క్రికెట్లోకి ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు.. కానీ, కొందరు మాత్రమే చెరగని ముద్ర వేస్తారు. ప్రేక్షకుల మనసులో చిరస్థాయికిగా నిలిచిపోతారు. అలాంటి క్రికెటర్లలో ఒకరు డేవిడ్ వార్నర్. క్రీజులోకి వచ్చాడంటే.. బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం అన్నట్టుగానే ఉంటుంది పరిస్థితి. తన జట్టుకు ఎన్నోసార్లు ఒంటిచేత్తో విజయాలు అందించిన డేవిడ్.. ఇప్పుడు మరోసారి రంగంలోకి దిగబోతున్నాడు. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్-2021 సీజన్ ప్రారంభం కాబోతున్న వార్నర్ విశ్వరూపాన్ని ఓ సారి గుర్తు చేసుకుందాం.
ప్రస్తుతం హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కెప్టెన్ గా ఉన్నాడు వార్నర్. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమైన ఆటగాళ్లలో ఒకరిగా ఉన్నాడు వార్నర్. ఐపీఎల్ తో వార్నర్ జర్నీ 2009-10 సీజన్ తో ప్రారంభమైంది. మొట్ట మొదటగా ఢిల్లీ డేర్ డివిల్స్ జట్టుకు ఆడాడు. మొదట్లో సాధారణంగానే ఉన్న వార్నర్ ఆటతీరు ఆ తర్వాత వేగంగా మారిపోయింది.
2014లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. ఆ సీజన్ లో విశేషంగా రాణించిన వార్నర్.. ఆ తర్వాత 2015లో జట్టు కెప్టెన్ అయ్యాడు. ఈ సీజన్లో తనదైన కెప్టెన్సీతోపాటు అద్భుతమైన ఆటతీరుతో స్ఫూర్తివంతమైన నాయకుడిగా నిలిచాడు. మొత్తం 14 మ్యాచులు ఆడిన వార్నర్.. 562 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ సూపర్బ్ ప్రదర్శనతో ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు.
కెప్టెన్ అయిన తర్వాత తొలి సీజన్లో జట్టుకు టైటిల్ అందించలేకపోయాడు వార్నర్. ఆ తర్వాత 2016 సీజన్లో మాత్రం టైటిల్ ను వదులుకోవడానికి సిద్ధపడలేదు. జట్టును ఫైనల్ చేర్చిన వార్నర్.. బెంగళూరుతో జరిగిన ఫైనల్మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కేవలం 38 బంతుల్లోనే 69 పరుగులు పూర్తిచేసి, జట్టుకు టైటిల్ ను సాధించిపెట్టాడు. ఈ సీజన్లో మొత్తం 848 పరుగులు సాధించాడు.
2017లోనూ వార్నర్ జోరు కొనసాగింది. ఈ సీజన్లో 58.27 సగటుతో 641 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ ను దక్కించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన ప్రతీ సీజన్లోనూ తన సత్తా చాటాడు. 2018లో మాత్రం బాల్ టాంపరింగ్ వివాదంతో సీజన్ కు దూరమయ్యాడు. 2014లో హైదరాబాద్ జట్టులోకి వచ్చిన నాటి నుంచి 2020 వరకు ప్రతీ సీజన్లో కనీసం 500 పరుగులు సాధించాడు. ఆ విధంగా ఐపీఎల్ చరిత్రలోనే మూడుసార్లు ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న బ్యాట్స్ మెన్ గా నిలిచాడు వార్నర్.
ఐపీఎల్ లో ఇప్పటి వరకూ 5 వేల పరుగులు పూర్తిచేసిన బ్యాట్స్ మెన్లు ఐదుగురు ఉన్నారు. వారిలో డేవిడ్ వార్నర్ కూడా ఉన్నాడు. మిగిలిన నలుగురూ భారతీయ ఆటగాళ్లు కాగా.. వార్నర్ మాత్రమే విదేశీ ఆటగాడు. 2021 సీజన్ ప్రారంభానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే.. కెప్టెన్ వచ్చేస్తున్నాడంటూ.. బాహుబలి పోస్టర్ ను మార్ఫ్ చేసి, గ్రాండ్ గా వెల్కం చెప్పింది టీమ్. మరి, ఈ సీజన్లో వార్నర్ ఎలాంటి ప్రతాపం చూపుతాడో చూడాలి.