తెలంగాణరాజకీయాలు

షర్మిల మొదలెడుతుంది.. కాచుకోండి ఇక

YS Sharmila Padayatraవైఎస్ షర్మిల అక్టోబర్ 18న చేవెళ్ల నుంచి పాదయాత్ర చేసేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ ఆవిర్భావ సభలోనే వంద రోజుల్లో పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పిన షర్మిల ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అచ్చొచ్చిన చేవెళ్ల నుంచే పాదయాత్ర ఆరంభించేందుకు ఆలోచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ ను షర్మిల కూడా పాటిస్తున్నట్లు చెబుతున్నారు. సబితా ఇంద్రారెడ్డికి కూడా ఇదే సెంటిమెంట్ ఉన్నట్లు భావిస్తున్నారు.

తండ్రి బాటలోనే నడవాలని షర్మిల నిర్ణయించుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 18 నుంచి పాదయాత్ర ప్రారంభించి తెలంగాణ మొత్తం తిరగాలని భావిస్తున్నారు. షర్మిలకు పాదయాత్ర కొత్తేమీ కాదు. గతంలో తన అన్నయ్య జగన్ కోసం తెలంగాణలో పాదయాత్ర చేసిన అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. రంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పుడు అనుకోకుండా కాలికి గాయం కావడంతో కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకుని పాదయాత్ర మళ్లీ కొనసాగించారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన పదునైన పదజాలంతో అందరిని ఆకట్టుకుంది.

ప్రస్తుతం సొంత పార్టీ కోసం మళ్లీ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజన్న రాజ్యం తేవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు షర్మిల ప్రకటించారు. అందుకు అనుగుణంగానే పార్టీ విధానాలు, సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నట్లు ఇదివరకే తెలిసిందే. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా వైఎస్సార్ టీపీ నిలుస్తుందని తెలిపారు.

కానీ హుజురాబాద్ ఉప ఎన్నికలో మాత్ర పోటీ చేయడంలేదని ఇప్పటికే స్పష్టం చేయడంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే గురి పెట్టినట్లు భావిస్తున్నారు. రాబోయే సాధారణ ఎన్నికల కోసమే పార్టీని సమాయత్తం చేస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. పాదయాత్ర ద్వారా అధికారం దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యలో రాజన్న రాజ్యం కోసం షర్మిల ఏ మేరకు పథకాలు ప్రవేశ పెడతారో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. వైఎస్ ఆర్ తన ఆలోచన విధానంతో రాష్ర్టంలో చాలా మందికి అభిమానంగా మారారు. ఇప్పటికి కూడా ఆయన అభిమానులు ఉండడం గమనార్హం.

Back to top button