క్రీడలుప్రత్యేకం

కేన్ మామ లేకుంటే సన్ రైజర్స్ గెలవదా?

Would Sunrisers have won without Kane Williamson?

ఐపీఎల్ లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి సన్ రైజర్స్ హైదరాబాద్ తేలిపోయింది. ప్రధానంగా ఓపెనర్లు టాప్ ఆర్డర్ బాగా ఆడుతున్నా.. మిడిల్ ఆర్డర్ తేలిపోవడంతో రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. మిడిల్ ఆర్డర్ లో బలమైన బ్యాట్స్ మెన్ లేకపోవడం ప్రధాన మైనస్ గా మారింది.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కు అవకాశం ఇవ్వకుండా తొలి మ్యాచ్ లో నబీని, రెండో మ్యాచ్ లో హోల్డర్ ను తీసుకున్నారు. వారు సరిగా ఆడలేక మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. కేన్ విలియమ్సన్ ప్రపంచంలో అత్యంత ఫేమస్ క్రికెటర్. అతను న్యూజిలాండ్ అంతర్జాతీయ క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. కేన్ విలియమ్సన్ కుడిచేతి వాటం బ్యాట్స్ మాన్. అప్పుడప్పుడు ఆఫ్-స్పిన్ బౌలర్ గానూ ఉపయోగపడుతుంటాడు. 2007లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కానీ ప్రస్తుతం మొదటి రెండు మ్యాచ్ లలో కేన్ ఆడకుండా బెంచ్‌ కే పరిమితమయ్యాడు. దీంతో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో రెండు మ్యాచ్ లలో పేలవమైన ఆటతో ఓడిపోయింది. దీంతో సన్ రైజర్స్ అభిమానుల నుంచి కేన్ విలియమ్సన్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. అతడు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుందని కోరుతున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్ రైజర్స్ బౌలింగ్ – బ్యాటింగ్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ మ్యాచ్‌లో ఒక్క బౌలర్ కూడా సరిగా బౌలింగ్ చేయలేదు. బ్యాట్స్ మెన్ అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన రెండో మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లు సత్తాచాటారు. ఆర్‌సిబి బ్యాట్స్‌మెన్‌లను తక్కువ స్కోరుకు పరిమితం చేశారు. బౌలర్లు చాలా మంచి ప్రదర్శన చేయగా.. బ్యాట్స్ మెన్ ఆ తక్కువ స్కోరును చేధించలేక వరుసగా క్యూ కట్టారు. వార్నార్ మరియు మనీష్ పాండేతో తప్ప మిగతా బ్యాట్స్ మెన్ అందరూ ఒత్తిడికి లోనయ్యారు. వరుసగా ఔట్ కావడంతో గెలిచే మ్యాచ్లో ఓడిపోయారు.

దీంతో సన్ రైజర్స్ అభిమానులు ఇప్పుడు కేన్ విలియమ్సన్‌ను టీంలోకి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే అతను మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయగలడు. కేన్ తన ప్రశాంతమైన బ్యాటింగ్ తో జట్టును ఒడ్డుకు చేర్చగలడు. ఎన్నో మ్యాచ్ లు గెలిపించిన అనుభవం అతడి సొంతం. జట్టులో అతని చేరిక ఖచ్చితంగా సానుకూల అంశంగా మారుతుందని అంటున్నారు. ఇప్పుడు ట్విట్టర్ లో ‘నో కేన్.. నో గెయిన్’ అంటూ కేన్‌ను జట్టులోకి చేర్చుకోవాలని అభిమానులు ట్వీట్లు పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఇది ఇప్పటికే ట్విట్టర్‌లో ట్రెండింగ్ లోకి వెళ్లింది.

Back to top button