జాతీయంరాజకీయాలువారాంతపు ముచ్చట్లు

మహిళలూ జిందాబాద్

ఆప్ విజయం వెనక మహిళలున్నారని సర్వేలు, పత్రికలూ ఘోషిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ తెలివిగల నాయకుడు. ఏమాత్రం స్మార్ట్ గా వున్న రాజకీయనాయకుడైనా మహిళలు ఎన్నికల్లో కీలకమని గ్రహిస్తున్నారు. ఇంతకుముందు అయిదేళ్లక్రితం నితీష్ కుమార్ బీహార్ ఎన్నికల్లో గెలవటానికి కూడా మహిళలే కారణమట. మద్యపాన నిషేధం వాగ్దానం చేసి దాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా ఉపయోగించటంతో బీహార్ లో మహిళలందరూ నితీష్ కుమార్ ని గెలిపించారు. అందుకే అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చాడు. అంతెందుకు మోడీ 2019 విజయం వెనక కూడా మహిళలే వున్నారట. తను ప్రవేశపెట్టిన ఉజ్వల పధకంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ మహిళలపేరుమీదే ఇచ్చాడంట. స్వచ్ఛ భారత్ ఉందనే వుంది మహిళల అభిమానాన్ని చూరగొనటానికి. ముమ్మూరు తలాక్ వాగ్దానంతో ముస్లిం మహిళలు కూడా గణనీయంగా మోడీ కి ఓటు వేశారంట . అదీ మహిళల శక్తి.
ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే అరవింద్ కేజ్రీవాల్ విజయం వెనక సునీత కేజ్రీవాల్ పాత్ర కూడా ఉందనేది. వరసగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో , లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయింతర్వాత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఆలోచించాడు ఎలా తిరిగిరావాలని. ఒకనాడు గెలవాలంటే గరీబీ హటావ్ , రోటి కపడా ఔర్ మకాన్ లాంటి ఆకర్షణీయమైన స్లోగన్లు ఇచ్చేవారు. ఇప్పుడు వాటిని ప్రజలు నమ్మటంలేదని గ్రహించారు. అందుకే మహిళా ఆకర్షిత పధకాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇప్పటికే మొహల్లా క్లినిక్కులు, 200 యూనిట్ల కరెంటు ఉచితం, 20 వేల లీటర్ల మంచి నీళ్లు ఉచితం లాంటి పధకాలు, ప్రభుత్వ స్కూళ్లలో విద్య పై దృష్టి పెట్టిన కేజ్రీవాల్ గెలవాలంటే ఇవి చాలవని గ్రహించాడు. ఇంట్లో వాళ్ళ ఆవిడ సలహాలు కూడా తీసుకుంటాడని అంటారు. పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరిగిన మున్సిపల్, లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోవటంతో డీలా పడిపోయిన ఆయనకు మహిళా జ్ఞానోదయమయ్యిందంట. అందుకే అద్భుతమైన ఐడియా వచ్చింది. ఢిల్లీలో రోజూ పనికోసం మహిళలు ఎంతో దూరం ప్రయాణం చేయటం తెలిసిందే. అందుకోసం ప్రతినెలా వాళ్ళ కొచ్చేదాంట్లో కొంతభాగం బస్సు ఛార్జీలకోసం ఖర్చుచేయక తప్పటంలేదు. ఆ బస్సు ప్రయాణాన్ని ఉచితం చేశాడు. అంతే ఒక్కసారి మహిళల్లో పెద్ద మార్పు వచ్చింది. వాళ్ళు దేశరాజకీయాలు, పౌరసత్వ చట్టాలు, షహీన్ బాగ్ నిరసనలు లాంటి అంశాలకు కాకుండా కేజ్రీవాల్ మాగోడు పట్టించుకున్నాడని, మా బతుకుల్లో వెలుగునింపాడనే భావనకు వచ్చారు. బీజేపీ దేశభక్తి కి ఆప్ ఉచితాలకి మధ్య ఆప్ వైపే మొగ్గారు. అరవింద్ కేజ్రీవాల్ ని మహిళలు నెత్తిన పెట్టుకున్నారు.

ఇప్పుడు ప్రతి రాజకీయపార్టీకి జ్ఞానోదయమయ్యిందంట. ఇక మహిళల ఆకర్షిత వాగ్దానాలు పోటెత్తుతాయంట. ఇప్పటివరకు గుజరాత్ మోడల్ ప్రచారం లో ఉంటే ఇప్పుడు ఢిల్లీ మోడల్ అందరికీ ఆదర్శం అవుతుందని అంటున్నారు. మరి మిగతా రాష్ట్రాల్లో కూడా బస్సు ప్రయాణాలు మహిళలకు ఉచితమవుతాయేమో చూడాలి. ఇటువంటి వాటిల్లో మన తెలుగు రాజకీయనాయకులు ముందువరసలో వుంటారు. ఆంధ్ర ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పథకంతో గట్టెక్కాలని అనుకోవటం వెనక మహిళా శక్తిని గుర్తించబట్టే. అయితే అది అంతగా క్లిక్ కాలేదు. మరీ ఎన్నికలకి జస్ట్ ముందు తీసుకొస్తే పెద్దగా పనిచేయలేదని అంచనా. జగన్ మోహన రెడ్డి అమ్మ ఒడి కూడా మహిళా ఆకర్షిత పథకమే. దానిమీద జగన్ ఆశలు పెట్టుకున్నాడు. కెసిఆర్ పెట్టిన కెసిఆర్ కిట్లు మహిళల్లో బాగా క్లిక్ అయ్యిందంట. ఇవన్నీ చూస్తుంటే మహిళలకు మహర్దశ పట్టుకుందని అనిపిస్తుందండోయ్. దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి . దీనితోనన్నా లింగ సమానత్వ దిశగా సమాజం పయనిస్తుందని ఆశించొచ్చా? ఇంతకీ పార్లమెంటు, శాసన సభల్లో ప్రాతినిధ్యం ఎప్పుడు పెరుగుతుందో మరి? సగం సంగతి దేముడెరుక మూడింట ఒక వంతన్నా ప్రాతినిధ్యం పెరగాలి కదా. అంటే రాజకీయనాయకులు మహిళల్ని ఇంకా ఓటు బ్యాంకు గానే చూస్తున్నారన్నమాట. మహిళలూ తొందరపడి బుట్టలోపడకండి. మీకు కావాల్సింది తాయిలాలు కాదు సాధికారత , మరిచిపోకండి.

ఇవీ ఈవారం ముచ్చట్లు , తిరిగి వచ్చే వారం కలుద్దాం .

….. మీ రామ్