Uncategorizedఅంతర్జాతీయంకరోనా వైరస్రాజకీయాలుసంపాదకీయం

కరోనా మహమ్మారి వ్యాప్తి లో చైనా పై నీలి నీడలు

చైనా పై రోజు రోజు కీ ఆగ్రహం ప్రపంచమంతటా కట్టలు తెంచుకుంటుంది. ఇది ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేము. కాకపోతే ఈ కోపం ప్రజలనుంచి ప్రభుత్వాలకు కూడా పాకింది. చైనా పై ఇంతకుముందెన్నడూ ఇంతటి వ్యతిరేకతను చూడలేదు. భారత్ లో 1962 నుంచి చైనా పై ప్రజల్లో సదభిప్రాయంలేదు. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీనికి కారణాలేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.

కరోనా మహమ్మారి విస్తరణలో చైనా పాత్రపై అనుమానాలు

చైనా లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న మానవ హననం అందర్నీ కలిచివేస్తుంది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చైనా పై నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. కారణం ఇది చైనా లో పుట్టినందుకు కాదు. దాని పుట్టుక, విస్తరణ, ప్రభుత్వ గోప్యత ప్రధానంగా ఈ నిరసనలు రగులుతున్నాయి. ముందుగా ఈ వైరస్ చైనా ఊహాన్ తడి మార్కెట్టులో పుట్టటం పైనే అనేక అనుమానాలున్నాయి. కొంతమంది అసలు ఇది తడి మార్కెట్టులో పుట్టలేదని, ఊహాన్ ల్యాబ్ లో ప్రయోగాల విఫలంలో జన్మించిందని నమ్ముతున్నారు. మరికొంతమంది ఇది కెనడా ల్యాబ్ నుంచి ఊహాన్ ల్యాబ్ కి వచ్చిందని అక్కడినుంచి ప్రభుత్వ నియంత్రణలోనే పద్దతిగా విస్తరించిందని నమ్ముతున్నారు. ఆ ఆరోపణలతో అంతర్జాతీయ న్యాయ స్థానం లో కేసు దాఖలు చేయటం జరిగింది. దీని విస్తరణ పై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఇది హద్దులులేని పద్దతుల్లో వ్యాప్తి చెందేటట్లయితే చైనా లోని మిగతా ప్రాంతాలకు ఎందుకు విస్తరించలేదని కూడా ప్రశ్నిస్తున్నారు. జనవరి 21వ తేదీ ప్రపంచానికి తెలిసే లోపు కరోనా సోకిన వ్యక్తులు ఊహాన్ నుంచి ప్రపంచదేశాలకు ఎలా వెళ్ళారో అలానే చైనా లోని మిగతా ప్రాంతాలకు కూడా వెళ్ళారు కదా. అటువంటప్పుడు అతిపెద్ద నగరాలైన షాంఘై, బీజింగ్ లకు విస్తరించకుండా వుండే అవకాశాలు లేవు.

ఇక చైనా ప్రభుత్వ గోప్యతపై ఎంత తక్కువమాట్లాడితే అంత  మంచిది.కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఘోరకలిచూస్తూ కూడా మాట్లాడకపోతే ప్రపంచానికి, మానవాళికి అన్యాయం చేసిన వాళ్ళమవుతాం. ముందుగా ఈ వైరస్ విషయం లో చైనా ప్రభుత్వం ఎందుకంత రహస్యం గా వుంచిందనేది అంతుచిక్కని విషయం. మొట్టమొదటగా నవంబరులో బయటకు వచ్చిన తర్వాత డిసెంబరులో అనేక ప్రయోగశాలల్లో ఈ కొత్త వైరస్ గురించి వెలుగులోకి వచ్చింది. చైనా డాక్టర్ లి ఉదంతం అందరికీ తెలిసిందే. తను బయటపెట్టిన దగ్గర్నుంచి తన మీద ఎంతటి ఒత్తిడి తెచ్చారో చివరకి తను తప్పుచేసినట్లుగా బలవంతపు అఫ్ఫిడవిట్ఇప్పించారో కూడా ప్రపంచానికి తెలుసు. ఆ తర్వాత ౩ వారాల్లో అదే వైరస్ సోకి ఆయన మరణించటం తో చైనా లోనే నిరసనలు పెల్లుబికాయి. అయితే చైనా లో వున్నకేంద్రీకృత వ్యవస్థ వలన ప్రజలు స్వేచ్చగా అభిప్రాయాలు వ్యక్తపరచలేక పోవటం అందరికీ తెలిసిందే. ముందుగా సమాచారాన్ని నియంత్రించటం, నిరసనకారుల్ని నిర్బంధించటం, ఆ తర్వాత ప్రభుత్వ సమాచార వ్యవస్థ ద్వారా, పార్టీ ద్వారా సానుకూల వాతావరణాన్ని తయారు చేసుకోవటం చైనా చరిత్ర తెలిసిన ఎవరికీ ఆశ్చర్యాన్ని కలిగించదు. ఈ ఉదంతం లో చైనా కమ్యునిస్టు పార్టీ అధ్వర్యానే సమాచార నిర్బందాన్ని కొనసాగించటం అనేక అనుమానాలకు తావిస్తుంది. మిగతా ప్రయోగ శాలల్లో దొరికిన నమూనాలన్నీ నాశనం చేయమని చెప్పటంతో ఇందులో ఏదో జరగరానిది జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరకు ఊహాన్ లో మనుషులు రోడ్డు మీద పడిపోవటం చూపే వీడియో లు లీక్ అయ్యి తప్పనిపరిస్తితుల్లో చైనా ప్రభుత్వం ప్రకటన చేసేవరకు జరిగిన ప్రహసనం పై ఎన్నో కధనాలు ప్రపంచవ్యాప్తంగా వెలువడుతున్నాయి. వీటిపై ప్రపంచానికి చైనా వివరణ ఇవ్వాల్సి వుంది.

అసలు చైనా లో వ్యాధిసోకిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎంతమంది అనేదాంట్లో కూడా ప్రపంచానికి సందేహాలున్నాయి. ఇటీవలే చైనా డాక్టర్ ఒకావిడ ఇచ్చిన సమాచారం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మాదగ్గర ఐ సి యు బెడ్లు లేక చనిపోయిన వాళ్ళు ఎక్కువమంది వున్నారని చెప్పింది. రెండోది, చనిపోయిన వాళ్ళ నందరినీ కరోనా వ్యాధి కి బయటచూపించటం వలన ప్రభుత్వ లెక్కలు నిజాన్ని బయటపెట్టటం లేదనే వార్తలు వస్తున్నాయి. అందుకనే హాస్పిటల్ వర్గాలు దీనిపై నోరువిప్పవద్దని హెచ్చరించింది. ప్రజాస్వామ్య దేశమైన  మనదగ్గరే పశ్చిమ బెంగాల్ లో ఇలా లెక్కలు మార్చి చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపధ్యం లో చైనా లాంటి నియంతృత్వ దేశం లో ఇటువంటివి జరగటం పెద్ద విశేషమేమీ కాదు. ఇంకొన్ని వార్తలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. స్మశానాల్లో పేరుకుపోయిన 40 వేలకుపైగా బూడిద పాత్రలు, ఒక్కసారి లక్షకుపైగా పడిపోయిన ఫోన్ల సంఖ్య వార్తల్లో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఎంతయినా వుంది.

ప్రపంచవ్యాప్త నిరసనలు

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనా మహమ్మారి ని అరికట్టం లో నిమగ్నమై వుంది. ఈ పని పూర్తయిన తర్వాత చైనా చేసిన నిర్వాకంపై అన్ని దేశాలు విరుచుకుపడే అవకాశముంది. ఇప్పటికే ఎన్నో దేశాల్లో దీనిపై కార్యాచరణలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే చైనా తడి మార్కెట్లపై ఐక్యరాజ్యసమితి కి కంప్లయింట్ ఇచ్చింది. జపాన్ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థపై విరుచుకు పడింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నా లేక చైనా ఆరోగ్యసంస్థ నా అని ఎద్దేవా చేసింది. ఇంతజరుగుతుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాకు ఎందుకు కొమ్ము కాసిందో చెప్పాలని డిమాండ్ చేసింది. చివరివరకు చైనా ఏం చెబితే ఆ చిలక పలుకులే ఎందుకు మాట్లాడిందో వివరణ ఇవ్వాలని కోరింది. అమెరికా  అధ్యక్షుడయితే చైనా చరిత్రలో పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించాడు. బ్రిటన్ లో ప్రఖ్యాత చెందిన సంస్థ జి 7 దేశాలకు కంప్లయింట్ సమర్పించింది. అమెరికాలోని టెక్సాస్ జిల్లా కోర్టు లో దీనిపై కేసు వేసారు. చైనా పాత్రపై అనుమానాలున్నా ఏమి చేయాలో తెలియక ప్రజలు సతమతమవుతున్నారు. ఈ కరోనా మహమ్మారి సమసిపోయిన తర్వాత చైనా పై పరిణామాలు తీవ్రంగానే ఉంటాయనేది విశ్లేషకుల అంచనా.

చైనా పాత చరిత్ర కూడా ఇటువంటిదే

చైనా ను గురించి బయట ప్రపంచానికి తెలిసింది తక్కువ. ఆధునిక చైనా నిర్మాత సన్ యట్ సేన్ గొప్ప దేశ భక్తుడు, ప్రజాస్వామ్యవాది కూడా. చాంగై షేక్ చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత అది పూర్తి గా దిగజారింది. జపాన్ సామ్రాజ్యవాదం తో మిలాఖతయ్యింది. ఆ దశలో చైనా కమ్యూనిస్టు పార్టీ మావో సే టుంగ్ నాయకత్వాన స్వాతంత్ర  పోరాటం చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. ఇందుకు రష్యా తనవంతు పాత్ర పోషించింది. ఆ తర్వాత అదే రష్యా కి వ్యతిరేకంగా కమ్యునిస్టు ఉద్యమం లో చీలిక తీసుకొచ్చింది. మావో సే టుంగ్ అధ్వర్యంలో తీసుకున్న “గొప్ప ముందడుగు (Great Leap Forward)”   కార్యక్రమం లో ఎన్నో లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గొప్ప ముందడుగల్లా  గొప్ప దుందుడుకు గా చరిత్రలో నిలిచి పోయింది. అయినా దానిపై సానుకూల వార్తలే ప్రచారం లో పెట్టగలిగారు. జరిగిన మానవ ఘోరకలి క్రమ క్రమేనా నే ప్రపంచానికి తెలిసింది.

అసలు చైనా ని అమెరికా కమ్యునిస్టు రష్యా ని దెబ్బతీయటానికి దగ్గరకు తీసింది. రష్యా కి వ్యతిరేకంగా చైనా ని దువ్వి ఆ రెండింటి మధ్య చీలికని ప్రోత్సహించింది. రష్యా లో కమ్యునిస్టు వ్యవస్థ కుప్పకూలేవరకు చైనా రష్యా కి వ్యతిరేకంగానే వుంది. అంటే తన స్వంత ప్రయోజనాలకోసం అమెరికా పంచన చేరి రష్యా ని , దాని ప్రభావాన్ని తగ్గించటానికి పరోక్షంగా సాయ పడింది. ఇది చరిత్ర. అలాగే తోటి కమ్యూనిస్టు దేశమైన వియత్నాం పై యుద్దం చేసింది. చైనా ని గురించి చెప్పాల్సి వస్తే అది అంతర్జాతీయ దృక్పధం కన్నా జాతీయ వాదం తోనే నడుస్తూ వచ్చింది. జాతీయ వాదం పేరుతో స్వతంత్ర దేశమైన టిబెట్టు ని బలవంతంగా ఆక్రమించింది. వాయవ్య సరిహద్దు లోని జింజియంగ్ ప్రావిన్సు లోని ముస్లింలు చైనా సంస్కృతి ని పాటించటం లేదని వారి మసీదులపై నియంత్రణ పేరుతో వారి రోజువారి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటుంది. చివరకు పేర్లు కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం పెట్టుకోకుండా చేసింది. పది లక్షల మందిని  శిబిరాలకి తరలించి పునర్విద్య పేరుతో వాళ్ళను , వాళ్ళ మతం నుంచి వేరుచేసే ప్రయత్నం చేస్తుంది. అయినా బయట ప్రజలకు మానవ హక్కుల గురించి నీతులు వల్లిస్తూనే వుంది.

ఇక భారత్ విషయాని కొస్తే మొదట్నుంచీ భారత్ వ్యతిరేక ధోరణి నే కొనసాగిస్తుంది. దక్షిణాషియా లో భారత వ్యతిరేక కూటమి ని ప్రధాన ఇరుసు గా రాజకీయాలు చేస్తుంది. జమ్మూ-కాశ్మీర్ లోని 20 శాతం భూభాగాన్ని ఆక్రమించుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం గుండా చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా నిర్మిస్తుంది.  విశేషమేమంటే ఐక్యరాజ్యసమితి లో చైనా శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తనవంతు పాత్ర పోషిస్తే ఇప్పుడు భారత్ కి అందులో స్థానం రాకుండా మొకాలడ్డుకుంటుంది. చైనా తో స్నేహం కోసం నెహ్రు పరితపించేవాడు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా మొదట్నుంచీ చైనా వైఖరి పై హెచ్చరిస్తూనే వచ్చాడు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చైనా ఈ రోజేకాదు మొదట్నుంచీ పైకి చెప్పేదానికి లోపల చేసే దానికీ పొంతన వుండేది కాదని చరిత్ర చెబుతుంది.

మరి ఇప్పుడు ఏం జరగబోతుంది?

కరోనా మహమ్మారి తదనంతర పరిస్థితుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అవి ఏ దిశగా ఉంటాయనేది ఇప్పుడే చెప్పటం కష్టం. కొంతమంది చైనా అమెరికా స్థానం లో ప్రపంచ నాయకత్వ స్థానానికి ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. మరికొంతమంది చైనా కి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకమవుతాయని చెబుతున్నారు. కానీ ఇప్పటికే చాలా మందికి భారతదేశం లో అర్ధంకాని విషయం చైనా ఇప్పటికే అమెరికా స్థానాన్ని చాలా విషయాల్లో భర్తీ చేస్తూ వెళ్తుందని. మొత్తం ఆఫ్రికా దేశాల్లో చైనా ఈ రోజు అత్యంత ప్రభావిత దేశం. యూరోప్ లో కూడా చాలా ముందుకు చొచ్చుకు పోయింది. అతెందుకు భారత్ పొరుగు దేశాల్లో చైనా చాలా లోతైన సంబంధాలు పెట్టుకోగలిగింది. అమెరికా నయా వలస వాద ధోరణులను వ్యతిరేకించే మిత్రులు గ్రహించాల్సింది ఏమిటంటే చైనా ఈ రోజు అమెరికా స్థానాన్ని భర్తీ చేసి అతిపెద్ద నయా వలసవాద దేశంగా తయారయ్యిందనేది. మారుతున్న ప్రపంచ రాజకీయ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పసిగట్టకపోతే అంచనాలలో, ఆలోచనల్లో తప్పటడుగులు వేయటం సహజం. ఇప్పుడు భారత దేశం లోని చైనా మిత్రుల పరిస్థితి అదే. వచ్చే కొద్ది నెలల్లో ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.