ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

వ‌ద్ద‌న్నా.. జ‌గ‌న్ కు వాటా వచ్చేస్తోందిగా!

CM Jagan AP debts

ఆంధ్రుల హ‌క్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని అమ్మేయాల‌ని బీజేపీ స‌ర్కారు నిర్ణయించింది. అంతేకాదు.. చ‌క‌చ‌కా ప‌నులు చేసుకుంటూ వెళ్తోంది. ఇప్ప‌టికే టెండ‌ర్లు కూడా ఆహ్వానించింది. లీగ‌ల్ అడ్వైజ‌ర్ల‌ను కూడా నియ‌మిస్తూ.. వేగంగా ప్రైవేటీక‌ర‌ణ ప‌నులు చేస్తోంది. బేరం కుదిరితే వెను వెంట‌నే ఫ్యాక్టరీని కూడా అప్ప‌గించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతోంది. అయినా కూడా.. రాష్ట్రంలోని ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీలు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టుగా ఉంటున్నాయి. అయితే.. విప‌క్షాల సంగ‌తి ఎలా ఉన్నా.. అధికార పార్టీపైనే ప్ర‌జ‌ల‌ దృష్టి ఉంటుంది. కేంద్రంపై ఎలాంటి పోరాటం సాగిస్తుంది? అని ఖ‌చ్చితంగా ప‌రిశీలిస్తారు.

ఆ మ‌ధ్య జ‌గ‌న్ మాట్లాడుతూ.. ప్లాంట్ ఎక్క‌డికీ పోదు అని చెప్పారు. కేంద్రం ముందుకెళ్తే.. అడ్డుకునేందుకు అన్నిర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తామ‌ని కూడా కార్మికుల‌కు హామీ ఇచ్చారు. మ‌రి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. ఖ‌చ్చితంగా విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీని అమ్మి తీరుతామ‌ని కేంద్రం చెబుతుంటే.. ఆ వైపుగా వ‌డివ‌డిగా అడుగులు వేస్తుంటే.. జ‌గ‌న్ ఏం చేస్తున్నార‌ని కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు. కేంద్రం ప్రైవేటీకరణ ప్రక్రియలో వేగం పెంచినా.. అడ్డుకోవ‌డానికి జ‌గ‌న్ ఏమీ చేయ‌ట్లేద‌నే అభిప్రాయం జ‌నాల్లో బ‌లంగానే ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ కాబ‌ట్టి తాము అమ్ముతామ‌ని, ఎవ‌రి అభ్యంత‌రాలూ ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని కూడా కేంద్రం చెబుతోంది. ప్రైవేటీకరణ తమ పాలసీ అన్నట్టుగా పరోక్షంగా ప్రకటించింది కూడా. అయితే.. ఏపీ నుంచే మొదలు పెట్టడం గమనార్హం. చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌లున్నా.. ఏపీ నుంచి అమ్మ‌కాలు మొద‌లు పెట్ట‌డానికి రాజ‌కీయ కార‌ణాలు కూడా దోహ‌దం చేశాయ‌ని అంటున్నారు. ఇక్క‌డ బీజేపీ బ‌లం ఎంత‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. అందువ‌ల్లే.. త‌మ‌కు పెద్ద‌గా పోయేది ఏమీ లేద‌ని విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ అమ్మ‌కానికి సిద్ధ ప‌డింద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పై పెచ్చు.. ఆ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా బ‌లంగా పోరాడక‌పోవ‌డంతో.. కేంద్రం త‌న ప‌ని తాను చేసుకుపోతోంద‌ని అంటున్నారు.

నిజానికి.. ఈ విష‌యంలో రాష్ట్రంలోని ప్ర‌ధాన‌ పార్టీలు మొక్కుబ‌డిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. అటు వైసీపీగానీ, ఇటు టీడీపీగానీ కేంద్రాన్ని గ‌ట్టిగా నిల‌దీయ‌ట్లేదు. ప్రశ్నిస్తే ఎక్క‌డ త‌మ పాత‌ కేసులు తిర‌గ దోడుతారోన‌ని జ‌గ‌న్‌, చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ కార‌ణంగానే.. రాష్ట్రానికి ఇంత పెద్ద న‌ష్టం జ‌రుగుతున్నా.. వారు నోరు మూసుకొని ఉంటున్నార‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

అయితే.. బాబు విపక్షంలో ఉన్నాడు కాబ‌ట్టి ఆయ‌న‌పై ఫోక‌స్ త‌క్కువే. కానీ.. అధికారంలో ఉన్న వైసీపీ మీద‌నే గురి మొత్తం ఉంది. కేంద్రం ఫ్యాక్టరీని అమ్మేస్తున్నా.. జ‌గ‌న్ చూస్తూ కూర్చుంటున్నార‌ని, క‌నీసం ప‌ల్లెత్తు మాట కూడా మాట్లాడ‌ట్లేద‌నే విమ‌ర్శ‌లు బ‌లంగానే వినిపిస్తున్నాయి. ఆ విధంగా చూసుకున్న‌ప్పుడు.. వైసీపీకి నెగెటివ్ మార్కులు ప‌డే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. విశాఖ ఫ్యాక్ట‌రీని అమ్మేస్తున్న‌ది కేంద్ర‌మే అయినా.. అడ్డుకునేందుకు ఎలాంటి ప్ర‌య‌త్న‌మూ చేయ‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ ఖాతాలో కూడా పాపం వాటా ప‌డుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇది, రాబోయే రోజుల్లో బ‌ల‌మైన‌ ప్ర‌భావం చూపే అవ‌కాశం కూడా ఉండొచ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Back to top button