ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంరాజకీయాలు

తిరుపతి వైసీపీదే..కానీ 5లక్షల మెజార్టీ రాలే!

YCP won in Tirupati..but 5 lakh majority did not come

ఏపీ సీఎం జగన్ అంచనా తప్పింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేసిన వైసీపీ అదే ఊపులో తిరుపతిలోనూ దున్నేస్తారని అనుకున్నారు. ఏకంగా తాము 5 లక్షల మెజార్టీతో గెలుస్తామని వైసీపీ నేతలు తొడగొట్టారు. కానీ వారి అంచనా తప్పింది. కేవలం 2.25 లక్షల ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు.

వైసీపీకి టీడీపీ గట్టి పోటీనిచ్చింది. టీడీపీ అభ్యర్థి పనబాకలక్ష్మీ ఏకంగా 3లక్షలకు పైగా ఓట్లు సంపాదించి సత్తా చాటారు. దీంతో జగన్ సహా వైసీపీ నేతలు తిరుపతి ఉప ఎన్నిక ఏకపక్షంగా సాగుతుందని.. 5 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందన్న ప్రచారం ఒట్టి బుర్రకథగా మారిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ ఇక్కడ బలమైన పోటీనిచ్చినట్టు తెలుస్తోంది.

దివంగత వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ సాధించిన 2.28 ఓట్ల మెజారిటీ కంటే గురుమూర్తి అధిగమించారు. గురుమూర్తికి 5.33 లక్షల ఓట్లు రాగా.. పనబాక లక్ష్మీకి దాదాపు 3 లక్షల ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50వేల ఓట్లు వచ్చినట్టు సమాచారం. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2,25,773 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

మొదటి రౌండ్ నుంచి గురుమూర్తి ఆధిక్యం కనబరుచగా.. టీడీపీ రెండో స్థానం.. బీజేపీ-జనసేన మూడో స్థానానికి పరిమితమైంది. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి తన సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన పనబాక లక్ష్మీపై గెలుపొందారు.

అందరూ ఊహించినట్టుగా ఇక్కడ వైసీపీ 5 లక్షల మెజారిటీతో గెలుస్తుందని అనుకున్నా అది సాధ్యం కాలేదు. కేవలం 2 లక్షలకు పైచిలుకు ఓట్లు మాత్రమే సాధ్యమయ్యాయి. దీంతో వైసీపీ ఆశలు అడియాశలయ్యాయి.

ఇక బీజేపీ సత్తా చాటుతుందని ఆశించినా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ పోయిన సారి ఎన్నికల్లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఈసారి బీజేపీ శ్రేణులు కాస్త శ్రమించడంతో నోటాను మించి ఓట్లు సంపాదించడం విశేషం.

Back to top button