రభుత్వానికి నిరసన తెలిపి అల్టిమేటం జారీ చేశారు. అప్పుడు తనకి పట్టని వ్యవహారంలా పవన్ కళ్యాణ్ వ్యవహరించాడు. ముద్రగడ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు స్పెషల్ విమానంలో అమరావతికి రప్పించుకొని పవన్ కళ్యాణ్ కు సన్మానం చేసి, విందుభోజనాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ తనతోటే ఉన్నాడనే సంకేతాలు ప్రజలలోకి పోయేట్లు చేశాడు. ఇది ఆనాడు కాపులు జీర్ణించుకోలేని సమస్య.

ఇవన్నీ ఒకెత్తు 2019 ఎన్నికల్లో పాత మిత్రులు టీడీపీ, బీజేపీతో కాకుండా కొత్త రాజకీయ సమీకరణలతో పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి వెళ్లారు. కాపు ఉద్యమ నేతలెవరినీ పార్టీలోనికి తీసుకోకుండా కాపునేత ముసుగు తొడుక్కున్న టీడీపీ వారిని పార్టీలోకి తీసుకొని వారినే కాపు నాయకులుగా పార్టీ ముందు పెట్టడంతో జనసేన పార్టీపై కాపులకు అపనమ్మకం ఏర్పడింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకటే అని వైసీపీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో పార్టీ విఫలమైంది. అధికార పార్టీని ప్రధాన శత్రువుగా చూడాల్సిన సమయంలో ప్రతిపక్ష పార్టీని శత్రువుగా చేసుకొని వ్యూహరచన చేయడం “బూమరాంగ్” అయి వైసీపీకి లాభం చేకూరింది.

మొత్తంగా నాటి రాజకీయాలు కాపులకు తమ జాతివాడయిన పవన్ కళ్యాణ్ స్వజాతిలో జనసేన పార్టీ పట్ల విశ్వాసం కలిగించలేక పోయారు. ఈ కారణంతోనే గత కాపుల పార్టీ ప్రజారాజ్యంకి 60%పైగా ఓట్లేసిన కాపులు జనసేన పార్టీకి 10% కూడా వేయని పరిస్థితి వచ్చింది. తదనంతర కాలంలో జనసేన పార్టీలోని చాలా భాగం కాపులు ఆ పార్టీని వీడారు. కాపులని చిన్నచూపు చూస్తారనే భావంకూడా వారికి కలిగింది.

కాపుల సంఘాలలో కానీ కాపుల సమస్యల పట్లగానీ ఏనాడు ఎటువంటి సంబంధమూ లేని కాపుకులానికి చెందిన కురువృద్థుడు చేగొండి హరిరామజోగయ్య తాజాగా చావుకు దగ్గరైన వేళ కాపుసంఘం స్థాపించడం ఒకవింత. దీని వెనుక ఎవరున్నా సంఘంలో ఉన్నవారందరూ జనసేన పార్టీకి చెందిన కాపులే! గతంలో ఇదే హరిరామజోగయ్య శల్య సారధ్యమే మెగాస్టార్ చిరంజీవిగారు ఓడిపోడానికి కారణంగా చెప్పుకుంటారు. అదే హరిరామజోగయ్యకి నేడు పవన్ కళ్యాణ్ కాళ్ళు మొక్కేటంత ఆరాధ్యుడయ్యాడు. ఆయన స్థాపించిన ‘కాపు సంక్షేమ సేన’తో కాపుల సమస్యలపై చర్చిస్తామనడంలో అంతరార్థం ఏమిటి? లక్షలాది మంది కాపులు రోడ్డెక్కి సమస్యలపై పోరాడుతున్నప్పుడు చలించని పవన్ కళ్యాణ్ లో అకస్మాత్తుగా ఈ చలనమేమిటి? ఇప్పటికైనా కాపుజాతి ఆరాధించే నాయకుడు పవన్ కళ్యాణ్ కాపుల పక్షాన నిలబడితే కాపులు అంతకంటే కోరుకొనేది మరొకటుండదు.

కాపుల సమస్యలపై చిత్తశుద్దితో కృషి చేయదలుచుకుంటే నేడు ముందుగా చేయవలసింది జనసేన పార్టీ మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ముందు కాపుల బీసీ సమస్య ఉంది. పార్లమెంట్ లో 9వ షెడ్యూల్లో పెట్టాల్సి ఉంది. జనసేన పార్టీ ఆ పని చేయగలుగుతుందా? ముద్రగడ పద్మనాభంగారైతే ఎంతోకాలంగా అతడిని బీజేపీలో చేరమని ఆ పార్టీ పెద్దలు కోరుతుంటే కాపుల బీసీ సమస్యని 9వ షెడ్యూల్లో పెట్టడం ద్వారాగానీ లేకుంటే మహారాష్ట్రలో మరాఠాలను బీసీలు చేసిన తీరునగానీ చేస్తే తను బీజేపీలో ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని చెప్పారు.

గత చంద్రబాబు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ నాడు కాపుల అభివృద్ధి కోసం.. రిజర్వేషన్ల కోసం ఎలాంటిచొరవ చూపలేదు. కనీసం పట్టించుకున్న పాపాన పోలేదన్న విమర్శ ఉంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే పవన్ కు కాపులు గుర్తొచ్చారా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాపుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికైనా కృషిచేయగలడా? కాపుసేనలతో సమావేశాల తర్వాతైనా అది చేస్తే కాపుజాతిలో అతడే ఛాంపియన్ అవుతాడు. లేదంటే మరో చిరంజీవిలా రాజకీయాల నుంచి వైదొలుగుతాడు.. ఏం జరుగుతుందనేది వేచిచూద్దాం..

-కేఎన్

Back to top button