రిటైర్మెంట్ ప్రకటించిన ఇద్దరు క్రికెటర్లు.. ఎవరంటే?
Yusuf Pathan and Vinay Kumar are the two cricketers who have announced their retirement
ఒకప్పుడు టీమిండియాకు ప్రపంచకప్ ను సాధించి పెట్టిన గొప్ప క్రికెటర్ తాజాగా అవకాశాలు రాక.. మూసుకుపోయిన దారుల నేపథ్యంలో చివరకు రిటైర్ మెంట్ ప్రకటించాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ లు గెలవడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా ఆల్ రౌండర్ యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్ కు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన రిటైర్ మెంట్ ప్రకటించాడు.
తొలిసారి టీమిండియా జెర్సీ ధరించిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయని యూసుఫ్ పఠాన్ తెలిపాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ను భుజాలపై మోయడం తన కెరీర్ లోనే గొప్ప క్షణాలు అన్నాడు.
తనకు ఇన్ని అవకాశాలు ఇచ్చిన బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్ కు పఠాన్ ధన్యవాదాలు తెలిపాడు. అండగా నిలుస్తూ ప్రేమను పంచిన నా దేశానికి, కుటుంబానికి, స్నేహితులు, అభిమానులు, కోచ్ లకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇక నా కెరీర్ లో ఎదురైన అన్ని పరిస్థితులకు అండగా నిలిచిన నా సోదరుడు ఇర్ఫాన్ పఠాన్ కు కృతజ్ఞతలు తెలిపాడు పఠాన్.
38 ఏళ్ల యూసుఫ్ టీమిండియా తరుఫున 57 వన్డేలు, 22 టీ20లు ఆడాడు. రాజస్థాన్, కోల్ కతాలు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక పఠాన్ తోపాటు టీమిండియాకు ఆడిన మీడియం పేసర్ ఆర్ వినయ్ కుమార్ కూడా శుక్రవారమే రిటైర్ మెంట్ ప్రకటించాడు. ఇద్దరు క్రికెటర్లు ఒకేరోజు రిటైర్ మెంట్ ప్రకటించడం చర్చనీయాంశమైంది.